– వడ్డీ రేట్ల పెంపు
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఆ బ్యాంక్ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను పెంచింది. ఇటీవలే హెచ్‌డిఎఫ్‌సి ని విలీనం చేసుకున్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తాజా నిర్ణయంతో లక్షలాది మంది ఖాతాదారులపై ప్రభావం పడనుంది. బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసిఎల్‌ఆర్) 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. పెంచిన వడ్డీ రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చా యి. ఈ నిర్ణయంతో గృహ, వ్యక్తిగత, వాహన, రిటైల్ రుణ గ్రహీతలపై భారం పడనుంది. వారు చెల్లించే ఇఎంఐ పెరగనుంది. కొత్త వడ్డీ రేట్ల వివరాలు.. ఓవర్ నైట్ ఎంసిఎల్‌ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో ఈ రేటు 8.1 శాతం నుంచి 8.25 శాతానికి చేరింది. నెల రోజుల ఎంసిఎల్‌ఆర్ రేటు కూడా 10 బేసిస్ పాయింట్లు పెంచడంతో 8.2 శాతం నుంచి 8.3 శాతానికి చేర్చింది. మూడు నెలలపై వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.5 శాతం నుంచి 8.6 శాతంగా ప్రకటించింది. ఆరు నెలల ఎంసిఎల్‌ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు పెంచి 8.85 శాతం నుంచి 8.9 శాతానికి చేర్చింది. ఏడాది ఆపైన వ్యవధి రుణాలపై వడ్డీరేటును 9.05 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సిలు జులై 1వ తేది నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో రూ.18 లక్షల కోట్ల ఆస్తులతో ఒక దిగ్గజ సంస్థగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌గా ఏర్పాటు అయ్యింది. విలీనం అనంతరం 12 కోట్ల ఖాతాదారులు, 8,300 బ్యాంకు శాఖలు, 1.77 లక్షల మంది ఉద్యోగులతో కూడిన అతిపెద్ద బ్యాంకుగా ఆవిర్భవించింది.