బీజేపీ మ్యానిఫెస్టో ఎన్నికల జిమ్మిక్కు..

BJP manifesto election gimmick..– సంక్షేమ పథకాలకు కోత
– ప్రజల్లో చీలికతెచ్చే కుట్ర : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విడుదల చేసిన బీజేపీ మ్యానిఫెస్టో ఎన్నికల జిమ్మిక్కుగా ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి విమర్శించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయలేదని తెలిపారు. తీవ్ర ఆర్ధిక దిగ్బంధానికి గురి చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్‌షా శనివారం ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలోని అంశాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదని గుర్తుచేశారు. తెలంగాణలో అమలు చేస్తామని ప్రకటించడం ప్రజలను మోసగించడమేనని తెలిపారు. ఈ మ్యానిఫెస్టో ప్రజల్లో చీలిక తేవడంతో పాటు, సంక్షేమ పథకాలకు కోతకోసేదిగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించి ఈ ఎన్నికల్లో మతోన్మాద, ప్రజా వ్యతిరేక బీజేపీనీ, దాని మిత్రపక్షాలను ఓడించి తగిన బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేశారు. 2014లో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేంద్ర బీజేపీ ప్రకటించి, వాటికి ఎగనామం పెట్టిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లక్షలాది ఖాళీలు నింపకుండా, ఇక్కడ ఉద్యోగాల భర్తీ చేస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉండి ద్రవ్యోల్బణాన్ని అరికట్టే అవకాశం ఉన్నప్పటికీ అరికట్టలేని బీజేపీ, రాష్ట్రంలో ఎలా అరికడుతుందని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జాలాలను పంపిణీ చేయకుండా ప్రాజెక్టులను ఆపిందని తెలిపారు. వ్యవసాయ రంగాన్నీ, వ్యవసాయ మార్కెట్లను కార్పోరేటీకరించాలని నాలుగు నల్లచట్టాలను తెచ్చిందని పేర్కొన్నారు. 23 వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే అశాస్త్రీయ మద్దతు ధర నిర్ణయించి కార్పొరేట్‌ వ్యాపారులకు లక్షల కోట్ల లాభాలు ఆర్జించి పెడుతున్నదన్నారు. కానీ నేడు తెలంగాణలో వ్యవసాయానికి ఎరువులు, సబ్సిడీలు, ధాన్యానికి మద్దతు ధరలు అమలుచేస్తామని ప్రకటించడం హాస్యాస్పదని తెలిపారు. ఎఫ్‌సీఐ ద్వారా దాన్య సేకరణ చేయకుండా తెలంగాణ రైతాంగాన్ని ముంచి, ఇప్పుడు రాష్ట్రంలో క్వింటాల్‌కు రూ.3,100 ఇస్తామని చెబుతున్నదని తెలిపారు.
కేంద్రంలో పదేండ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ రూ.3,100లు మద్దతు ధరను ఎందుకు నిర్ణయించలేదు?అని ప్రశ్నించారు. గత ఎన్నికల సందర్భంగా ప్రకటించిన పసుపుబోర్డు ప్రకటన శిలాపలకాలకే పరిమితమైందని గుర్తుచేశారు. దాన్ని టర్మరిక్‌ సిటీ చేస్తామంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. పార్లమెంటులో చిన్న సవరణ చేస్తే అమల్లోకి వచ్చే ఎస్సీ వర్గీకరణకు, ఇప్పుడు మళ్లీ కమిటీ వేస్తామనడం ఎన్నికల జిమ్మిక్కేనని విమర్శించారు. మైనారిటీలకు అమలవుతున్న రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటే ఇది ప్రజల్లో చీలికకు ఉపయోగపడేదేతప్ప మరొకటి కాదని తెలిపారు. మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ, విద్యారంగంలో జ్యోతిష్యాన్ని, కర్మకాండ లాంటి పాఠ్యాంశాలను చేర్చి దేశ నాగరికతను వేల సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్ళే విధానాలను అనుసరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రకటించిన మోసపూరితమైన మ్యానిఫెస్టో తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రం దోహదపడదని తమ్మినేని తెలిపారు.

Spread the love