Monday, May 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలులేబర్‌ కోడ్‌‌లను రద్దు చేయాల్సిందే

లేబర్‌ కోడ్‌‌లను రద్దు చేయాల్సిందే

- Advertisement -

లేదంటే ఉద్యమం తప్పదు
రాష్ట్రంలో ఆ కోడ్‌‌లను అమలు చేయబోమంటూ ప్రకటించాలి : 
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‌కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన లేబర్‌ ‌కోడ్‌‌లను తక్ష‍ణమే రద్దు చేయాలనీ, లేదంటే సమరశీల పోరాటాలు తప్పవని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ‌హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ ‌కోడ్‌‌లను రాష్ట్రంలో అమలు చేయబోమని రేవంత్‌ ‌రెడ్డి ప్రకటించాలని డిమాండ్‌ ‌చేశారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఙాన కేంద్రం వద్ద లేబర్‌ ‌కోడ్‌‌ల ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌ ‌మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టేందుకు తెచ్చిన నాలుగు లేబర్‌ ‌కోడ్‌‌ల రద్దు కోసం తెగించి పోరాడుతామని పాలకులను హెచ్చరించారు. ఈ నెల 8న నాలుగు లేబర్ కోడ్ ల నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం అనంతరం, కేంద్ర కార్మిక సంఘాల సమిష్టి అభిప్రాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 21 నుండి నాలుగు లేబర్ కోడ్స్ అమలుకు నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు. ఈ కోడ్ లు కార్మికుల హక్కులపై దాడి చేస్తూ, వారిని మరింత దారుణంగా దోపిడీ చేసేందుకు బానిసత్వ పరిస్థితుల్లోకి నెట్టే లక్ష్యంతో తీసుకువచ్చినవేనని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి కొనసాగింపుగా 2025 డిసెంబర్ 30న కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నాలుగు లేబర్ కోడ్‌‌లకు సంబంధించిన డ్రాఫ్ట్ నియమాలను కేంద్రం విడుదల చేసిందని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం ఊహించినట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఆ కోడ్ లకు నియమాలను నోటిఫై చేసిందని చెప్పారు. పార్లమెంటులో సంపూర్ణ మెజారిటీతో మూడోసారి అధికారంలోకొచ్చిన మోదీ ప్రభుత్వం, అసెంబ్లీ ఎన్నికల విజయాల అనంతరం మరింత దూకుడుగా, తన కార్పొరేట్ యజమానుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నదని విమర్శించారు. ​ఈ కోడ్ ల ద్వారా కార్మికులు పనిచేసే ప్రదేశాల్లో ఇప్పటివరకు సాధించుకున్న అన్ని హక్కులు, హామీలు లాక్కోవాలని చూస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పనిగంటలు, కనీస వేతనాలు, సామాజిక భద్రత వంటి ప్రాథమిక హక్కులతో పాటు, యూనియన్ ఏర్పాటు హక్కు సామూహిక చర్చల హక్కు ఆందోళనలు-సమ్మెలు నిర్వహించే హక్కు నిరసన తెలిపే హక్కు వంటి సమిష్టి హక్కులను కూడా పూర్తిగా హరించేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. కార్మికుల ఏకాభిప్రాయ వ్యతిరేకతను అణచేయడానికి దారుణమైన శిక్షలు, ప్రతీకార చర్యలను చట్టబద్ధం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఈ రోజు జరిగే సభలో లేబర్ కోడ్ లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వి.రమ, రాష్ట్ర కార్యదర్శులు పుప్పాల శ్రీకాంత్, కురపాటీ రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్. ఎస్. ఆర్. ఎ. ప్రసాద్, పద్మ నాయకులు శ్రీ రాములు, నాగేష్, రాజ్ కుమార్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -