ఉపాధికి తూట్లు

– ఆధార్‌ అనుసంధానం సాకుతో లబ్దిదారుల్లో కోత
– గతేడాది 5.18 కోట్ల మంది తొలగింపు
– గ్రామీణ ప్రాంతాలలో పెరుగుతున్న నిరుద్యోగం
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నీరుకారిపోతోంది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి కుటుంబానికీ సంవత్సరానికి కనీసం వంద రోజుల ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించారు. అయితే లక్ష్యానికి తూట్లు పొడుతూ ఈ పథకం నుండి 2022-23లో 5.18 కోట్ల మంది లబ్దిదారులను తొలగించారు. ఓ వైపు పథకం లబ్దిదారులలో 57.43 శాతం మంది మహిళలేనని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం మరోవైపు ఏవేవో సాకులు చూపుతూ వారి నోటి కాడి కూడును లాగేసుకుంటోంది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగం పెరిగిపోతోంది. ఇదేదో ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణ కాదు. సాక్షాత్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ మంగళవారం లోక్‌సభకు తెలియజేసిన విషయాలను పరిశీలిస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. 2021-22లో తొలగించిన వారి కంటే గత సంవత్సరంలో ఈ పథకం నుంచి తొలగించిన వారి సంఖ్య ఏకంగా 247 శాతం పెరిగిందట. పేరు తొలగిస్తే ఆ వ్యక్తి పని చేయడానికి అనర్హుడు అవుతాడు.
ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబ్‌ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం జనవరిలోనే నిర్ణయం తీసుకుంది. కార్మికులు, పనివారు నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వం మొండిగా తన నిర్ణయాన్ని అమలు చేయడానికే పూనుకుంది. ఆధార్‌ ఆధారిత చెల్లింపుల అమలు కోసం విధించిన గడువును ఇప్పటికే నాలుగు సార్లు పొడిగించింది.
తాజాగా ఆగస్ట్‌ 31వ తేదీ వరకూ గడువును పొడిగించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు హడావిడిగా కార్మికుల పేర్లు తొలగించడం ప్రారంభించాయి. ఆధార్‌ వివరాలతో సరిపోలని జాబ్‌ కార్డులు కలిగిన వారి పేర్లను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు.
2021-22లో 1,49,51,247 మందిని ఈ పథకం నుండి తొలగించగా 2022-23లో ఆ సంఖ్య 5,18,91,168కి పెరిగిందని మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తెలిపారు. తొలగింపులు అనేవి రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే నిరంతర ప్రక్రియ అని, అంతేకానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న కారణంగా వ్యవస్థలో దొర్లిన పొరబాటు కాదని ఆయన చెప్పుకొచ్చారు. జాబ్‌ కార్డులలో నకిలీలు, డూప్లికేట్లు ఉండడం, పని చేయడానికి లబ్దిదారులు ఇష్టపడకపోవడం, గ్రామాల నుంచి కుటుంబాలు శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలిపోవడం, జాబ్‌ కార్డులో పేరున్న ఏకైక వ్యక్తి చనిపోవడం వంటి కారణాల వల్ల కూడా తొలగింపులు జరుగుతున్నాయని వివరించారు.
ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం 2022-23లో పశ్చిమ బెంగాల్‌లో అత్యధిక తొలగింపులు (83.36 లక్షలు) జరగగా ఆంధ్రప్రదేశ్‌ (78.05 లక్షలు), ఒడిశా (77.78 లక్షలు), బీహార్‌ (76.68 లక్షలు), ఉత్తరప్రదేశ్‌ (62.98 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మహిళలే అధికం
ఉపాధి హామీ పథకం లబ్దిదారుల్లో 57.43 శాతం మంది మహిళలేనని కేంద్రం తెలిపింది. 2021-22లో… అంటే కోవిడ్‌ కష్టకాలంలో సైతం మహిళా లబ్దిదారుల సంఖ్య 54.82 శాతంగా నమోదైంది. కేరళలో నమోదైన లబ్దిదారులలో మహిళలు ఏకంగా 89.82 శాతం ఉండడం విశేషం. ఆ తర్వాత 87.48 శాతంతో పాండిచ్చేరి రెండో స్థానంలో నిలిచింది. గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలియజేశారు. 2020-21లో ఈ పథకంలో 18-30 సంవత్సరాల మధ్య వయసున్న వారు 2.95 కోట్ల మంది చేరగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 3.06 కోట్లకు పెరిగింది.

Spread the love