అర్జెంటీనాకు వామపక్ష వ్యతిరేక మితవాద శక్తుల ముప్పు!

అర్జెంటీనాకు పచ్చి మితవాద శక్తుల ముప్పు ముంచుకువస్తున్నట్లు ఈనెల పదమూడున జరిగిన ప్రాథమిక ఎన్నికల ఓటింగ్‌ తీరుతెన్నులు వెల్లడించాయి. ఫలితాలు అనేక మందిని దిగ్భ్రాంతికి గురిచేశాయి. కొత్త రాజకీయ చర్చకు తెరతీశాయి. ఆ ఎన్నికల్లో కేవలం రెండు సంవత్సరాల క్రితమే ”స్వేచ్ఛతో ముందుకు” (లిబర్టీ అడ్వాన్సెస్‌) అనే పార్టీని పెట్టిన ఆర్థికవేత్త జేవియర్‌ మిలై అగ్రస్థానంలో నిలిచాడు. దేశంలోని 24 ప్రావిన్సులలో పదహారు చోట్ల ఆధిక్యత కనపరిచాడు. ఈ ఎన్నికలలో1.5శాతం కనీస ఓట్లు సాధించిన పార్టీ లేదా కూటమి పార్టీలలో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నవారు. అక్టోబరు 22న జరిగే అధ్యక్ష, ఉపాధ్యక్ష, పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసేందుకు అర్హులు. మిలైకు 30.04శాతం, మరో మితవాద పార్టీకి 28.28శాతం, ప్రస్తుతం అధికారంలో ఉన్న పెరోనిస్టు ప్రజాతంత్ర, వామపక్ష కూటమికి 27.27శాతం ఓట్లు వచ్చాయి. అర్జెంటీనాలో ఉన్న ఎన్నికల విధానం ప్రకారం ఏ కూటమిలోనైనా ఉన్న పార్టీలన్నీ ప్రాథమిక ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. వారి బలాన్ని బట్టి ఓట్లు తెచ్చుకుంటారు. అధికార పెరోనిస్టు కూటమిలో ఇద్దరు పోటీ చేశారు. ఒకరికి 21.4శాతం, మరొకరికి 5.87శాతం వచ్చాయి. ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న దేశ ఆర్థిక మంత్రి సెర్గియో మాసా అక్టోబరు ఎన్నికలలో ఆ కూటమి తరఫున బరిలో ఉంటాడు. మరో మితవాద కూటమిలో ఒకరికి 16.98శాతం, మరొకరికి 11.3శాతం వచ్చాయి. ఎక్కువ తెచ్చుకున్న హౌంమంత్రి పార్టిసియా బుల్‌రిచ్‌(మహిళ) అభ్యర్థి. వీరుగాక 3.83శాతం తెచ్చుకున్న మరోపార్టీ నేత జువాన్‌ సచియారెటి, వామపక్ష, వర్కర్స్‌ ఫ్రంట్‌ కూటమికి 2.65శాతం ఓట్లు రాగా వారిలో 1.87శాతం తెచ్చుకున్న మిరియం బెర్గమాన్‌ పోటీలో నిలిచాడు. అక్టోబరులో జరిగే ఎన్నికలో ఈ ఐదుగురు అధ్యక్షపదవికి, వారు నిలిపే మరోఐదుగురు ఉపాధ్యక్ష పదవికి అర్హులు. వారిలో 45శాతంపైగా తెచ్చుకున్నవారు ఒకరే ఉంటే ఆ రెండు పదవులకు పోటీ చేసిన వారు నెగ్గినట్లు ప్రకటిస్తారు. అలాగాక 40శాతం తెచ్చుకున్నప్పటికీ విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థికి మొదటి స్థానంలో ఉన్నవారికి తేడా పదిశాతం కంటే ఎక్కువ ఉండాలి. ఒక వేళ ఇద్దరికి 45శాతానికి మించి ఓట్లు వచ్చినా లేక 40శాతం నిబంధన ప్రకారం ఎవరూ నెగ్గకున్నా, ఎక్కువ ఓట్లు వచ్చిన తొలి ఇద్దరి మధ్య నవంబరు 19న రెండవ దఫా ఎన్నిక జరిపి విజేతను ప్రకటిస్తారు. పదహారు సంవత్సరాలకే ఓటింగ్‌ హక్కు ఇచ్చినప్పటికీ 18-70 సంవత్సరాల వయస్సులో ఉన్న వారు విధిగా ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.
