బీఆర్‌ఎస్‌కు 25 సీట్లు దాటవు

BRS will not exceed 25 seats– బీజేపీ, ఎంఐఎంలకు సింగిల్‌ డిజిటే..
– త్వరలో కాంగ్రెస్‌ బస్సు యాత్ర
– వైఎస్‌ షర్మిల చేరికపై సమాచారం లేదు
– మైనంపల్లికి రెండు టికెట్లు
– త్వరలో వేముల వీరేశం చేరుతారు : ఇష్టాగోష్టిలో రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సర్వేల ప్రకారం వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 25 సీట్లు దాటవని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. బీజేపీ, ఎంఐఎం పార్టీలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవుతున్నాయన్నారు. విజయభేరి సభతో సీఎం కేసీఆర్‌కు చలిజ్వరం వచ్చిందన్నారు. ప్రగతిభవన్‌ను ఖాళీచేేయాల్సి వస్తుందోనన్న భయం మాత్రం కేసీఆర్‌లో మొదలైందని చెప్పారు. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌పాలన రాష్ట్రాన్ని దివాళా తీయించిందని విమర్శించారు. కేసీఆర్‌కు అచ్చొచ్చే నెంబర్‌వన్‌ కోసం రూ. 6 లక్షల కోట్ల అప్పు చేశారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లా మా నాయకుడు రాహుల్‌గాంధీ బ్లఫ్‌మాస్టర్‌ కాదు…ఫ్యాక్ట్స్‌ అండ్‌ ఫిగర్స్‌తో మాట్లాడుతారని చెప్పారు. ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ లేని చోట బీజేపీకి ఓటు వేయాలంటూ అసదుద్దీన్‌ చెప్పడం సిగ్గుచేటన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో విలేకర్లతో ఆయన ఇష్టాగోష్టిలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతోపాటు ముఖ్య అనుచరులు కూడా గురువారం సాయంత్రం కాంగ్రెస్‌లో చేరుతారని తెలిపారు. మైనంపల్లి కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించిందని చెప్పారు.
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం హస్తం పార్టీలో చేరనున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ ఓట్లు కావాలే కానీ ఇక్కడ నిరసన చేస్తే అరెస్ట్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్‌ దేశ రాజకీయాలకు సంబంధించినదని తెలిపారు. హైదరాబాద్‌లో నిరసన చేసేందుకు అనుమతి తీసుకోవాలని కోరితే తప్పులేదనీ, కానీ చంద్రబాబుకు అరెస్టుకు తెలంగాణకు సంబంధం లేదనడం సరైందికాదని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలు ఇతర ప్రాంతాల్లో నిరసన చేసే హక్కు కోల్పోతారని హెచ్చరిచారు. ఏపీలో జరుగుతున్నా పరిణామాలు, కేసుల గురించి తాను మాట్లాడదల్చుకోలేదు. తెలంగాణ లో జరుగుతున్న నిరసనలను అడ్డుకోవడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నా అని వివరించారు. వైఎస్‌ షర్మిల చేరిక అంశంపై నాకు ఎలాంటి సమాచారం లేదన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో బస్సుయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై నమ్మకం లేకపోవడం వల్లే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్ట్‌ను ఆశ్రయించారని తెలిప్పారు. కవిత అరెస్ట్‌ కోర్టు జోక్యం వల్ల ఆగిపోయిందన్నారు. పార్టీలో చేరేందుకు అందరికీ ఆహ్వానమేనన్నారు. స్థానిక పరిస్థితుల బట్టి టికెట్‌పై పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకుంటున్నదని చెప్పారు.
బీసీలకు 34 సీట్ల కేటాయింపు కోసం వందకు వందశాతం ప్రయత్నిస్తున్నట్టు భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ కంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామన్నారు. అన్ని సామాజిక వర్గాలకు చెందిన నాయకులు పార్టీలో బలమైన వాదన వినిపించారని చెప్పారు. వారి తరుపున సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీలో నా వాదన ఉంటుందన్నారు. కాంగ్రెస్‌లో ఎంతో మంది బీసీ నేతలు పార్టీకి అధ్యక్షులుగా పని చేశారనీ, కానీ ఏ ఒక్క బీసీ నాయకుడైన బీఆర్‌ఎస్‌కు అధ్యక్షుడు కాగాలరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో విడతల వారీగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు.బీఆర్‌ఎస్‌ నేతలు తీసుకుంటున్న 30శాతం కమీషన్‌ కంట్రోల్‌ చేస్తే..కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను సమర్దవంతంగా అమలు చేయవచ్చునని ఈ సందర్భంగా రేవంత్‌ వివరించారు.

Spread the love