కులాలే కీలకం

Caste is the key– ఓబీసీలు, మధ్యతరగతి ఓట్లపై బీజేపీ కన్ను
– 2019 ఫలితాల పునరావృతం కోసం ఆరాటం
– నిలువరించేందుకు ప్రతిపక్షాల వ్యూహరచన
న్యూఢిల్లీ : మన దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చి ఏడు దశాబ్దాలు దాటినా, మండల్‌ కమిషన్‌ నివేదికను అమలు చేసి మూడు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ రాజకీయాలలో కుల ప్రభావం అధికంగానే ఉంటోంది. బీహార్‌లో కులగణన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా సంఖ్యను తేల్చాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. స్వాతంత్య్రానంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల సంఖ్యను తేల్చాయే తప్ప ఇతర కులాల వాస్తవ జనాభా ఎంతో నేటి వరకూ తెలుసుకోలేకపోయాయి. అసలు అందుకు ప్రయత్నం కూడా జరగలేదు. ఇప్పుడు బీహార్‌లో జరిగిన కులగణన దేశ రాజకీయాలలో సునామీ సృష్టించిందని చెప్పాలి. కులాలు, కోటాలపై దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. బీహార్‌ తరహాలోనే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే ఎలా, ఎప్పుడు అనే విషయం పార్టీల వైఖరి, రాజకీయ పథంపై ఆధారపడి ఉంది. అయినప్పటికీ ఈ సంవత్సరం చివరలో ఐదు రాష్ట్రాల శాసనసభలకు, వచ్చే సంవత్సరం ఏప్రిల్‌-మేలో లోక్‌సభకు ఎన్నికలు జరిగే వరకూ కులగణనపై చర్చలు సాగుతూనే ఉంటాయి. కోటా కోసం ఒక్క వెనుకబడిన తరగతులే పట్టుపట్టడం లేదు. ఆయా రాష్ట్రాలలో ఆర్థికంగా బలంగా ఉన్న మరాఠాలు, పటీదార్‌లు, జాట్లు, కాపులు కూడా ఇటీవలి కాలంలో తమకూ కోటా కావాలని కోరుతున్నారు.
బీహార్‌లో జరిగిన సామాజిక న్యాయ ఉద్యమం కారణంగా 1990లో ఆ రాష్ట్రంలో రాజకీయ అధికారం అట్టడుగు వర్గాల చేతిలోకి వచ్చింది. అయితే ఆ ఉద్యమం అనంతర కాలంలో ఆర్థిక సాధికారత దిశగా, ప్రజలకు విస్తృత అవకాశాలు కల్పించి వారి జీవితాలను మెరుగుపరచే దిశగా ముందడుగు వేయలేదు. బీహార్‌లో విజయవంతమైన సామాజిక న్యాయ ఉద్యమం రేపు దేశవ్యాప్తంగా మళ్లీ ఊపందుకుంటే అది బీజేపీకి రాజకీయంగా నష్టదాయకమే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా వెనుకబడిన తరగతులు, సబ్బండ వర్గాలు ఏకమైతే మోడీ విజయావకాశాలు దెబ్బతింటాయి. బీహార్‌లో 40 లోక్‌సభ స్థానాలు ఉండగా 2019 ఎన్నికలలో బీజేపీకి 17 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే బీహార్‌లో జరిగిందే దేశమంతా జరుగుతుందని అంచనా వేయడం సరికాదు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలో కూడా వెనుకబడిన, అట్టడుగు వర్గాల ప్రజలు ఏకమైనప్పుడే బీజేపీకి పరాజయం, పరాభవం ఎదురవుతాయి. ఎందుకంటే ఆయా రాష్ట్రాలలో కులాల ఆధిపత్యం ఇప్పటికీ కొనసాగుతోంది. కులాల వారీగా పార్టీలకు గంపగుత్తగా ఓట్లు పడుతున్నాయి. కొన్ని కులాలు సాంప్రదాయకంగా పార్టీలకు విధేయత ప్రకటిస్తున్నాయి. కాబట్టే ఇప్పుడు దేశ రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతున్నాయి. 2019లో తనకు అండగా నిలిచిన ఓబీసీలను, మధ్య తరగతి ప్రజలను మళ్లీ ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ ఎత్తుగడను చిత్తు చేసి, పూర్వ వైభవం సాధించాలని ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి.
ఈ రాష్ట్రాల పైనే బీజేపీ ఆశలు
దామాషా ప్రకారం ప్రాతినిధ్యం ఉండాలన్న బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం అభిప్రాయంతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఏకీభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల ఫలితాలను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఆ ఎన్నికలలో 224 లోక్‌సభ స్థానాలలో బీజేపీ యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించింది. దీనినిబట్టి స్పష్టమైన మెజారిటీకి ఆ పార్టీ కేవలం 49 స్థానాలు మాత్రమే దూరంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లోని సగానికి పైగా స్థానాలలో బీజేపీకి 50% పైగా ఓట్లు వచ్చాయి. ఈ రాష్ట్రంలో కులాల వారీ విభజన, అవకాశాలు, ముస్లింల శాతం దాదాపుగా బీహార్‌తో సమానంగా ఉంటాయి. అయినా యూపీలోని 80 లోక్‌సభ స్థానాలలో 40 స్థానాలలో బీజేపీకి యాభై శాతానికి మించి ఓట్లు పడడం గమనార్హం. మోడీ ఎక్కువగా ఆధారపడుతున్న రాజస్థాన్‌లోని 23 స్థానాలు, మధ్యప్రదేశ్‌లోని 25, గుజరాత్‌లోని 26, కర్నాటకలోని 22 స్థానాలలో పోలైన ఓట్లలో బీజేపీకి సగానికి పైగా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని ఓడించాలంటే అన్ని వర్గాల ప్రజలు ఒక్కటవ్వాల్సిన అవసరం ఉంది.
బీజేపీని ఓడించాలంటే…
దేశ రాజకీయాలలో ఓబీసీల భాగస్వామ్యం తక్కువేమీ కాదు. దేశానికి ఓబీసీ నేత ప్రధానిగా, గిరిజన నేత రాష్ట్రపతిగా పని చేస్తున్నారు. కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు ముఖ్యమంత్రులలో ముగ్గురు ఓబీసీలే. అగ్ర కులాలు బీజేపీకి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే బీహార్‌ కులగణనతో దేశ జనాభాలో వీరి సంఖ్య స్వల్పమేనని తేలిపోయింది. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి అత్యధిక స్థానాలు లభించినప్పటికీ ఆ పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 37 శాతమే. మధ్య తరగతి ప్రజలు, అట్టడుగు వర్గాలు సైతం బీజేపీకి ఓటు వేయడం వల్లనే ఆ పార్టీకి మంచి ఫలితాలు దక్కాయి. ఆయా వర్గాల ప్రజల మద్దతును ప్రతిపక్షాలు పొందగలిగితే బీజేపీని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు.

Spread the love