పట్టించుకునే వారేరీ..?

Who cares..?ఇప్పటిదాకా వెలువడిన ఎన్నికల వార్తలు.. కథనాలతో రాష్ట్రం వేడెక్కింది. అధికార బీఆర్‌ఎస్‌ తన తొలి జాబితాను ప్రకటించేసరికి వాతావరణం మరింత హీటెక్కింది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌ సైతం సీట్ల కోసం దరఖాస్తులు, జాబితాల తయారీలో తలమునకలై ఉంది. ఇంకోవైపు బలంగా లేకపోయినప్పటికీ బీజేపీ కూడా అదే రకంగా హడావుడి చేస్తోంది. రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్లే పరమావధిగా, ఓట్లే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తరుణంలో జనం గోస పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రాష్ట్రం సిద్ధించి పదేండ్లు అవుతున్నా… ఇక్కడ అనేక తరగతులు, వర్గాల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి ఉంది. ముఖ్యంగా చిన్నా చితకాజీవులు, చిరుద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కొలువుల్లోని ఉద్యోగులు, విద్యార్థులు, యువతకు సంబంధించిన అనేక సమస్యలు ఏండ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్నాయి. కమ్యూనిస్టులు మినహా వీటి వైపు చూసే వారే ఉండబోరన్నది కాదనలేని సత్యం.
విద్యారంగంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్పులు, కళాశాలలు, పాఠశాలల్లో అధిక ఫీజులు, ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకీ ఆందోళనకరంగా మారాయి. వీటిపై ఇప్పటికే అనేక విద్యార్థి సంఘాలు ఆందోళనబాట పట్టాయి. పలుమార్లు చలో హైదరాబాద్‌, చలో అసెంబ్లీ కార్యక్రమాలకు కూడా అవి పిలుపునిచ్చాయి. అయినా సర్కారులో చలనం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న గురుకులాలు అసౌకర్యాలకు నిలయాలుగా మారాయి. అత్యధిక భాగం అద్దె భవనాల్లోనే అవి కునారిల్లుతున్నాయి. గ్రూప్‌-1 పరీక్షల బాగోతం బయటపడ్డాక యువతలో నైరాశ్యం నెలకొంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా డీఎస్సీ వేయకపోవటంతో టీచర్‌ కొలువుల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన వారందరూ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అలాంటి నిరుద్యోగులందరి కోసం గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి అమలు చేయకపోవటం బాధాకరం. వైద్యరంగంలో దేశంలోనే మన రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలవటానికి ఆ శాఖలోని ఉద్యోగులు, సిబ్బంది కృషే కారణమంటూ ప్రభుత్వ పెద్దలు పలుమార్లు సెలవిచ్చారు. కానీ వారి సమస్యలు మాత్రం ప్రభుత్వానికి పట్టవు. ఈ క్రమంలో పదోన్నతులు, సీనియార్టీల గుర్తింపు కోసం వైద్యులు, పని భారం పెరిగిపోవటంతో స్టాఫ్‌ నర్సులు, రోగుల సంఖ్యకు అనుగుణంగా తమ సంఖ్యను పెంచకపోవటంతో రెగ్యులర్‌ ఏఎన్‌ఎమ్‌లు, క్రమబద్ధీకరణ కోసం కాంట్రాక్టు ఏఎన్‌ఎమ్‌లు, కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది ఆందోళనబాట పట్టారు. రెండో ఏఎన్‌ఎమ్‌లు ఇప్పటికే సమ్మెలోకి వెళ్లటం గమనార్హం. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద పని చేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర అన్ని క్యాడర్లలోని ఉద్యోగులు, సిబ్బంది సమాన పనికి సమాన వేతనం, క్రమబద్ధీకరణ కోసం పోరాటంలోకి దిగారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 12 వేల మందికి పైగా డాక్టర్లు, నర్సులు, సిబ్బంది…ట్రెజరీ ద్వారా వేతనాలు లేకపోవటంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇతరులకు వైద్యసేవలందించి, ప్రాణాలు కాపాడే వారికి ఆరోగ్య కార్డులు లేకపోవటం వింతల్లో వింత. ఆయుష్‌ విద్యార్థులు ఉపకార వేతనాల పెంపు కోసం రోడ్డెక్కటమనేది వారి పట్ల సర్కారు వైఖరికి నిదర్శనం.
మరోవైపు రాష్ట్రంలో 50 వేల వరకూ ఉన్న పంచాయతీ కార్మికులకు కనీస వేతనాల్లేవు. మల్టీపర్సస్‌ విధానం రద్దు తదితర అంశాలపై వారు సమ్మె చేసినా సర్కారు కనికరించలేదు. రూ.ఐదు లక్షల బీమా, చనిపోతే రూ.10 వేల తక్షణ సాయం అంటూ ప్రభుత్వం ప్రకటించినా, బతికున్నప్పుడు పెట్టనోడు, చనిపోయినప్పుడు ఇస్తే ఏం ఉపయోగమంటూ పంచాయతీ కార్మికులు సర్కారుపై గుర్రుగా ఉన్నారు. వారితోపాటు త్వరలో మున్సిపల్‌ కార్మికులూ తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇలా అనేకానేక ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ రాబోయే నాలుగు నెలల వరకూ అధికార పార్టీకి ఆ తీరిక ఉండబోదు. కాంగ్రెస్‌, బీజేపీలదీ అదే దారి. అందువల్ల తమ సమస్యలను పరిష్కరించే వారికే, వాటిపై ఆందోళన సాగించే పార్టీలు, అభ్యర్థులకే ఓటేస్తామంటూ ఆయా ఉద్యోగులు, సిబ్బంది తేల్చి చెప్పాలి. ఆ రకమైన చైతన్యాన్ని ఓటర్లు ప్రదర్శించగలగాలి. అప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. తద్వారా ఎన్నికలు, ఓట్లు, సీట్లనేవి ప్రజా జీవితాలను మార్చేవిగా, వారిని అభివృద్ధివైపు తీసుకెళ్లేవిగా ఉండాలనే సంకేతాలనివ్వాలి.

 

Spread the love