– ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తన్నీరు హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌కు అధ్యక్షుడైతేనే ఆ పార్టీ బతుకుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ పార్టీ పేరు మారిస్తే మంచిదని సూచించారు. మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడైతే పార్టీలో ఒక్కరు కూడా ఉండరని ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ మీడియాపాయింట్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేటీఆర్ పొలిటీషియన్ కాదు హైటెక్ పొలిటీషియన్ అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌లో చాలా మంది నేతలు అవమానానికి గురైనా ఆ పార్టీలోనే ఉన్నారని తెలిపారు. అవినీతి మరక లేని నేతలను మాత్రమే కాంగ్రెస్‌లోకి తీసుకుంటామని తేల్చిచెప్పారు.ఐదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు దళిత బంధు తెచ్చారు తప్ప ప్రేమతో కాదని చెప్పారు. భవిష్యత్తులో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటే ఆ రెండు పార్టీలు మునిగినట్లేనని హెచ్చరించారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో 12 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఐఎం తమతోనే ఉందనీ, ఆ పార్టీ సభ్యులతో కలిపి తమకు 72 సీట్లు ఉంటాయని చెప్పారు. భువనగిరి నుంచి బీసీకి టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తనదని తెలిపారు.