మెఘా – బివైడి డీల్‌కు కేంద్రం షాక్‌

– పెట్టుబడుల అనుమతికి నిరాకరణ
– రూ.8వేల కోట్ల ఒప్పందానికి నీళ్లు..!
హైదరాబాద్‌ : నగర కేంద్రంగా పని చేస్తోన్న మెఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్స్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌), చైనీస్‌ ఆటోమేకర్‌ బివైడి మోటార్స్‌తో కలిసి ఏర్పాటు చేయాలనకున్న తయారీ ప్లాంట్‌కు కేంద్రం ఎర్ర జెండా చూపింది. బివైడి సంస్థ ఒక్క బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.8వేల కోట్ల పైనా) పెట్టుబడులతో హైదరాబాద్‌లో విద్యుత్‌ కార్లు, బ్యాటరీల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని భావించింది. ఇందుకోసం ఎంఇఐఎల్‌తో కలిసి డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండిస్టీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డిపిఐఐటి)కి ప్రతిపాదిత దరఖాస్తును సమర్పించాయి. దీని అనుమతులకు కేంద్రం నిరాకరించిందని ఇటి ఓ కథనంలో వెల్లడించింది. భారత్‌లో చైనా పెట్టుబడుల గురించి భద్రతా పరమైన ఆందోళన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లో మూడు విద్యుత్‌ ఎస్‌యువి, ఇ6 విద్యుత్‌ వాహనాల విక్రయాలను బివైడి కలిగి ఉంది. ఈ ఏడాదిలోనే తన మొదటి ఎలక్ట్రిక్‌ వాహనాన్ని కూడా విడుదల చేసింది. భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న దేశాల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ 2020లో కేంద్ర ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద తయారీ ప్లాంట్‌ను భారత్‌లో ఏర్పాటు చేయనున్నామని బివైడి ఇంతక్రితం ప్రకటించింది. ఈ ప్రతిపాదనతో దిగ్గజ టెస్లాతో పోటీ పడాలని భావించింది. భారత్‌తో ప్లాంట్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఏడాదికి 10,000 -15వేల యూనిట్ల అమ్మకాలు చేపట్టాలని భావించింది. కానీ.. తాజా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం బివైడి, ఎంఇఐఎల్‌ సంస్థలను తీవ్ర నిరాశకు గురి చేసిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Spread the love