కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీపై బీజేపీ దొంగాట

– దశాబ్దాల ఎదురుచూపు.. మోడీ విధానాలపై ప్రజల ఆగ్రహం
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి (దయాసాగర్‌)
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రైల్వే ప్రధాన కూడలిగా ప్రసిద్దిగాంచిన కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. 1980 నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంత ప్రజలు కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ కోసం ఎదురుచూస్తూ వున్నారు. 1982లో కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ మంజూరైంది. కానీ రాజకీయ కారణాలతో వేరే రాష్ట్రానికి తరలిపోయింది. కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని అనేక ఉద్యమాలు జరిగాయి. ఒకవైపు రైల్వే జేఏసీ నేతృత్వంలోనూ రాజకీయ పార్టీల నేతృత్వంలోనూ ఉద్యమాలు జరిగాయి. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014లో పేర్కొన్నా,..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. విభజన చట్టంలో హామీలను అమలు చేస్తామని మొదట ప్రకటించి… ఆ తర్వాత కేంద్రప్రభుత్వం కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో లేదని ప్రకటించింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో వున్నారు. బీజేపీ చేసిన మోసాన్ని తట్టుకోలేకపోతున్నారు.
మోడీ సొంత రాష్ట్రంలో రూ.20 వేల కోట్లతో లోకోమోటివ్‌..
ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక తాజాగా 2022లో గుజరాత్‌ రాష్ట్రంలోని దహౌడ్‌లో రైల్వే వ్యాగన్‌ పరిశ్రమను లోకోమోటివ్‌ ప్రొడక్షన్‌ ఫ్యాక్టరీగా ఉన్నతీకరించారు. దీనికి రూ.20 వేల కోట్లను కేటాయించారు. మోడీ సొంత రాష్ట్రంలో రూ.20 వేల కోట్లను కేటాయించుకొని ఉత్తర తెలంగాణ రైల్వేకు గుండెకాయగా వున్న కాజీపేట జంక్షన్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ముందుకు రాలేదు. దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట సెక్షన్‌లోనే అత్యధిక ఆదాయం వస్తుంది. అలాంటి కాజీపేట జంక్షన్‌ను నిర్లక్ష్యం చేయడం పట్ల రైల్వే కార్మికులు మాత్రమే కాకుండా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి.
ఊరించి ఉసూరుమనిపించి..
కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ అందని ద్రాక్షేనా అన్న చందంగా మారిందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. సింగరేణి మైన్స్‌ ఈ ప్రాంతంలో వుండడంతో దక్షిణ మధ్య రైల్వేలోనే కాజీపేట సెక్షన్‌లో అత్యధిక ఆదాయం ఈ ప్రాంతం నుండే వస్తోంది. అలాంటి రైల్వే జంక్షన్‌లో కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుండా, బీజేపీ ప్రభుత్వం డ్రామాలు చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రతి రైల్వే బడ్జెట్‌లో కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్‌లు ప్రధాన డిమాండ్‌లుగా వుండేవి. అలాంటిది ఏకంగా మోడీ ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌నే ఎత్తివేసి కేంద్ర బడ్జెట్‌లోనే రైల్వేను ఒక సబ్జెక్ట్‌గా మార్చివేసింది. ప్రధాని మోడీ అవలంబిస్తున్న విధానాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.

Spread the love