బయ్యారంపై బీజేపీ ఉక్కుపాదం

– స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఆశలు లేనట్టే..!
– గుజరాత్‌ అదానీ ఫ్యాక్టరీకి బైలడిల్లా ఖనిజం
– కేంద్రం తీరుపై బీజేపేతర పక్షాల ఆగ్రహం
– విభజన హామీలను నిర్లక్ష్యం చేస్తున్న బీజేపీ
– కేంద్రం తీరుకు నిరసనగా సీపీఐ(ఎం) ‘ప్రజాగర్జన’
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి (శ్రీనివాస్‌రెడ్డి)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలను కేంద్రం ఒక్కొక్కటిగా తుంగలో తొక్కుతోంది. దీనిలో బయ్యారంలోని ఉక్కు ఫ్యాక్టరీ ప్రధానమైనది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 13వ షెడ్యూల్‌లో పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం ఇచ్చిన హామీని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తోంది. బయ్యారం ఇనుప ఖనిజం సరిపోదనుకుంటే బైలడిల్లా నుంచి దిగుమతి చేసుకుని సరఫరా చేస్తామని తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని కోరింది. అయినప్పటికీ గుజరాత్‌లో అదానీ గ్రూపు నిర్మిస్తున్న ఉక్కు ఫ్యాక్టరీకి బైలడిల్లా నుంచి ఇనుప ఖనిజాన్ని కేటాయించడంతో బయ్యారం ఇనుప పరిశ్రమపై ఆశలు అడుగంటాయి. ఇదే కాదు ఇంకా అనేక ప్రజావ్యతిరేక విధానాలను కేంద్రం అనుసరిస్తోంది. వీటిపై సీపీఐ(ఎం) ఈనెల 17 నుంచి ‘ప్రజాగర్జన’ యాత్రలకు శ్రీకారం చుట్టింది.
సట్టుబండైన చట్టబద్ధ హామీ..
పునర్విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం రూ.36వేల కోట్లతో సెయిల్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తామని చట్టబద్ధమైన హామీ ఇచ్చారు. తొమ్మిదేండ్లుగా దీనికోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు నిరీక్షిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల 20వేల మందికి ఉపాధితో పాటు ఏజెన్సీ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ప్రజాప్రతినిధులు నివేదించారు. దీంతో స్టీల్‌ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం చట్టబద్ధమైన హామీ ఇచ్చింది. కానీ దాన్ని ఆచరణలో పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపడమే కాకుండా ఆ హామీని పూర్తిగా తుంగలో తొక్కేందుకు పూనుకుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు పలుమార్లు ప్రధాని, ఉక్కుశాఖ మంత్రిని కలుస్తున్నారు. పార్లమెంట్‌ సమావేశాలు, ముఖ్యంగా బడ్జెట్‌ సమావేశాల్లో దీనిని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పలురకాల సర్వేలు నిర్వహించి బయ్యారం ఇనుప ఖనిజం నాణ్యత, ఖనిజ నిక్షేపాల లభ్యత చాలినంతగా లేదని సర్వే సంస్థలు తేల్చాయి. ప్లాంట్‌ లాభదాయకం కాదని ప్రకటించాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం బయ్యారం ఉక్కుపై కొన్ని నెలల కిందట అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుకూలాంశాలపై రాష్ట్రప్రభుత్వం నివేదిక సైతం సమర్పించింది. కానీ ఇవేవీ కేంద్రం పట్టించుకోలేదు. పైగా ఇనుప గనులే లేని గుజరాత్‌కు బైలడిల్లా ఖనిజాన్ని కట్టబెట్టారు.
180 కి.మీ వదిలి.. 1800 కి.మీలకు కేటాయింపు..
బయ్యారం సమీపంలోని సింగరేణి నుంచి బొగ్గు, కేటీపీఎస్‌ నుంచి విద్యుత్‌, నీటి వనరులు, మాధారం డోలమైట్‌ గనులు, రైలుమార్గం అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి ఖనిజ నిక్షేపాలు సరిపోకపోతే 180 కి.మీ దూరంలోని బైలడిల్లా నుంచి ముడి ఇనుమును సొంత ఖర్చుతో దిగుమతి చేసుకుంటామని రాష్ట్రప్రభుత్వం సూచించింది. అయినా కేంద్రం పట్టించుకోకుండా 1800 కి.మీ దూరంలోని గుజరాత్‌ ముద్రా ప్లాంట్‌కు, 500 కి.మీ దూరంలోని విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయించడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
బయ్యారం ఉక్కుపై బీజేపీది ప్రతికూల వైఖరే..
బయ్యారం ఉక్కుపై మొదటి నుంచి బీజేపీ ప్రతికూల వైఖరితోనే వ్యవహరిస్తోంది. ఇక్కడ ఇనుప ఖనిజం నాణ్యమైనది కాదనే కల్లబొల్లి కబుర్లు చెబుతోంది. ఇక్కడ ఖనిజం నాణ్యమైనది కానప్పుడు అనేక ప్రయివేటు కంపెనీలు ఎందుకు తరలించుకు వెళ్లాయని ప్రశ్నిస్తున్నా. ఇప్పటికే 200 కంపెనీలు ఇక్కడి ఇనుప ఖనిజం కోసం అప్లికేషన్లు పెట్టాయి. మాజీ సీఎంలు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి.. రక్షణ, విశాఖ స్టీల్స్‌కు ఇక్కడి ఖనిజాన్ని కేటాయించారు. నాణ్యత లేకుండా ఇవన్నీ ఎలా సాధ్యం.
– గౌని ఐలయ్య, బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కమిటీ కన్వీనర
కేంద్రానికి తెలంగాణపై వివక్ష
కేంద్రం తెలంగాణపై వివక్ష పూరిత వైఖరితో ఉంది. దానికి బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీయే ప్రత్యక్ష నిదర్శనం. రాష్ట్రప్రభుత్వమే సొంత ఖర్చుతో రైలుమార్గం నిర్మించి బైలడిల్లా నుంచి ఇనుప ఖనిజం దిగమతి చేసి ఇస్తామని చెప్పినా కేంద్రం పట్టించుకోలేదు. ఏజెన్సీ ప్రజల బాగోగులు, గిరిజన అభివృద్ధి ఇవేవీ కేంద్రానికి పట్టడం లేదు.
– బానోత్‌ హరిప్రియ, ఎమ్మెల్యే ఇల్లందు
కేంద్రానికి చిత్తశుద్ధి లేదు..
కేంద్ర ప్రభుత్వానికి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై చిత్తశుద్ధి లేదు. అందుకే నాణ్యత ప్రమాణాలను కుంటిసాకుగా చూపుతోంది. ఇక్కడి ఖనిజం నాణ్యత 45 ప్లస్‌ అని నిపుణులు తేల్చినా కేంద్రం నాణ్యతాప్రమాణాలను సాకుగా చూపుతుండటంతో ఆశ్చర్యం గొల్పుతోంది. అదానీ, గుజరాత్‌ తప్ప కేంద్రానికి మిగిలిన ప్రాంతాలతో పనిలేదు. అందుకే వివక్షపూరితంగా వ్యవహరిస్తోంది. అందుకే కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) ప్రజాగర్జన యాత్ర 17 నుంచి చేపడుతుంది. ఈ యాత్రను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి. మన హక్కులను మనం పొందాలి.
– అన్నవరపు కనకయ్య,
సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి

Spread the love