వేలాది ఉద్యోగులపై వేటు

– మూడు సంస్థల యోచన
– క్రెడిట్‌ సూస్సెలో 35వేల సిబ్బంది..
– ఫోర్డ్‌లో 3వేల మంది ఇంటికి..
– గూగుల్‌లోనూ మళ్లీ ఉద్వాసనలు
న్యూఢిల్లీ: బహుళజాతి కార్పొ రేట్‌ సంస్థలు భారీ ఆదాయాలను ఆర్జిస్తున్నప్పటికీ.. మందగమన భయా లను సాకుగా చూపుతూ.. మరింత పొదుపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది చివరి నుంచి వరుసగా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తొలుత టెక్నలాజీ రంగంలో లక్షలాది మంది సిబ్బందిపై ఉద్వాసనలు ప్రారంభం కాగా.. ఆ తర్వాత తయారీ, స్టార్టప్‌, ఇతర రంగాల్లోనూ తొలగింపులు ఊపందుకున్నాయి. తాజాగా ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం క్రెడిట్‌ సూస్సె, ఫోర్డ్‌, గూగుల్‌లో వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నట్లు రిపోర్టులు వస్తోన్నాయి. అయితే ఈ సంస్థలు భారత్‌లో ఎంత మందిని తొలగించేది స్పష్టత లేదు. స్విట్జర్లాండ్‌ కేంద్రంగా పని చేస్తోన్న క్రెడిట్‌ సూస్సె ఏకంగా 35,000 ఉద్యోగులను తొలగించే యోచనలో ఉందని సమాచారం. సంక్షోభంలోని ఈ సంస్థను ఇటీవలే యుబిఎస్‌ స్వాధీనం చేసుకుంది. సూస్సెలో పని చేసే వారిలో సగానికిపైగా ఉద్యోగులను యుబిఎస్‌ తొలగించనుందని బ్లూమ్‌బర్గ్‌ రిపోర్ట్‌ చేసింది. ప్రస్తుత ఏడాదిలో మూడు దఫాలుగా ఉద్వాసనలు ఉంటాయని తెలుస్తోంది. వచ్చే రెండు మాసాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నామని యుబిఎస్‌ సిఇఒ సెర్గియో ఎర్మోట్టి జూన్‌ ప్రారంభంలో పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో క్రెడిట్‌ సూస్సెలో 45వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, మెటా, ట్విట్టర్‌, గూగుల్‌, అమెజాన్‌ తదితర కంపెనీలు తమ వేలాది మంది ఉద్యోగులపై వేటు వేసిన విషయం తెలిసిందే.
గూగుల్‌ మ్యాపింగ్‌లో తొలగింపులు..
టెక్‌ దిగ్గజం గూగుల్‌లో మరోసారి ఉద్యోగులపై వేటు పడనుంది. గూగుల్‌ మ్యాపింగ్‌ సర్వీస్‌ వేజ్‌లో ఉద్యోగులను తొలగించాలని యోచిస్తో న్నట్లు ఆ కంపెనీ తెలిపింది. అదే విధంగా వేజ్‌ అడ్వర్‌టైజింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను గూగుల్‌ యాడ్స్‌ టెక్నాలజీ కోసం వినియోగించనున్నట్లు పేర్కొంది. వేజ్‌ ప్రకటనల మానిటైజేషన్‌కు సంబంధించిన ఉద్యోగాల్లో తొలగింపులుంటా యని గూగుల్‌ జియో యూనిట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ క్రిస్‌ ఫిలిప్స్‌ ఉద్యోగులకు తెలిపారు. అయితే ఎంత మందిపై వేటు వేసేది ఆ సంస్థ వెల్లడించలేదు.
ఫోర్డ్‌లో 3వేల మంది..
ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ ఫోర్డ్‌ తమ ఆదాయం తగ్గడంతో ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు ప్రకటించింది. అమెరికాలో పనిచేస్తున్న వారిలో మూడు వేల మందిని తొలగించనున్నట్లు అంచనా. వీరిలో రెండు వేల మంది సాధారణ సిబ్బంది కాగా, మిగతా వెయ్యి మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులని రిపోర్ట్‌లు వస్తోన్నాయి. అన్ని స్థాయిల్లో తొలగింపులు ఉండనున్నప్పటికీ.. ప్రధానంగా అధిక వేతనాలు పొందుతున్న ఉన్నత స్థాయి ఉద్యోగులు ఎక్కువ మందిని ఇంటికి పంపించనున్నట్లు సమాచారం.

Spread the love