ప్రొటోకాల్‌ నిబంధనలతో కట్టడి చేయలేరు

With the rules of protocol Can't be tied– ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుభవం కలిగిన బలమైన నాయకుడు
–  సనాతన ధర్మంలో కాదు…. డీఎంకేలోనే వివక్ష ఉంది
– ఆర్టీసీ బిల్లును ఆపలేదు
– గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలు రాజకీయ నాయకుల కోసం కాదు : గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రొటోకాల్‌ నిబంధనలతో తననెవరూ ఆపలేరనీ, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తానని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించి నాలుగేండ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పలు ప్రశ్నలకు  తమిళిసై సమాధానాలిచ్చారు. సీఎం కేసీఆర్‌ అనుభవం కలిగిన బలమైన రాజకీయ నాయకుడని కొనియాడారు. నాలుగేండ్లలో ఆయన్ను గమనించి చాలా విషయాలను నేర్చుకున్నానని తెలిపారు. అదే విధంగా తమిళనాడులో పుట్టి, అక్కడి ప్రజల్లో పెరిగి, పుదుచ్ఛేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా ఉంటుండంతో నాలుగేండ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం అవగాహన పెరిగిందని చెప్పారు. ప్రగతిభవన్‌కు, రాజ్‌భవన్‌కు మధ్య గ్యాప్‌ గతంలో లేదనీ, ఇప్పుడూ లేదని తెలిపారు. తన పని తాను చేసుకుంటూ పోతున్నాననీ, విమర్శలను పట్టించుకోనని తెలిపారు.      రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేసే క్రమంలో గ్యాప్‌ ఉన్నట్టు జరిగే ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల పట్ల తనకు శ్రద్ధ ఉందని చెప్పటమంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పడమే అని తెలిపారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లు విషయంలో కార్పొరేషన్‌ ఆస్తులు, అందులో పని చేసే వారి పదోన్నతులు తదితర అంశాలపై కూలంకుషంగా అధ్యయనం చేసేందుకే సమయం పట్టిందని వివరించారు. దీంతో బిల్లు ఆపుతున్నట్టుగా ప్రచారం జరిగి ఆర్టీసీ ఉద్యోగులు ఛలో రాజ్‌భవన్‌ చేపడితే పుదుచ్ఛేరి నుంచి వారితో మాట్లాడానని గుర్తుచేశారు. వారు లేవనెత్తిన సందేహాలను తీర్చాలని న్యాయనిపుణులను కోరామనీ, ఆ బిల్లు న్యాయశాఖ నుంచి రాజ్‌భవన్‌కు గురువారం వచ్చినట్టు తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో గవర్నర్‌ వ్యవస్థకు ఉన్నది ఘర్షణ కాదనీ, విబేధమని తెలిపారు. రాజ్యంగబద్ధ సంస్థగా బిల్లును పరిశీలిస్తామని తెలిపారు. దాన్ని లోతుగా పరిశీలించ కుండా సంతకం పెట్టడం కుదరదని అన్నారు. అలా పరిశీలించడం ద్వారా బిల్లులో సవరణలు చేసు కోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం దొరుకు తుందని వివరించారు.

   అదే విధంగా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణకు సంబంధించి ఆమోదం తెలపాలంటే ముందు దానికి సంబంధించి కొన్ని ప్రమాణాలుంటాయని గుర్తుచేశారు. క్రీడలు, సాంస్కృతిక రంగం, సేవా రంగం తది తర రంగాలకు చెందిన వ్యక్తుల కోసం ఆ కోటా ఉద్దేశించబడిందని చెప్పారు. అంతే గానీ, గవర్నర్‌ కోటా రాజకీయ నామినేషన్‌ పదవుల కోసం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రజల కోసం అమలు చేస్తున్నదని తెలిపారు. అయితే కొన్ని పథకాలు ప్రజలకు చేరువ కాలేదని చెప్పారు. ఆయుష్మాన్‌ భారత్‌ లాంటి పథకాలు వారి వద్దకు చేర్చాలని సూచించారు. బలమైన ఆకాంక్షలతో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. హాస్టళ్లు, పారిశుధ్యం, మరుగుదొడ్లను మెరుగ్గా నిర్వహించా లని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం వచ్చినా…రాకపోయినా తాను ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని తెలిపారు.
జమిలి ఎన్నికలు బెస్ట్‌
జమిలి ఎన్నికలు దేశానికి మేలు చేస్తాయని తమిళిసై తెలిపారు. తద్వారా ఖర్చు, అనవసరమైన శ్రమ తప్పుతుందని తెలిపారు. జమిలిపై మాజీ రాష్ట్రపతి గానీ, ప్రస్తుత రాష్ట్రపతి గానీ గవర్నర్‌లతో చర్చించలేదని తెలిపారు.
ప్రతిదీ రాజకీయం కాదు
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు మంచి కార్యక్రమమని గవర్నర్‌ తెలిపారు. అయితే కొన్ని కాలేజీలకు సంబంధించిన అవసరమైన సమాచారాన్ని సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం పంపించలేదని తనకు కేంద్రం చెప్పినట్టు వెల్లడించారు. ప్రతిదీ రాజకీయం కాదన్న గవర్నర్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలని ఆకాంక్షించారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లాలి కదా…అంటూ కామెంట్‌ చేశారు. తనకు రిటైర్‌, రిటైర్‌మెంట్‌, రెస్ట్‌ అనే పదాలంటే అసహ్యమనీ, తాను ఏ హౌదాలో ఉన్నా సంతోషంగా ఉంటానని తెలిపారు.
50 ఏండ్ల నుంచి డీఎంకే వివక్ష బాటే..
సనాతన ధర్మం మనిషి మంచి జీవన విధానాన్ని బోధిస్తున్నది. అందులో అనేక మంచి విషయాలున్నాయి. అందులో వివక్ష లేదు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్న డీఎంకేలోనే వివక్ష ఉన్నది. గత 50 ఏండ్ల నుంచి వారు అదే పని చేస్తున్నారు. వినాయక చవితి తదితర హిందూ పండుగలకు తమిళనాడు సీఎం శుభాకాంక్షలు చెప్పరా? అని గవర్నర్‌ ప్రశ్నించారు.
ఆస్పత్రి అలా ఉండొద్దు
గవర్నర్‌గా తాను ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిని సందర్శించాననీ, చారిత్రాత్మకమైన ఒక ఆస్పత్రి ఆ విధంగా ఉండడం సరికాదని తెలిపారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, పరికరాలను సమకూర్చాలని కోరారు. అంతకు ముందు జరిగిన వేడుకల్లో ఆమె నాలుగేండ్లలో చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. వాటికి సంబంధించిన చెందిన ఇ-బుక్‌, కాఫీటేబుల్‌ బుక్‌లను ఆవిష్కరించారు. జాతీయ విద్యా విధానంపై నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ సలహాదారులు శర్మ, వ్యక్తిగత కార్యదర్శి సురేంద్రమోహన్‌, పుదుచ్చేరి సీఎస్‌ రాజీవ్‌వర్మ, పలు పత్రికల సంపాదకులు, సీనియర్‌ జర్నలిస్టులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love