రాష్ట్రంలో సంక్షోభం సృష్టించిందే బీఆర్ఎస్: మంత్రులు

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణకు కేసీఆర్‌ చేసిన ద్రోహానికి వెయ్యి గజాల లోతులో పాతిపెట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఘాటుగా విమర్శించారు. కరీంనగర్‌ పర్యటన సందర్భంగా ప్రభుత్వంపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు మండిపడ్డారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలన వల్లే రాష్ట్రంలో కరవు వచ్చిందని ఆరోపించారు. కేసీఆర్‌ హయాంలో మిషన్‌ భగీరథ పేరుతో రూ. వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌ మాట్లాడారు. చేనేత కార్మికులకు తీవ్ర ద్రోహం చేసిందే కేసీఆర్‌ అని, మంత్రి పొన్నం ఆరోపించారు. రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులను సృష్టించిందే గత ప్రభుత్వమని అన్నారు. సిరిసిల్ల జిల్లా చేనేత కార్మికులను ఇంటికి భోజనానికి పిలిపించి చెప్పిన ఒక్క మాటైనా అమలు చేయలేదని విమర్శించారు. కమిషన్ల కోసమే గత ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ డిజైన్‌ మార్చిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. వరద కాల్వలు ఎండిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, నిపుణుల అభిప్రాయం మేరకే ప్రాజెక్టులపై ముందుకెళ్తామని అన్నారు. కృష్ణా జలాలను ఏపీ సీఎం జగన్‌ తీసుకుపోతుంటే కేసీఆర్‌ ఏం చేశారని ప్రశ్నించారు. ఆయన పాలనలోనే కృష్ణా జలాలను అక్రమంగా ఏపీకి తరలించారని ఆరోపించారు. ‘‘రూ.90 వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్టు కట్టలేకపోయావు. ఉన్న నీటిని రైతులకు ఏవిధంగా ఉపయోగించాలో వారం వారం సమీక్షిస్తున్నాం. వారి ఇబ్బందులను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

Spread the love