సమాచార సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి సమాజంలో గ్రంథాలయాల పాత్ర కీలకమైనది. విద్య, పరిశోధన, సంస్కృతి, సమాచార వ్యాప్తికి తోడ్పాటునివ్వడంలో గ్రంథాలయాల పాత్ర అనిర్వచనీయం. ఈ డిజిటల్ యుగంలో లైబ్రరీలు ఈ-బుక్స్, అకడమిక్ జర్నల్స్, రీసెర్చ్ పేపర్లు, మల్టీమీడియా కంటెంట్ సహా తక్షణం అందుబాటులో ఉండే సమాచార భాండాగారాలు. ఇంటర్నెట్ అనుసంథానంతో భౌగోళిక సరిహద్దులను దాటి… సమాచారం పొందటానికి అవకాశం ఏర్పడింది. విద్యార్థుల నుంచి పరిశోధకుల వరకు అనంతమైన సమాచారాన్ని ఈ లైబ్రరీలు అందిస్తాయి. చదువుల నైపుణ్యాలను మెరుగుపర్చడానికి, వివిధ విషయాలపై అవగాహన పెంచడానికి… జీవితకాలం తోడుండే నేస్తం లైబ్రరీ. ప్రపంచస్థాయి నుంచి మండలస్థాయి, కళాశాల, పాఠశాలస్థాయి వరకు గ్రంథాలయాలు ఉన్నాయి. గ్రంథాలయాలంటే కేవలం పుస్తకాల వరుసలు కాదు, వివిధ పత్రికల సమాహారం అంతకన్నా కాదు. గ్రంథాలయం… ఆలోచనా స్రవంతి… నిశ్శబ్ద చైతన్య దీపిక. మంచి పుస్తకం కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. మంచి పుస్తకమిచ్చే మనశ్శాంతి అనుభవించేవారికే తెలుస్తుందంటారు. ప్రతి ఇంట్లో వంటగది ఉన్నట్లే పుస్తకాల గది కూడా ఉండాలి. ‘పుస్తకాలు లేని ఇల్లు ఆత్మలేని శరీరం వంటిది’ అంటారు మహాకవి కాళిదాసు. జ్ఞానాన్ని సుగంధంతో పోల్చారు. పువ్వు వలే పుస్తకం కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా నలుదిక్కులా పరిమళాన్ని వెదజల్లుతుందని అంటారాయన. ‘నేను నా లైబ్రరీలోకి వెళ్లానంటే… ప్రపంచ చరిత్ర అంతా నా కళ్ల ముందు కనిపిస్తుంది అంటారు అలెగ్జాండర్ స్మిత్.
దేశ చరిత్ర, కళలు, సంస్కృతులు-పుస్తకాలు లేకుండా వర్థిల్లవు. అధ్యయనం లేకుండా ఏ రంగంలోనూ ఎవరూ రాణించలేరు. గొప్ప సంస్కృతులు గొప్ప చరిత్రగా మనగలగడానికి పుస్తకాలు, గ్రంథాలయాలు వారధులు. ‘పుస్తకాలు నా మనస్సుకు, హదయానికీ రెక్కలనిచ్చాయి/ నేను బురద నుంచి బయటపడటానికి యెంతో తోడ్పడ్డాయి/ పుస్తకాలు చదవకపోతే నా చుట్టూ ఉన్న మౌఢ్యంలోనూ, నీచంలోనూ మునిగిపోయి ఉండేవాడ్ని!/ విశాలమైన ప్రపంచ దృశ్యాలను పుస్తకాలు నా ముందు పరిచాయి’ అంటాడు మక్సీం గోర్కీ. దేశ ప్రజలను అలాంటి మౌఢ్యంలోకి, నీచంలోకి నడిపించడానికి, సమాజ వికాసానికి వారధిగా ఉన్న లైబ్రరీలకు గండికొట్టడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి, ఆ స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలని ఆర్‌ఎస్‌ఎస్ ఒక పథకం ప్రకారం యత్నిస్తోంది. ఇప్పటికే విశ్వవిద్యాలయాలు, కేంద్ర సంస్థలు, శాస్త్ర, పరిశోధనా సంస్థలన్నిటినీ సంఫ్‌ు పరివారంతో నింపేసింది. శాస్త్ర పరిశోధనలకు అందజేసే అవార్డులను నిలిపేసింది. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని పాఠ్యాంశం నుంచి తొలగించింది. పాఠ్యాంశంగా ఉన్న గాంధీ జీవిత చరిత్ర స్థానంలో సావర్కర్ చరిత్రను జోడించింది. సంఫ్‌ు పరివారాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తూ దళిత, ఆదివాసీ యువతపై కేంద్రీకరించి వారిలో బూజుపట్టిన మనువాద భావాలను నింపుతున్నది. ఇవన్నీ ఒకెత్తు అయితే… తాజాగా దేశంలోని గ్రంథాలయాలను తన గుప్పిట్లోకి తెచ్చుకొనేందుకు పథకాలు రచిస్తోంది. గ్రంథాలయాల పనితీరులో జోక్యం చేసుకొని, సంఫ్‌ు పరివార్ భావజాలాన్ని వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకుంది. ఇదే జరిగితే… ఇప్పటివరకూ విజ్ఞానాలయాలుగా ఉన్న గ్రంథాలయాలు… అజ్ఞాన సమాచారంతో నిండిపోతాయి.
గ్రంథాలయాలు కేవలం పుస్తక నిక్షేపాలు కాదు… అవి సమాచార వనరులు. జ్ఞాన సముపార్జన కేంద్రాలు. నూతన భావాల ఉత్పాదనకు, నూతన విజ్ఞాన సృష్టికి నిలయాలు. ‘ప్రజల చైతన్యంలో మనం నాటిన విత్తనాలు మొలకెెత్తకుండా ఎల్లకాలం ఉండబోవు. సామాజిక క్రమాన్ని శత్రువులు నేరాలతోను, బల ప్రయోగంతోను అణచివేయలేరు. చరిత్ర మనది. ప్రజలే చరిత్ర నిర్మాతలు’ అంటాడు సాల్వెడర్ అలెండీ. ఈ విజ్ఞాన దివిటీలు ఆరిపోకుండా భవిష్యత్తరాలకు వెలుగులివ్వాలంటే… గ్రంథాల యాలను మనువాదుల బారి నుంచి రక్షించుకోవాలి. అలాగే, వసతులు కొరవడి… దీనావస్థలో కునారిల్లుతున్న గ్రంథాలయా లను పునరుజ్జీవింప జేయడానికి మరో గ్రంథాలయోద్యమం రావాలి.