– భద్రతా లోపాలను ఏవిధంగా అధిగమించవచ్చు
– చైనా, జపాన్, ఈయూలో అత్యాధునిక వ్యవస్థల వినియోగం
శతాబ్దాల కింద నిర్మించిన వంతెనలు..పట్టాలపై ప్యాసింజరు రైళ్లు నడపాల్సిన చోట వందేభారత్ లాంటి రైళ్లను నడపటం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఉదయిస్తోంది. మోడీ సర్కార్ అధికారంలికి వచ్చినప్పటినుంచి జనం ముక్కుపిండి పలురూపాల్లో నిధులను ఖజానాలో వెనకేసుకుంటోంది. రైలు ప్రమాదాల్లో భారీగా ప్రాణనష్టం జరుగుతున్నా..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో ఎందుకని చలనం కనిపించటంలేదు. నామ్ కే వాస్తే అన్నట్టుగా అప్పటి కప్పుడు ప్రమాదాలు జరిగినచోట మరమ్మతులతో సరిపెట్టి..పరిహారాలు ప్రకటించి చేతులు దులుపు కుంటే సరిపోతుందా..?. నెత్తురు చిమ్ముతున్న మన పట్టాలపైకి బుల్లెట్ రైళ్లు నడిపితే..ఇంకెంత ప్రాణనష్టం జరుగుతుందో తలుచుకుంటేనే ఒళ్లు జలధరిస్తోంది. ఈ విషయంలో ఒక్కసారైనా మోడీ సర్కార్ ఆలోచిస్తున్నదా..? వాస్తవానికి మన కన్నా వేగంగా దూసుకెళ్లే రైళ్లతో..ప్రయాణికుల భద్రత గురించి ప్రత్యేక దృష్టి పెడుతున్న చైనా, జపాన్ లాంటి దేశాలతో ఎందుకు పోటీపడలేకపోతున్నాం.
సాంకేతిక వైఫల్యం మాటే లేదు
న్యూఢిల్లీ : ఘోర రైలు ప్రమాదం జరిగిన ఒడిశాలోని బాలాసోర్‌లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలు, మృతదేహాలతో భీతావహ దృశ్యాలు కన్పించిన ప్రదేశంలో ఇప్పుడు పట్టాలపై మళ్లీ రైళ్లన్నీ మామూలుగానే నడుస్తున్నాయి. కానీ భారతీయ రైల్వేలో భద్రతా వ్యవస్థపై మాత్రం పలు ప్రశ్నలు, మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా రైల్వేలో భద్రతా లోపాలను ఎత్తి చూపుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా భారతీయ రైల్వేలు ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇలాంటి ఘటనల్ని నివారించలేమా? గంటకు 600 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే రైళ్లు
ఉన్న చైనా, జపాన్ దేశాలు అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి? అన్న చర్చనీయాంశం అవుతోంది.
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ (ఈఐ) అనేది ఒక సిగలింగ్ వ్యవస్థ. దీనిలోని ఎలక్ట్రానిక్ భాగాలు సిగలింగ్, పాయింట్లు, ట్రాక్ సర్క్యూట్లను నియంత్రించి అవి సరిగా పని చేసేలా చూస్తాయి. బాలాసోర్ వంటి దుర్ఘటనలు జరగకుండా నివారిస్తాయి. ఉదాహరణకు రెండు రైళ్లు ఒకే ట్రాక్ మీదికి ఎదురెదురుగా వస్తుంటే ఈఐ వెంటనే హెచ్చరికలు జారీ చేస్తుంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ విషయానికి వస్తే ముందుగా ఆ లైనులో వెళ్లేందుకు సిగల్ ఇచ్చి ఆ తర్వాత దానిని వెనక్కి తీసుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. ఇలా జరగడానికి కారణమేమిటో తెలియరాలేదు. ఈఐ వైఫల్యం వల్లనే ఇలా జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు.
