ఇజ్రాయిల్‌ను బహిష్కరించండి..ఇరాన్‌ సుప్రీం నేత

నవతెలంగాణ – టెహ్రాన్‌: ఇజ్రాయిల్‌ను బహిష్కరించాలని ఇరాన్‌ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమైనీ బుధవారం  పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన  ఇరాన్‌ జాతీయ మీడియాతో మాట్లాడారు. ముస్లిం దేశాలు ఇజ్రాయిల్‌కు ఆయిల్‌, ఆహార ఎగుమతులను నిలిపివేయాలని ఆదేశించారు. గాజా స్ట్రిప్‌లో వైమానిక, భూతల దాడులు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.  గాజాపై బాంబుల దాడులను నిలిపివేయకపోతే… ఆయిల్‌, ఆహార ఎగుమతులను నిలిపివేస్తామని హెచ్చరించారు.గాజాపై ఇజ్రాయిల్‌ చేపడుతున్న అసమాన దాడులను, దురాక్రమణను ఖండిస్తున్నట్లు బొలివియా పేర్కొంది. ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలను వెంటనే నిలిపివేస్తున్నట్లు ఉప విదేశాంగ మంత్రి ఫ్రెడ్డీ మీడియాతో పేర్కొన్నారు. గాజాకు మానవతా సాయం అందించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ప్రెసిడెన్సీ (బొలీవియా) మరియా నెలాప్రాడా ప్రకటించారు.  వేలాది మంది గాజా స్ట్రిప్‌పై దాడులకు ముగింపు పలకాలని డిమాండ్‌ చేశారు. గాజాలో మానవతా సంక్షోభం తీవ్రమవడంతో తమ రాయాబారులను వెనక్కి రావాల్సిందిగా రెండు లాటిన్‌ అమెరికా దేశాలు వెల్లడించాయి.
ఏడుగురు బందీలు మృతి : హమాస్‌ ప్రకటన
గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయిల్‌ జరిపిన బాంబు దాడుల్లో ఏడుగురు బందీలు మరణించినట్లు హమాస్‌ ప్రకటించింది. వీరిలో ముగ్గురు విదేశీ పాస్‌పోర్ట్‌దారులు కూడా ఉన్నట్లు హమాస్‌ సైనిక విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.
క్షతగాత్రులతో ఈజిప్ట్‌ చేరిన మొదటి అంబులెన్స్‌
రఫా సరిహద్దు నుండి బుధవారం మొదటి అంబులెన్స్‌ ఈజిప్ట్‌లోకి ప్రవేశించింది. గాజా నుండి క్షతగాత్రులతో అంబులెన్స్‌ తమ దేశంలోకి ప్రవేశించినట్లు ఈజిప్ట్‌ అధికారులు తెలిపారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రకటించారు. గాజా నుండి ఈజిప్ట్‌లోకి ప్రవేశించే సరిహద్దు రఫా బుధవారం తెరుచుకున్న సంగతి తెలిసిందే. సుమారు 40 అంబులెన్స్‌లు బయలుదేరాయని, ఒక్కో అంబులెన్స్‌లో ఇద్దరు క్షతగాత్రులు ఉన్నట్లు జాతీయ మీడియా ప్రకటించింది.

Spread the love