2019లో జరిగిన ఎన్నికలలో పెరోనిస్టు కూటమికి చెందిన ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ ప్రాథమిక ఎన్నికల్లో 47.79శాతం ఓట్లు, తొలిదఫా పోలింగ్‌లో 48.24శాతం తెచ్చుకోవటంతో రెండవ దఫా అవసరం లేకపోయింది. గత ఎన్నికల్లో ఆరుగురు పోటీ చేశారు. ఈ ఎన్నికలో ఎవరు విజేతగా ఉంటారు అన్నది అక్టోబరు 22న జరిగే పోలింగ్‌లో తేలే అవకాశం కనిపించటం లేదు. త్రిముఖ పోటీలో ప్రాథమిక ఎన్నికల్లో వచ్చిన మాదిరి ఓట్లే వస్తే రెండు మితవాద పార్టీల పోరుగా మారుతుంది. అలాగాక మిలై తొలిస్థానంలో కొనసాగి అధికారంలో ఉన్న పెరోనిస్టు కూటమి ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే పోటీ మితవాద-ప్రజాతంత్ర, వామపక్ష కూటమి పోరుగా మారుతుంది. అందువలన అర్జెంటీనా ఎన్నికలు ఒక్క లాటిన్‌ అమెరికాకే కాదు, మొత్తం ప్రపంచానికే ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు. అక్కడి ఎన్నికల పద్ధతి ప్రకారం పార్లమెంటు ఉభయ సభలకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దిగువ సభలో సగం సీట్లకు, ఎగువ సభలో మూడోవంతు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటు రద్దు కాదు. ఒకసారి ఎన్నికైన వారు ఎగువసభలో ఆరు సంవత్సరాలు, దిగువ సభలో నాలుగేండ్లు ఉంటారు. ప్రజాప్రతినిధుల దిగువ సభలో రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన సీట్లు ఖరారు చేస్తారు. కనీసం మూడుశాతం తెచ్చుకున్న పార్టీలు, స్వతంత్రులకు దామాషా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. మూడోవంతు సీట్లలో మహిళలను నిలపాలి. ఎగువసభకు దేశాన్ని ఎనిమిది భాగాలుగా విభజించారు. ఒక్కో ప్రాంతం నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ముగ్గురిని ఎన్నుకుంటారు. ప్రతి పార్టీ ఇద్దరు అభ్యర్థులను నిలపవచ్చు, వారిలో ఒకరు మహిళ ఉండాలి. ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీకి రెండు సీట్లు, రెండవ స్థానంలో ఉన్న పార్టీకి ఒక సీటు కేటాయిస్తారు.
పెరోనిస్టు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కరోనా, ఇతర వైఫల్యాల కారణంగా తలెత్తిన పరిస్థితిని ఉపయోగించుకొని జేవియర్‌ మిలై 2021 పార్లమెంటు ఎన్నికల్లో కొత్త పార్టీతో రంగంలోకి దిగాడు. అక్కడ 113శాతం ద్రవ్యోల్బణం ఉంది. వాస్తవ ప్రతిపాదనలతో ముందుకు వచ్చిన అభ్యర్థిని తాను మాత్రమేనని మిలై చెప్పాడు. తాను అనార్కో కాపిటలిస్టునని చెప్పుకున్నాడు. అతగాడికి కుక్కలంటే తగని మక్కువ. కుక్కల భాషలో మాట్లాడతాడు. ఫైనాన్సియల్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గించటం ఎలా అన్నది తన ఆలోచన అని అందుకుగాను తన దగ్గర ఐదు కుక్కలున్నాయని లేదా అవి పది లేదా ఇరవై కూడా కావచ్చు అని చెప్పాడు. వాటిని వదిలితే తగ్గుతుందన్నాడు. మిలై దృష్టిలో కుక్కలంటే రాజ్యాన్ని పక్కన పెట్టి మొత్తం పెట్టుబడిదారులకు అప్పగించాలని ప్రబోధించే ప్రముఖులు. ఆర్థిక సమస్యలను పరిష్కరించటానికి రాజ్యం ఒక పరిష్కారం కాదు, అదే అసలు సమస్య అని కూడా చెప్పాడు. ఐరోపా సంతతితో ఏర్పడిన అర్జెంటీనా గత శతాబ్ది తొలి రోజుల్లో సంపద్వంతంగా ఉండేదని, ప్రస్తుత దురవస్థకు ప్రభుత్వాల వైఫల్యమే కారణమనేందుకు ఉదాహరణగా ఉందన్నాడు. దేశంలోని మొత్తం రాజకీయ తరగతి అంతా దొంగలని, పన్నులు విధించాలని కోరటం హింసాత్మక చర్య అన్నాడు.” హంతకుడు హంతకుడే, దొంగను దొంగనే అని పిలుస్తాం, వారంతా ఒక సంఘటిత నేరస్థ బృందం.ప్రపంచంలో అతి పెద్ద సంఘటిత నేర సంస్థను రాజ్యం అని పిలుస్తారు. దాన్ని నేను మరో విధంగా ఎందుకు చూడాలి?” అన్నాడు. ఇతగాడి నోటి దురుసుతనంతో అసంతృప్తితో ఉన్న జనం మద్దతుదారులుగా మారవచ్చు, ఓట్లు వేయవచ్చు. నిజంగా అధికారం వస్తే ఎలా పాలిస్తాడో ఏ తిప్పలు తెచ్చిపెడతాడో అన్న భయాన్ని వెల్లడించేవారు కూడా ఉన్నారు.
