– వారి డిమాండ్లు న్యాయమైనవే
– కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉంది
– ఎన్నికల తర్వాత వాటికి పరిష్కారం : తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గెస్ట్ లెక్చరర్ల సమస్యలను గత బీఆర్‌ఎస్ సర్కార్ పట్టించుకోలేదని తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఫ్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్( టీఎస్‌డీజీఎల్‌ఏ) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యను ప్రయివేటీకరించాలనే కుట్రతో గత ప్రభుత్వం యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయలేదని ఆరోపించారు. క్రమంగా కార్పొరేట్లకు విద్యను అప్పగించాలనే ఉద్దేశంతో ఆ రంగాన్ని పూర్తిగా నిర్లక్షం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ హయంలో మొదలైన వివక్ష చంద్రబాబు పాలనలోకొచ్చేసరికి… రెగ్యులర్ అధ్యాపకులు కాస్తా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా మారారని గుర్తు చేశారు. మన బతుకులు బాగుపడుతాయిని ఏరి కోరి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ మరో అడుగు ముందుకేసి… కాంట్రాక్ట్ లెక్చరర్లను గెస్ట్ లెక్చరర్లుగా మార్చారని ఆరోపించారు. చదువులు ఖరీదుగా మారిన ప్రస్తుత తరుణంలో ఉన్నత విద్య సామాన్యులకు అందాలంటే ప్రభుత్వం మరిన్ని డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత పదేండ్లుగా ఉన్నత విద్యావంతులను తీర్చి దిద్దుతున్న గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్ల పట్ల సానుకూలంగా ఉందనీ, ఎన్నికల తర్వాత తగు నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వార్ రూం చైర్మెన్ పవన్ మల్లాది మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విద్యారంగం చిన్నాభిన్నమైందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ కమీషన్ల కోసం కక్కుర్తి పడి ఈ రంగాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల విద్యార్థుల్లో నైపుణ్యం కొరవడిందన్నారు. గెస్ట్ లెక్చరర్ల డిమాండ్లను కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టామనీ, అధికారం చేపట్టిన తర్వాత వాటిపై చర్చించామని గుర్తు చేశారు. త్వరలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షులు కె. ఈశ్వర్ లాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 145 కాలేజీల్లో పని చేస్తున్న 1,600 మంది లెక్చరర్లను ఆటో రెన్యూవల్ చేయడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ననుసరించి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి యూజీసీ మార్గదర్శకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అందరికి ప్రమాద ఆరోగ్య భీమా అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీఎస్‌డీజీఎల్‌ఏ కార్య నిర్వాహక అధ్యక్షులు నవీన్, దేవేందర్, సతీష్ ప్రధాన కార్యదరిర్శి గణేష్ , ఉపాధ్యక్షులు. రాజు రెడ్డి, గంగాధర్ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి విచ్చేసిన లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు.