వీధి కుక్క మేకలు గొర్రెలు రక్తంతో దందా ప్లేట్‌లెట్స్‌ను మనుషులకూ ఎక్కిస్తున్న వైనం నాడు నాగారం.. నేడు రాయదుర్గంలో వెలుగులోకి.. జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ అధికారులకు మెయిల్ ఫిర్యాదు స్వచ్ఛంద సేవ ముసుగులో వ్యాపారం.. పెట్స్‌కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సీజ్.. అమానవీయ దందాపై సర్కారు నిఘా వెల్లడవుతున్న విస్తుపోయే వాస్తవాలు నవతెలంగాణ- సిటీబ్యూరో గ్రేటర్ హైదరాబాద్ బ్లడ్ మాఫియాకు అడ్డాగా మారిపోయింది. ఇప్పటి వరకు మనుషుల రక్తంతోనే వ్యాపారం చేసిన కొందరు కేటుగాళ్లు నేడు వీధి కుక్కలు, మేకలు, గొర్రెల రక్తంతో దందాకు తెర లేపారు. మూగజీవాల రక్తం నుంచి ప్లేట్‌లెట్లను తీసి మనుషులకు ఎక్కిస్తూ ప్రాణాలతో చెలగాటమాడే మాఫియా గుట్టురట్టయిన కొద్ది రోజుల్లోనే.. పెట్స్ యజమానులను బెదిరించి కుక్కల రక్తం తీసి విక్రయిస్తున్న ముఠా పట్టుబడింది. ఇటీవల ప్లాస్మాను సేకరించి అమ్ముకున్న ప్రయివేటు బ్లడ్ బ్యాంకుల లైసెన్స్‌లు రద్దు చేయగా.. ఈ ఘటనతో పలు ఆస్పత్రులపై కూడా అధికారులు నిఘా పెట్టారు.
ఆస్పత్రి సీజ్
రాయదుర్గంలో ఉన్న పెట్స్‌కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మూగజీవాల రక్తంతో సాగిస్తున్న అమానవీయ దందా ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ నుంచి జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ అధికారులకు మెయిల్ చేయడం చేయడంతోపాటు వీధి కుక్కల రక్తాన్ని తీసి విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై స్పందించిన సైబరాబాద్ మున్సిపల్ అధికారులు విచారణ జరిపారు. ఈ దారుణాలపై 74 పేజీల సమగ్ర నివేదికను అధికారులు సిద్ధం చేసి ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆస్పత్రి యాజమాన్యం వీధి కుక్కలను బంధించి, వాటి నుంచి రెండు, మూడు సార్లు రక్తం తీసేవారని అధికారుల విచారణలో తేలింది. రక్తం తీసిన తర్వాత కొద్దిగా ఆహారం పెట్టి, మళ్లీ రక్తం తీసేవారని, ఇక ఆ కుక్కలో రక్తం లేదని నిర్ధారించుకున్నాక వాటిని శివారు ప్రాంతాల్లో పడేసేవారని అధికారులు గుర్తించారు. పదేండ్లుగా ఈ దందా సాగుతోందని, సమస్యలతో వచ్చే పెట్స్ యజమానులను భయపెట్టి, తప్పనిసరిగా రక్తం ఎక్కించాలని చెప్పి ఒక్కో బ్లడ్ యూనిట్‌కు రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటికే ఆస్పత్రి యజమాని, ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ వెంకటేష్ యాదవ్‌ను పశుసంవర్ధక శాఖ సస్పెండ్ చేసింది.
మనుషులకు మూగజీవాల రక్తం..!