ప్రాథమిక ఎన్నికల్లో మొదటి స్థానంలో ఉన్నట్లు ఫలితాలు వెల్లడి కావటంతో మిలై తన మద్దతుదారులతో మాట్లాడుతూ సంబరాలు చేసుకున్నాడు. రాజకీయ నేతలు మారకపోతే వారిని వదిలించుకోవాలని పిలుపునిచ్చాడు. ప్రస్తుత అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ విధానాల కారణంగా చైనాను అనుమతించి కొన్ని కీలకరంగాలను అప్పగించాడని ఆరోపించాడు. తాను చైనాతో సంబంధాలను తెంచివేస్తానని, కమ్యూనిస్టులతో వ్యాపారం చేయనని అన్నాడు. కమ్యూనిజం ఒక హంతక వ్యవస్థ, సోషలిజం ఆత్మకు పట్టిన జబ్బు అన్నాడు. తాను అధికారానికి వచ్చిన తరువాత దేశ రిజర్వు బ్యాంకును రద్దు చేస్తానని, ప్రభుత్వ ఖర్చు కోత పెడతానని, పతనమవుతున్న దేశ కరెన్సీ పెసోను రద్దు చేసి కొన్ని దేశాలు అమలు చేసిన మాదిరి అమెరికా డాలరును చట్టబద్దమైన కరెన్సీగా ప్రకటిస్తానని చెప్పాడు. విధిగా పాఠశాలల్లో లైంగిక విద్య బోధన జరపాలన్న గత ప్రభుత్వ చట్టాన్ని రద్దు చేస్తానని అన్నాడు. ప్రాథమిక ఎన్నికల ఫలితాలు వెలువడినందున ప్రజాస్వామ్య అనుకూల, ప్రజల వాణి గురించి అసలైన ప్రచారం ఇప్పుడు ప్రారంభం అవుతుందని ప్రస్తుత అధ్యక్షుడు ఫెర్నాండెజ్‌ ప్రకటించాడు. గతంలో తీసుకున్న ప్రజానుకూల కార్యక్రమాలు, హక్కుల రక్షణకు తాము ఐక్యంగా పని చేస్తామని అన్నాడు. మరోసారి అర్జెంటీనా మితవాద శక్తుల చేతుల్లోకి పోకుండా చూడాలన్నదే తన ఆందోళన అన్నాడు.
ప్రాథమిక ఎన్నికల్లో మిలై మొదటి స్థానంలో ఉన్నట్లు ఫలితాలు వెల్లడికావటంతో అర్జెంటీనా స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలింది. రిజర్వుబాంకు వడ్డీ రేట్లను 21శాతం పెంచింది. కరెన్సీ విలువను 18శాతం తగ్గించింది. రుణాల చెల్లింపుల గండం నుంచి బయట పడేందుకు 44బిలియన్‌ డాలర్ల రుణం కోసం ఐఎంఎఫ్‌తో ప్రభుత్వం ప్రారంభించిన చర్చల్లో తాను కూడా భాగస్వామిని అవుతానని మిలై ప్రకటించాడు. గత నెలలో జరిపిన సమీక్షల తరువాత ఏడున్నర బిలియన్‌ డాలర్ల రుణాన్ని విడుదల చేసేందుకు ఐఎంఎఫ్‌ అంగీకరించింది. లాటిన్‌ అమెరికాలో వివిధ దేశాలలో నిరంకుశ, మితవాద శక్తులకు వ్యతిరేకంగా ఎన్నికల్లో విజయాలు సాధించిన వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు గత పునాదులను అలాగే ఉంచి వాటి మీదనే సామాన్య జనానికి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవటంతో వరుసగా రెండు, మూడు సార్లు గెలుస్తూవచ్చారు. అయితే వాటికి ఉన్న పరిమితులు వెల్లడి కావటంతో జనంలో తలెత్తిన అసంతృప్తి కారణంగా తిరిగి మితవాద శక్తులు తలెత్తుతున్నాయి. లాటిన్‌ అమెరికా నయా ఉదారవాద విధానాల ప్రయోగశాల. వాటి దివాలాకోరు తనంతో జన జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి. దాంతో జనం వాటిని వ్యతిరేకించే శక్తులకు పట్టం గట్టారు. అర్జెంటీనాలో కూడా జరిగింది అదే. ఆ శక్తులు మౌలిక