బైడెనోమిక్స్‌ బండారం!

Buydenomics Bandaram!విఫల రాజకీయ నేతలు ప్రపంచమంతటా అనుసరించే పద్ధతి ఒక్కటే. ఒకరిని చూసి ఒకరు నినాదాలను కాపీకొడుతుంటారు. గతంలో అమెరికాలో రోనాల్డ్‌ రీగన్‌ అనుసరించిన విధానాలకు రీగనోమిక్స్‌ అని పేరు పెట్టారు. ఇప్పుడు బైడెనోమిక్స్‌ అంటున్నారు. మన దేశంలో మోడినోమిక్స్‌ గురించి తెలిసిందే.ఎవరు ఏ పేరు పెట్టుకున్నా పూసల్లో దారంలా కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలే తప్ప మరొకటి కాదు. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయంటూ చెప్పినచోట చూస్తే చిన్న నీటి కుంటకూడా కనిపించదు. గతంలో దేశం వెలిగిపోతోందని వాజ్‌పాయి చెబితే ఇప్పుడు వికసిత భారత్‌ అంటూ నరేంద్రమోడీ ఊరూరా తిరుగుతున్నారు. అమెరికాలో ఈ ఏడాది నవంబరులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే డెమోక్రటిక్‌ పార్టీ తరఫున జో బైడెన్‌, రిపబ్లికన్ల అభ్యర్ధిగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఖరారైనట్లు వార్తలు.ఇద్దరూ రెండోసారి గెలిచేందుకు పోటీ పడుతున్నారు. ట్రంప్‌ అమెరికాకే అగ్రతాంబూలం అంటుంటే మరోసారి అమెరికాలో సూర్యోదయం అని జోబైడెన్‌ ఓటర్లను ఆకట్టుకునేందుకు చూస్తున్నారు. పదేండ్ల తరువాత నరేంద్రమోడీ గ్యారంటీలంటూ టీవీలు, ఇతర మాధ్యమాల్లో ఊదరగొడుతున్నారు. బైడెన్‌ కోసం రూపొందించిన ఒక నిమిషపు ప్రచార ప్రకటన ” అమెరికాలో మరోసారి సూర్యోదయం, దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా నేడు పురుషులు, మహిళలు పనులకు వెళుతున్నారు. ఒక చిన్న పట్టణంలో ఐదున్నరవేల మంది వివాహం చేసుకోబోతున్నారు. గతేడాదితో పోలిస్తే ద్రవ్యోల్బణం ఇప్పుడు సగమే ఉంది, ప్రగాఢ విశ్వాసంతో భవిష్యత్‌ను మనం చూడవచ్చు” అని దానిలో ఊదరగొట్టారు. అది నిజమా?
జో బైడెన్‌ ఎన్నికైనపుడు అమెరికా ”దౌర్భాగ్యం లేదా దుర్దశ లేదా యాతన రెండవ సూచిక 17.65శాతం” గా ఉంది. ఇప్పుడు రెండోసారి ఓట్లడుగుతున్నపుడు 23శాతం ఉందని, జనం పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే సమయానికి 24శాతానికి పెరగవచ్చని బ్లూమ్‌బెర్గ్‌ ఎకనమిక్స్‌ తాజాగా ప్రకటించింది.దీని అర్థం ఏమిటంటే సగటు అమెరికన్‌ పౌరుడి జేబులు ఖాళీ అవుతున్నాయి. నిజవేతనాలు పెరగటం లేదు, ద్రవ్యోల్బణం కారణంగా కొనుగోలు శక్తి తగ్గిపోతున్నది. బైడెన్‌ కంటే ముందు నాలుగేండ్లలో నిజ వేతనాలు 2.8శాతం పెరిగితే మూడేండ్ల బైడెన్‌ ఏలుబడిలో పెరిగింది కేవలం 0.76శాతమే. అంటే పరిస్థితి దిగజారిందని దౌర్భాగ్య సూచిక నిర్ధారించినట్లే కదా! ఇలాంటి స్థితిలో ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. బహుశా ఈ వైఫల్యాన్ని పసిగట్టే మన నరేంద్రమోడీ గారి జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ తిరిగి అధికారానికి వస్తాననే ధీమాను వెల్లడిస్తున్నాడేమో.ప్రపంచంలో అత్యంత పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ కలిగినదిగా, ఇటీవలి దశాబ్దాలలో అత్యంత బలీయమైనదిగా బైడెన్‌ ప్రచారం చేసుకుంటున్న అమెరికాలో అంతా బాగుంటే జనాల పరిస్థితి ఎందుకు దిగజారుతున్నట్లు? నిజవేతనాలు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరగక పోవటం, 2022లో మధ్యతరగతి ఆదాయ కుటుంబాలపై 20 నుంచి 30శాతం పన్నులు పెంచటం, కార్పొరేట్ల మీద పెంచిన పన్నుల్లో 70శాతం భారాన్ని కార్మికులే భరించాల్సి వచ్చిందని టాక్స్‌ పాలసీ సెంటర్‌, టాక్స్‌ ఫౌండేషన్‌ సంస్థల అధ్యయనంలో తేలింది.
సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్‌ అన్నట్లుగా జన జీవితాలు దుర్భరం కావటానికి ద్రవ్యోల్బణమే కారణమని ప్రభుత్వం, దాని సమర్ధకులు నమ్మించేందుకు చూస్తారు. సాధారణ జన పరిస్థితి దిగజారుతున్నది తప్ప కార్పొరేట్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ప్రజావ్యతిరేక విధానాల ఫలితంగా ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిజవేతనాల స్తంభన తప్ప మరొకటి కాదు. బైడెనోమిక్స్‌ ట్రంప్‌నోమిక్స్‌ పేరు ఏదైనా అమెరికా పౌరుల పరిస్థితి దిగజారుతున్నది.శ్రామిక శక్తి భాగస్వామ్యం, ఉపాధి 2019 స్థాయికంటే తక్కువగా ఉంది. ఏటా రెండులక్షల కోట్ల డాలర్ల ప్రభుత్వ లోటు, 34లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉంది.2021-23 మధ్య వినిమయ ధరల ద్రవ్యోల్బణం 17.6శాతం కాగా ఆహార 33.7, గృహవసతి 18.8, ఇంధనం 32.8, ఒకసారి కొన్న తరువాత తిరిగి వెనక్కు తీసుకోని వస్తువుల ద్రవ్యోల్బణం 30శాతం ఉన్న తరువాత నిజవేతనాల్లో సగటున 0.7శాతం పెరిగితే జనాలు విషాదంతో నవ్వుకోవటం తప్ప మరొకటి కాదు. ఈ వైఫల్యాలకు తోడు అంతర్జాతీయంగా ఉక్రెయిన్‌ సంక్షోభం, గాజాలో ఇజ్రాయిల్‌ ఊచకోతల పట్ల అనుసరిస్తున్న వైఖరి మీద జనాల్లో వ్యతిరేకత పెరుగుతోంది. అందుకే వారి ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు ఇజ్రాయిల్‌ మీద విమర్శలు చేసినా, రష్యాను వెనక్కు కొడతామని ప్రగల్భాలు పలుకుతున్నా ప్రయోజనం కనిపించటం లేదు. అందుకే ఎన్నికల ముందు జో బైడెన్‌ ఇంటా బయటా తీవ్ర వ్యతిరేకత, విమర్శలను ఎదుర్కొంటున్నారు.

Spread the love