ఇదేంటి మేకల రక్తాన్ని మనుషులకు ఎక్కిస్తారా..? అని ఆశ్చర్యపోకండి.. అవును.. అక్రమ సంపాదనకు అలవాటుపడిన బ్లడ్ మాఫియా ఈ తరహా దందాను ఎంచుకున్నది. మేకలు, గొర్రెల రక్తం నుంచి ప్లేట్‌లెట్లను తీసి మనుషులకు ఎక్కిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. ఇటీవల మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాగారంలో వెలుగు చూసిన ఈ ఘటన వైద్యరంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కీసర పోలీసులు నాగారంలోని చికెన్ షాపులపై దాడులు చేయగా.. 130 ప్యాకెట్ల మేకల రక్తం దొరికింది. ఈ రక్తాన్ని కాచిగూడలోని సీఎన్కే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్స్ సంస్థకు తరలించి.. అక్కడి నుంచి లేబొరేటరీల్లో ప్లేట్‌లెట్ల తయారీకి వినియోగిస్తున్నట్టు విచారణలో గుర్తించారు. ఈ ‘గోట్ బ్లడ్ మాఫియా’ ఎలాంటి వైద్య ప్రమాణాలు పాటించకుండా మేకలు, గొర్రెల నుంచి అక్రమంగా రక్తం సేకరించి, దాన్ని ప్లేట్‌లెట్ల తయారీకి తరలించడం అప్పట్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
స్వచ్ఛంద సేవ ముసుగులో వ్యాపారం
పలు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు హోల్ బ్లడ్ సహా ప్లాస్మా, ప్లేట్లెట్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. పలు బ్లడ్ బ్యాంకులను గుర్తించి, లైసెన్సులను రద్దు చేశారు. హోల్ బ్లడ్ సహా ప్లాస్మా, ప్లేట్టెట్స్‌ను ఆయా బ్లడ్ బ్యాంకుల సామర్థ్యానికి మించి నిల్వ చేసి, మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టిస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. బ్లడ్, ప్లాస్మాను అమ్ముకుంటున్న శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ బ్యాంకుల లైసెన్స్‌ను రద్దు చేశారు.
మూసాపేట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో హీమో సర్వీస్ పేరిట నడుస్తున్న ఓ ల్యాబ్‌లో డీసీఏ అధికారులు ఈ తనిఖీలు చేశారు. డీసీఏ లైసెన్స్ లేకుండా నడిపిస్తున్న ఈ ల్యాబ్ నుంచి తెలంగాణ, కర్నాటక, ఏపీలోని పలు ఫార్మా కంపెనీలు, హా స్పిటళ్లు, రీసెర్చ్ ల్యాబ్స్‌కు రక్తం, ప్లాస్మాను అక్రమంగా విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. మియాపూర్ మదీనగూడలోని శ్రీకర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దారుల్‌షిఫాలోని అబిద్ అలీఖాన్ లయన్స్ ఐ హాస్పిటల్స్‌లో ఉన్న న్యూలైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ సెంటర్ వాళ్లు డోనర్ల నుంచి రక్తాన్ని సేకరించి, ప్లాస్మాఫెరేసిస్ అనే ప్రక్రియ ద్వారా రక్తం నుంచి ఫ్లాస్మాను వేరు చేసి, హీమో సర్వీసెస్‌కు అమ్ముతున్నట్టు విచారణలో తేలింది. దీంతో ఆ రెండు బ్లడ్ బ్యాంకుల్లో సోదాలు చేసి ప్లాస్మా అమ్మకాలకు సంబంధించిన ఆధారాలను అధకారులు స్వాధీనం చేసుకున్నారు. 2016 నుంచి ఈ దందా జరుగుతోందనీ, లైసెన్స్ రద్దు చేసే నాటికి 6 వేల యూనిట్లకుపైగా ప్లాస్మా యూనిట్లను హీమో సర్వీస్ సేకరించిందని డీసీఏ అధికారులు గుర్తించారు. ఒక్కో యూనిట్ ప్లాస్మాను రూ.700కు కొని, రూ.3,800కు అమ్ముతున్నట్టు గుర్తించారు.
ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులపై నిఘా
ఇటీవల వరుస బ్లడ్ మాఫియా ఘటనలతో నగరంలోని అన్ని ప్రయివేటు పెట్ హాస్పిటల్స్, బ్లడ్ బ్యాంకులపై అధికారులు నిఘా పెట్టారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, డ్రగ్స్ కంట్రోల్, మెడికల్ కౌన్సిల్, వెటర్నరీ శాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీసులు కలిసి బ్లడ్ బ్యాంకులు, బయోలాజికల్ ఉత్పత్తుల ల్యాబ్స్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని చూస్తున్నట్టు సమాచారం.


