నిరుద్యోగులకు బీఆర్‌ఎస్‌ ధోకా!

BRS Dhoka for the unemployed!– అమలుకు నోచుకోని గత ఎన్నికల హామీ
– ఐదేండ్లలోనూ ఇవ్వని ‘నిరుద్యోగ భృతి’
– ఉద్యోగాల భర్తీ అంతంతే
– యువత ఆశలు ఆవిరి
– ఈసారి మహిళల ఓట్లకు వల
– సౌభాగ్యలక్ష్మి పేరుతో నెలకు రూ.3 వేల భృతి
‘ఒక్కొక్కరికీ నెలకు రూ.3,016 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం.’అంటూ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా ఆ పార్టీ మ్యానిఫెస్టోలోనూ పొందుపరిచింది. కానీ ఐదేండ్లలోనూ నిరుద్యోగ భృతిని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయలేదు. వారికి బీఆర్‌ఎస్‌ ధోకా ఇచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామంటూ నమ్మించి వారి ఓట్లతో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆ ఊసేలేదు. అయితే ‘నిరుద్యోగ భృతి హామీ అమలుపై ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. కరోనా వల్ల ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేకపోయాం. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఏం చేయాలో అది చేస్తాం. నిరుద్యోగులంటే ఎవరు?అన్నది ముందు తేల్చాలి. దానికి ప్రాతిపదిక ఏంటన్నది ఆలోచిస్తున్నాం.’అని 2021, మార్చి 17న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ప్రకటించారు. ‘నిరుద్యోగులకు తీపికబురు. అతిత్వరలోనే నిరుద్యోగ భృతి అమలవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనిపై ప్రకటిస్తారు’అని మంత్రి కేటీఆర్‌ అదే ఏడాది జనవరిలో చెప్పారు. ఆ ప్రకటనల ఆధారంగా 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో కచ్చితంగా నిరుద్యోగ భృతిని ప్రభుత్వం ప్రకటిస్తుందంటూ యువతీ, యువకులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే బడ్జెట్‌లో ఆ ప్రస్తావన లేకపోవడంతో వారు తీవ్ర నిరాశ చెందారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పట్ల నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు. వారిని మచ్చిక చేసుకునేందుకు కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో ఏదో ఒక హామీ ఇస్తారని అందరూ ఆశించారు. కానీ అందులోనూ వారి ఊసే ఎత్తలేదు. నిరుద్యోగులు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలే లేవు. దీంతో బీఆర్‌ఎస్‌ తీరు పట్ల నిరుద్యోగులు మరింత ఆగ్రహంతో ఉన్నారు. నిరుద్యోగులను బీఆర్‌ఎస్‌ పార్టీ మోసం చేసిందన్న అభిప్రాయం బలంగా ఉన్నది. అందుకే ఇప్పుడు నిరుద్యోగులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నారాయణపేట జిల్లా గుండుమల్‌ మండల పరిధిలోని కొమ్మూరు గ్రామంలో నిరుద్యోగుల తల్లిదండ్రులను చైతన్యపరుస్తున్నారు. ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీకే ఓటు వేయాలంటూ అవగాహన కల్పిస్తుండడం గమనార్హం.