విజిలెన్స్ కంట్రోల్ పరికరం
ఒకవేళ రైలును నడిపే పైలట్, కో-పైలట్ ఇద్దరూ అస్వస్థతకు గురైతే రైలు దానంతట అదే నడిచేలా చేసేదే విజిలెన్స్ కంట్రోల్ పరికరం. మన దేశంలోని రైలు ఇంజిన్లలో వీటిని 2018లోనే ఏర్పాటు చేశారు. పైలట్ లేదా కో-పైలట్ ఎంత అప్రమత్తంగా ఉన్నాడో ఈ పరికరం ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ ఉంటుంది. డ్రైవర్ ఒక నిమిషం పాటు అచేతనుడైతే ఈ పరికరం స్పందిస్తుంది. 16 సెకన్ల పాటు ఆడియో విజువల్ సిగల్ పని చేస్తుంది. ఆ సమయంలో డ్రైవర్ స్పందించి బటన్ నొక్కాలి. అలా చేయని పక్షంలో ఆటోమాటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వ్యవస్థ పని ప్రారంభిస్తుంది.
కవచం
కవచ్ అనేది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన వ్యవస్థ. ప్రమాదకర పరిస్థితులలో సిగల్‌ను దాటేందుకు, అధిక వేగాన్ని నియంత్రించేందుకు ఇది పైలట్లకు సహాయ పడుతుంది. తుపానులు వచ్చినా, పొగమంచు కురిసినా రైలు యధావిధిగా నడిచేందుకు దోహదపడుతుంది. రైలు ఏ దిశ నుండి వచ్చినా కవచ్ దానిని గుర్తిస్తుంది. పట్టాలపై వ్యతిరేక దిశ నుండి రైలు వస్తుంటే దానిని గమనించి పైలట్‌ను అప్రమత్తం చేస్తుంది. అయితే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఇలాంటి వ్యవస్థ ఏదీ లేదు.
ఇతర భద్రతా చర్యలు
‘రక్షా కవచ్’ అని పిలవబడే పరికరాన్ని కొంకణ్ రైల్వే అభివృద్ధి చేసింది. రైళ్లు అత్యంత వేగంతో ఎదురెదురుగా వస్తున్నప్పుడు అవి ఢకొీనకుండా ఈ పరికరం నివారిస్తుంది. సిగలింగ్, ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలు విఫలమైనప్పుడు ఇది పనిచేస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఈ పరికరం జీపీఎస్‌పై ఆధారపడి రూపొందించబడింది. ప్రస్తుతం ఈ పరికరాన్ని ఈశాన్య రైల్వేలో మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇక రైల్వే గేట్ల వద్ద అమర్చిన పరికరం పట్టాలు దాటే ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం దీనిని 90 రైల్వే గేట్ల వద్ద అమర్చి పరీక్షిస్తున్నారు. కాగా రైలు పట్టాలు దెబ్బతిన్నాయా లేక బీటలు వారాయా అనే విషయాన్ని తెలుసుకునేందుకు యూఎస్‌ఎఫ్‌డీ పరికరాన్ని ఉపయోగి స్తున్నారు. దీనితో పాటు పట్టాలను ఎప్పటికప్పుడు పర్య వేక్షించేందుకు అవసరమైన వ్యవస్థలూ ఉన్నాయి. లోకో పైలట్ ఎక్కువ వేగంతో రైలును నడిపినా, సిగల్‌ను దాటే సమయంలో పొరపాటు చేసినా ప్రమాదాలు జరగకుండా చూసేందుకు టీపీడబ్ల్యూఎస్ వ్యవస్థ పని చేస్తుంది. ఇక జర్మన్ కంపెనీ తయారు చేసిన ఎల్‌హెచ్‌బీ బోగీలను మన రైల్వేలు విరివిగా ఉపయోగిస్తున్నాయి. వీటిని సురక్షితమై నవిగా భావిస్తారు. బాలాసోర్ ప్రమాదానికి గురైన రెండు రైళ్లకూ ఈ బోగీలే ఉన్నాయి. పైలట్ రైలు వేగాన్ని పెంచి, ఆ తర్వాత వెంటనే బ్రేకులు వేయడాన్ని నివారించేందుకు ఇంజిన్‌లో పీసీబీని ఏర్పాటు చేశారు. ఇన్ని భద్రతా చర్యలు ఉన్నప్పటికీ దేశంలో రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇతర దేశాలలో ఏం చేస్తున్నారు?
