కేంద్రం గుప్పెట్లోకి లైబ్రరీలు

Centrally located librariesఆలోచనల యుద్ధంలో పుస్తకాలే అసలైన అస్త్రాలు. ఆదిమానవ దశ నుంచి ఆధునిక మానవునిలో చైతన్యవంతమైన ప్రగతి, సంస్కృతి శిఖరం వరకు సాధించిన జ్ఞానానికి నిలువెత్తు సాక్ష్యం ”పుస్తకం”. అలా మానవుడు సృష్టించిన వాటిలో అత్యద్భుతమైనది పుస్తకం అంటారు మేధావులు. వాటిని కలిగి ఉన్న ”గ్రంథాలయాలు” సృష్టికే మార్గదర్శక కేంద్రాలు కదా! గ్రంథాలయాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే? సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే విజ్ఞాన కేంద్రాలుగా చెప్పుకోవచ్చు. ఒక తరం జ్ఞానాన్ని, చైతన్యాన్ని మరో తరానికి అందించే ”అంతంలేని అక్షర క్షిపణి నిక్షేపాల నిల(గ్రంథాల)యాలు.” ఎంతో నిగూఢమైన పురాతన, సమకాలీన అంశాల విజ్ఞానాన్ని అందించే భాండాగారాలు గ్రంథాలయాలు. మానవ జాతి చరిత్ర గతిని మార్చడంలో ప్రభావం, ప్రాముఖ్యత ఎంతో ఉంది. సమాజ ఉన్నతికి ఎంతో తోడ్పడుతాయి. నాడు నిరంకుశ బ్రిటిష్‌ పాలకుల దుర్విధానాలపై భరతజాతిని చైతన్య పరచడంలో గ్రంథాలయాల పాత్ర ఎంతో గొప్పది. అలాంటి గ్రంథాలయాలను… నేడు కేంద్రం రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ ఒక్కొక్కటిగా తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర పరిధిలోని లైబ్రరీ వ్యవస్థను ఉమ్మడి జాబితాలో (కాంకరెంట్‌ లిస్టు)కి బదిలీ చేసి… తన పరిధిలోకి తీసుకునేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ త్వరలో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. ఈ మధ్య ఢిల్లీలో జరిగిన రెండు రోజుల ”ఫెస్టివల్‌ ఆఫ్‌ లైబ్రరీస్‌ 2023”లో దేశవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలను ఉమ్మడి జాబితాకు బదిలీ చేయడంపై చర్చలు జరిగాయి. రాష్ట్ర గ్రంథాలయాలు తీర్మానం చేసి కేంద్ర మంత్రిత్వశాఖ పరిశీలనకు సమర్పించాలని కోరినట్లు తెలుస్తుంది. ఈ సమావేశానికి ఏపీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. తెలంగాణ నుంచి గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌, 14 జిల్లాల గ్రంథాలయాల చైర్మన్లు పాల్గొన్నారు.
ఇక మన తెలంగాణ విషయానికి వస్తే ఒక స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ, 31జిల్లా, రెండు డివిజనల్‌, 537 సిటీ, టౌన్‌ లైబ్రరీలు, 99 గ్రామీణ, రెండు ఎన్జీఓ ట్రస్ట్‌లు నడుపుతున్న లైబ్రరీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్రంథాలయాలను రాష్ట్రాల జాబితా నుండి ఉమ్మడి జాబితాకు బదిలీ చేయడాన్ని కేరళ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అంతటితో ఆగకుండా కేరళ స్టేట్‌ లైబ్రరీ కౌన్సిల్‌ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేసింది. కేరళలో లైబ్రరీ వ్యవస్థలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలన వ్యవస్థ ఉంది. ఇలాంటి సందర్భంలో గ్రంథాలయాల స్వాతంత్య్రానికి, రాష్ట్రాల అధికారాలకు, స్వేచ్ఛకు భంగం కలిగించే అప్రజాస్వామిక విధానాలు ఎంత మాత్రం క్షేమం కాదు. కేంద్రం తీసుకునే నిర్ణయంతో గ్రంథాలయాలు స్వయం ప్రతిపత్తిని కోల్పోతాయని భావిస్తున్నారు. కానీ మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు కారణం ఏం చెప్పుతుందటే! ”భారత దేశ ప్రాచీన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు, గ్రంథాలయాలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగమే” అని ప్రకటించింది. కేంద్రప్రభుత్వం రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి లైబ్రరీలను మార్చడంలో ద్వంద్వ విధానాలకు తావిస్తున్నట్లు విద్యావేత్తలు భావిస్తున్నారు. దేశమంటే కేంద్రం ఒక్కటే కాదు? రాజ్యాంగంలో పొందుపరచుకున్న మేరకు రాష్ట్రాల సమాఖ్య సమాహారమే అనేది మర్చిపోవదు. ఇప్పటికే రాష్ట్రాల హక్కులను హరిస్తూ ఒక్కొక్కటిగా కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకుంటున్నది నిజం కాదా! నిజంగానే గ్రంథాలయాల అభివృద్ధి చేయాలని, ఆధునీకరించాలని ఉంటే? ఇప్పుడున్న వ్యవస్థల ద్వారా ఎందుకు చేయరు. ఈ వ్యవస్థను బలోపేతం చేయాల్సింది మీరే కదా!
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పక్షపాతం లేకుండా నూతన గ్రంథాలయాలను ఏర్పరచాలి. అలాగే దేశంలో ఉన్న గ్రంథాలయాలను నేటి పరిస్థితులకు అనుగుణంగా ఆధునికీకరించాలి. నూతన గ్రంథాలను ముద్రించడానికి నిధులు విడుదలచేసి తోడ్పడాలి. రచయితలు ముద్రించిన వాటిని కొనుగోలు చేయాలి. గ్రంథాలయ నిర్వహణ, కొనుగోలు, ముద్రణ కోసం సముచిత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను విడుదల చేయాలి. వారి నిధుల శాతాలను గ్రంథాలయాల్లో బోర్డులపై ముద్రించండి. కానీ ఉమ్మడి జాబితాలోకి మార్చడం ఎంత మాత్రం మంచి నిర్ణయం కాదని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇలా రాష్ట్రాల అధికారాలకు, గ్రంథాలయాల స్వాతంత్య్రానికి భంగం కలిగిస్తున్న అప్రజాస్వామిక విధానాలకు వెంటనే స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కాదంటే! రైతు చట్టాలు రద్దు చేసే దాకా జరిగిన రైతు ఉద్యమంలా దేశ ప్రజలంతా మరో గ్రంథాలయ ఉద్యమానికి నాంది పలుకుతారని గమనించండి. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే రాష్ట్ర గ్రంధాలయాలను తీర్మానం కోరడం భావ్యమా! గ్రంథాలయా లను కేంద్రం గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే విధానాలలోనే గత్తాధిపత్య ధోరణి ఉందనిపిస్తుంది. అంతే కాకుండా సొంత ఎజెండా ఏదో ఉందనిపిస్తుంది. నా ఒక్కడి వల్ల ఈ దేశం మారిపోతుందా..? అనుకొనే విధానాలు వీడాలి. కేరళ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించిన విధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. పోరాటం చేసైనా గ్రంథాలయాల స్వతంత్రతను కాపాడుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది.
– మేకిరి దామోదర్‌, సెల్‌:9573666650

Spread the love