కొలువులు రాక ఆందోళన
ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ యువతకు అన్యాయం జరిగిందన్న పేరుతో ప్రత్యేక ఉద్యమం సాగింది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న లక్ష్యాల కోసమే పోరాటం చేశారు. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారిలోనూ వారే అధికం. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉద్యోగాల కల్పన అంతంత మాత్రంగానే జరిగిందన్న అభిప్రాయం అందరిలోనూ ఉన్నది. దీంతో నిరుద్యోగుల ఆశలు, ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరలేదు. 2.24 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. లక్షకు మించి ఉద్యోగాల భర్తీ జరగలేదని పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలంటూ అధికార పార్టీ నేతలకు సవాల్‌ విసురుతున్నారు. 80,039 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో గతేడాది ప్రకటించారు. అందులో 35 వేల నుంచి 40 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 16,604 పోస్టుల భర్తీకి పోలీసు నియామక బోర్డు, 9.210 పోస్టుల భర్తీకి గురుకుల బోర్డు ఆథ్వర్యంలో రాతపరీక్షలను నిర్వహించాయి. హైకోర్టు ఆదేశాలతో పోలీసు నియా మకాల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఉద్యోగాల భర్తీలో విఫలమై అభాసుపాలవుతున్నది. ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మొదటి సారి రద్దయ్యింది. ఆ తర్వాత నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో బయోమెట్రిక్‌ చేపట్టకపోవడం, ఓఎంఆర్‌లో అభ్యర్థుల వివరాలు పొందు పర్చకపోవడంతో హైకోర్టు మరోసారి రద్దు చేసింది. దీంతో అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో గ్రూప్‌-2, డీఎస్సీ రాతపరీక్షలు వాయిదా పడ్డాయి. కారణమేదైనా తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సజావుగా సాగడం లేదు. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర మనస్తాపానికి, ఆందోళనకు గురవుతున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్‌లో ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన రాజకీయంగా సంచలనం సృష్టించింది.
బీజేపీ హామీ గాలిబుడగ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాత్ర కూడా నిరుద్యోగం పెరగడంలో కీలకంగా ఉన్నది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, మేకిన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా వంటివి గాలిబుడగలయ్యాయి. నిరుద్యోగ సమస్య పరిష్కారం కేంద్ర ప్రభుత్వ చేతుల్లోనే కీలకంగా ఉంటుంది. గ్రామీణ ఉపాధి హామీ చట్టం వంటి వాటిని కూడా నీరుగార్చడంతో గ్రామీణ, పట్టణ పేదరికం విస్ఫోటన స్థాయికి చేరింది. కానీ కేంద్రం తప్పులను పట్టించుకోకుండా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద బీజేపీ నాయకులు ఆరోపణలు చేయడం గమనార్హం. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ పేరుతో యువతను మోసం చేసేందుకు ఆ పార్టీ ముందుకొస్తున్నది. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం లేదు. వివిధ రాష్ట్రాల్లోనూ ఉద్యోగాల కల్పన సరిగ్గా చేపట్టడం లేదు. కానీ తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామంటూ ఊదరగొట్టే ప్రసంగాలతో యువతకు గాలం వేయాలని కమలం పార్టీ చూస్తున్నది.
మహిళల ఓట్లే కీలకం…
రాష్ట్రంలో 3,17,32,727 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 1,58,71,493, మహిళలు 1,58,43,339 మంది ఉన్నారు. మహిళల కంటే పురుషులు 28,154 మంది అధికంగా ఉన్నారు. అయితే పురుషులతో సమానంగా మహిళల ఓట్లు ఉండడంతో రాజకీయ పార్టీలు వారికి వల వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వారి ఓట్లు పొందేందుకు మ్యానిఫెస్టోలో ఆకర్షణీయమైన పథకాలను పొందుపరుస్తున్నాయి. అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ హామీలిస్తున్నాయి. ఈసారి మహిళలు కేంద్రంగా ఎన్నికలు జరిగే అవకాశమున్నది. అందుకే కాంగ్రెస్‌ పార్టీ మహాలక్ష్మి పేరుతో మహిళలకు ప్రతినెలా రూ.2,500 పెన్షన్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి పేరుతో ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితమంటూ ప్రకటించింది. ఇక అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ ప్రకటించిన మ్యానిఫెస్టోలో అర్హులైన మహిళలకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌, సౌభాగ్యలక్ష్మి పథకం పేరుతో బీపీఎల్‌ కింద ఉన్న అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే మహిళలు ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారో, ఎవరికి ఓటు వేస్తారో వేచిచూడాల్సిందే.

Spread the love