ఘనంగా ముత్యాలమ్మ తల్లికి బోనాల పండగ

నవతెలంగాణ-గోవిందరావుపేట

మండలంలోని పసర గ్రామంలో ముత్యాలమ్మ తల్లికి గురువారం బోనాల పండగను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుండి ఒక్కపొద్దు ఉన్న మహిళలు నియమనిష్టలతో ముత్యాలమ్మ తల్లికి బోనం వండి పసుపు కుంకుమలతో అలంకరించి పూలు వేపాకుల దండలను వేసి బోనం ఎత్తుకొని గుంపులు గుంపులుగా శివ సత్తు ల పూనకాలతో బోనాలను అమ్మవార్లకు సమర్పించారు. మహిళలు వెంట తీసుకుని వచ్చిన చీర సారే లని అమ్మవారి ముందు ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వర్షం కాలంలో కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మహిళలు తెలిపారు.
గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ నృత్యాలు చేస్తూ సంతోషంగా బోనాల పండుగను నిర్వహించారు. కొందరు డప్పు చప్పుళ్ళు మరికొందరు డిజె సౌండ్ లతో సంబరాలు జరుపుకున్నారు.
Spread the love