అత్యంత వేగంగా నడిచే రైళ్లకు సంబంధించి చైనా, జపాన్, జర్మనీ దేశాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. మన దేశంలో కూడా ఇలాంటి పరిజ్ఞా నాన్ని వినియోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే భారతీయ రైల్వేలో ప్రపంచ శ్రేణి భద్రతా వ్యవస్థను ఉపయోగించడం పైన పలు ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.
యూరోపియన్ యూనియన్ దేశాలలో…
యూరోపియన్ యూనియన్ దేశాలలో సిగలింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఇందుకోసం ప్రామాణికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. అత్యంత వేగంగా నడిచే రైళ్లకు ఈ పరిజ్ఞానం ఎంతగానో ఉపయో గకరంగా ఉంటోంది. సంప్రదాయ వ్యవస్థలకు భిన్నంగా అక్కడ రైళ్లను నియంత్రించే వ్యవస్థ పనిచేస్తోంది. కంప్యూటర్‌లో కనిపించే సమాచారం ఆధారంగానే డ్రైవర్లు రైలును నడుపుతారు. పట్టాల పక్కనే ఉండే సిగల్స్‌ను వారు గమనించాల్సిన అవసరం ఉండదు. ట్రాక్ కండక్టర్లను ప్రతి వంద మీటర్లకు కేబుల్‌తో అనుసంధానం చేస్తారు. ఈ క్రాసింగ్ పాయింట్ల నుండి సిగల్స్‌కు సమాచారం అందుతుంది. రైలు ఎక్కడ ఉన్నదీ స్టేషన్ మాస్టర్‌కు తేలికగా తెలిసిపోతుంది. సిగల్ బాక్స్‌తో సమాంతరంగా పనిచేసే కంప్యూటర్లు పట్టాలపై రైళ్ల రాకపోకల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాయి. రైలుకు ఏడు కిలోమీటర్ల దూరం వరకూ ఏం జరుగుతోందో డ్రైవర్ తెలుసుకునేందుకు ఈ పరిజ్ఞానం ఉపకరిస్తుంది.
జపాన్‌లో…
జపాన్‌లో ఉపయోగిస్తున్న షింకాన్‌సేన్ టెక్నాలజీ గత 55 సంవత్సరాలుగా అక్కడి రైల్వే భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ వ్యవస్థ విశేషమేమంటే సాంకేతిక వైఫల్యం కారణంగా రైలు ప్రమాదం జరిగే అవకాశమే లేదు. మానవ తప్పిదం కారణంగానే జపాన్‌లో రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి తప్పించి సాంకేతిక వైఫల్యం కారణంగా కాదని అక్కడ జరుగుతున్న దుర్ఘటనలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం మన దేశంలో ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌లో షింకాన్‌సేన్ టెక్నాలజీని వాడుతున్నారు. రైళ్లు పరస్పరం ఢకొీనకుండా నివారించేందుకు, ఒకవేళ వేగం పెరిగితే దానిని తగ్గించేందుకు ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.
చైనాలో…
ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచే రైళ్ల ప్రయాణాలకు అనువుగా ఉండే లైన్లు చైనాలోనే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి లైన్లు ఆ దేశంలో 86 ఉన్నాయి. వీటి పొడవు 22 వేల కిలోమీటర్లు. అక్కడ అత్యంత వేగవంతమైన 2,846 సెట్ల ఎలక్ట్రానిక్ మల్టిపుల్ యూనిట్లు (ఈఎంయూలు) పని చేస్తున్నాయి. రైలు పట్టాలు తప్పకుండా నివారించే అత్యాధునిక వ్యవస్థలు చైనాలో అందుబాటులో ఉన్నాయి. మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు పరిరక్షించుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తున్నారు.