విధానాల మార్పుల జోలికి పోని కారణంగా జన జీవితాల్లో మౌలిక మార్పులు రాలేదు. అర్జెంటీనాలో ప్రస్తుతం 45శాతం జనం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. గతేడాది వార్షిక ద్రవ్యోల్బణం వందశాతానికి చేరింది. ప్రభుత్వం వద్ద నగదు నిల్వలు లేవు. దశాబ్దికాలంగా జీడీపీ ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది. కరెన్సీ విలువ పతనమైంది. అప్పుల మీదనే దేశం నడుస్తోంది. ఈ కారణంగానే మితవాద ఆర్థికవేత్త కూడా అయిన మిలై చేస్తున్న సైద్ధాంతికపరమైన దాడికి నూతన తరం ఆకర్షితమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న వాటన్నింటినీ రద్దు చేసి మొత్తం బాధ్యత అంతటినీ మార్కెట్‌ శక్తులకు వదలి వేస్తే అవే సమస్యలను పరిష్కరిస్తాయంటూ అరచేతిలో స్వర్గం చూపుతున్నాడు. డోనాల్డ్‌ ట్రంప్‌, బ్రెజిల్‌ మితవాది బోల్సనారో బాటలో తాను దేశాన్ని నడిపి ఫలితాలను చూపుతానని నమ్మబలుకుతున్నాడు.
మార్కెట్‌ అనుకూల మిలై వాగాడంబరానికి మితవాద శక్తులు మద్దతు ఇస్తున్నాయి. 2015 నుంచి 2019వరకు మధ్యేవాద మితవాద కూటమిగా వర్ణించిన శక్తులు అధికారంలో ఉన్నాయి. ఆ శక్తుల వైఫల్యంతో అంతకు ముందు రెండు సార్లు అధికారంలో ఉన్న వామపక్ష పెరోనిస్టు శక్తులకు 2019లో జనం తిరిగి పట్టం కట్టారు. కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్‌, మరింత దిగజారిన ఆర్థిక వ్యవస్థ కారణంగా జనంలో ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి తలెత్తింది. ఏ ప్రభుత్వమైతే పెద్ద ఎత్తున సబ్సిడీలు, నగదు బదిలీ చేసిందో ఆ లబ్ది పొందిన పేదలు కూడా దానికి వ్యతిరేకంగా ఇప్పుడు మితవాద మిలైకి ఓటువేసినట్లు స్పష్టమైంది. ఇప్పుడున్న వ్యవస్థను సమూలంగా కూలగొడితే తప్ప జీవితాలు బాగుపడవు అంటున్న మితవాద మిలై విప్లవాత్మక మార్పులను నిజంగా తెస్తాడని, మరొక మార్గంలేదని జనం భ్రమలకు గురైనట్లు పరిశీలకులు భావిస్తున్నారు. గత ప్రభుత్వాలు చేయలేనిదానిని చేసి చూపుతానని మిలై జనాన్ని నమ్మించేందుకు చూస్తున్నప్పటికీ అతని విజయం అంత తేలిక కాదని భావిస్తున్నవారు కూడా లేకపోలేదు. ప్రాథమిక ఎన్నికల్లో విధిగా ఓటు వేయాలన్న నిబంధనలేని కారణంగా మూడో వంతు మంది అసలు ఓటింగుకే రాలేదని, మిలై అధికారానికి వస్తే రాగల ప్రతికూల పరిణామాల గురించి చర్చ రానుందని అప్పుడు అతని పలుకుబడి తగ్గవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. పెరోనిస్టులు ఇటీవలి సంవత్స రాల్లో చీలిపోయారని, మితవాద ముప్పు గ్రహించి తిరిగి ఏకం కావచ్చని చెబుతున్నవారూ లేకపోలేదు. ఏమైనప్పటికీ మితవాద ముప్పును తక్కువ అంచనా వేయలేము. నయా ఉదారవాద విధానాలకు శస్త్రచికిత్స తప్పపై పూతలతో దాన్ని సంస్కరించి ప్రజానుకూలంగా మార్చలేరన్నది గ్రహించాల్సి ఉంది.

ఎం. కోటేశ్వరరావు
8331013288

Spread the love