మిత్రునికి విమానాశ్రయాలు – పేదలకు గ్యాస్‌ బండ

ప్రశ్న: ప్రధాని మోడీ,హౌం మంత్రి అమిత్‌ షాలు పోయినంత మాత్రాన సంక్షోభం సమసిపోదని మీ రచనలో పేర్కొన్నారు. మీరెందుకలా అంటున్నారు?
జవాబు: అనేక రాజకీయ,పౌర సమాజ వేదికలు, ఉద్భవిస్తున్న సవాళ్ళను స్వీకరించడంలో విఫలం చెందాయి. నేటికి కూడా సంక్షోభం అనగానే, ఏం సంక్షోభం? రాష్ట్రపతి, ప్రజాస్వామ్యం, పార్లమెంట్‌ లున్నాయి, రాష్ట్రప్రభుత్వాలు పని చేస్తున్నాయని అనేక మంది ప్రజలనుకుంటున్నారు. నేనో విషయాన్ని చెప్తాను. సైన్యం హింసతో ప్రజాస్వామ్యం చచ్చిపోయే రోజులు పోయాయి. నేడు ఇది నెమ్మదిగా సంభవించే మరణం. సంస్థలు నెమ్మదిగా కనుమరుగవుతున్నాయని, లేదా పరిమితం చేయబడుతున్నాయనే విషయాన్ని ఆఖరికి సంస్థల నిర్వాహకులు కూడా గుర్తించలేక పోతున్నారు. ఇది పైకి కనిపించకుండా నెమ్మదిగా జరుగుతుంది, కానీ దాని ప్రభావం మాత్రం వాస్తవరూపంలో ఉంటుంది. ఇదే, సంక్షోభం. లౌకికవాదం దారుణంగా దెబ్బతిన్న పరిస్థితుల్లో ఉంది. మన ఆర్థిక వ్యవస్థ మందకొడిగా నడుస్తుంది. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఇంకేమాత్రం ఫెడరల్‌ స్ఫూర్తికి అనుగుణంగా ఉండవు. మన సామాజిక నిర్మాణం అస్తవ్యస్తంగా ఉంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఉదారవాదం, బహుళత్వం, వైవిధ్యం లాంటి గణతంత్ర సూత్రాలకు మనం చాలా దూరం జరిగాము.
ఎలాంటి అర్థవంతమైన చర్చల్లేకుండానే బిల్లుల్ని ప్రవేశపెట్టి, ఆమోదిస్తున్నారు. బహుశా వ్యవసాయ చట్టాల్ని పది నిమిషాల్లో ఆమోదించారనుకుంటాను. పంజాబ్‌ ఎన్నికలకు ముందు ఆ చట్టాల్ని ఉపసంహరించు కున్నారు. వాటిని ఎందుకు ప్రవేశపెట్టారు, ఎందుకు ఉపసంహరించుకున్నారనే అంశాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన గానీ, చర్చ గానీ లేదు.
సామాజిక రంగంలో, కేవలం రహస్య కనుసైగలు మాత్రమే కాక, నరమేధం, ఆర్థిక వెలివేత, మూక దాడులు, హత్యల్ని ప్రేరేపించే బహిరంగ పిలుపులు కూడా ఉంటున్నాయి. మణిపూర్‌ను, ఆర్థిక వ్యవస్థను చూడండి. గడచిన ఆరేడు సంవత్సరాల్లో దాదాపు 100 లక్షల కోట్ల రూపాయల అప్పులయ్యాయి. యువత నిరుద్యోగం 23శాతంగా ఉంది. మనం లెబనాన్‌, సూడాన్‌ సరసన చేరాం. మొత్తంగా మానవ వనరుల ప్రయోజనాలు నిర్వీర్యమవుతున్నాయి.
ప్రశ్న: లాభార్థీ పథకాల గురించి మాట్లాడిన ‘ద న్యూ బీజేపీ’ రచయిత నళిన్‌ మెహతా వలె మీరు కూడా కొత్త బీజేపీ అని అంటున్నారు…
జవాబు: ముందుగా నేను ‘లాభార్థీ’ పై చిన్న వ్యాఖ్య చేస్తాను. ”పేద ప్రజల్ని కొంచెం సంతోషపెట్టడానికి నేను మూడు సిలిండర్లు, ఐదు కిలోల గోధుమలు లేదా బియ్యం ఇస్తాను”. కానీ ప్రభుత్వం పేదలకు మూడు సిలిండర్లు, ఒక మిత్రునికి మూడు విమానాశ్రయాలు, వేరొకరికి ఐదు ఓడరేవులను ఇస్తుంది. జనాభాలో దాదాపు 84శాతం మంది ప్రజలు నిజ ఆదాయాలు, కొనుగోలు శక్తిలో క్షీణతను చూస్తుంటే, దేశంలో బిలియనీర్ల సంఖ్య 125 నుండి 145కు పెరిగింది. ”మన దేశంలో 145మంది బిలియనీర్లు ఉండడం మీకు గర్వకారణం కాదా” అని మన పాలకులు అనగలరు. ఆదాయాలు కుంచించుకు పోయిన ప్రజలు, మన దేశ జనాభాలో 84శాతం మంది ఉండడం ఇక్కడ మనం గమనించాలి కానీ, మన దేశానికి 145మంది బిలియనీర్లు ఉన్నారనేది ముఖ్యమైన విషయం కాదు. ఆర్థిక వ్యవస్థ పనితీరు ఆధారంగా ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్ళడం లేదు కాబట్టి అది ఏ మాత్రం ఆందోళన చెందడం లేదు. ఆర్థిక వ్యవస్థ విషయానికి వచ్చేసరికి మన ప్రభుత్వం అస్థిరంగాను, అసమర్థం గానూ వ్యవహరిస్తుంది. కానీ, ”నేను మందిరాన్ని నిర్మిస్తున్నాను, నేను ఆర్టికల్‌ 370ని రద్దు చేశాను, నేను వారికో గుణపాఠం నేర్పాను, వీరికొక గుణపాఠం నేర్పుతాను” అనే కథనాల్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల చెవుల్లో గుసగుసలాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ, లేదా సాంఘిక సంక్షేమాల పనితీరుకు వారిని వారు జవాబుదారులుగా మార్చుకోవడం లేదు.
ప్రశ్న:కొత్త బీజేపీ గురించి మాట్లాడుతూ… ఈ తొమ్మిదేండ్లలో ”ప్రధాన్‌ సేవక్‌” అనే పదబంధం స్థానంలోకి ”విశ్వగురు” అనే పదబంధం ఎలా వచ్చిందో ప్రస్తావించారు. ఇది దేనిని సూచిస్తుంది?
జవాబు: మీరొకసారి 2014కు తిరిగి వెళితే, అభివృద్ధి(వికాస్‌), అవినీతిపై వ్యతిరేకత, ఉద్యోగాల కల్పన, నల్లధనాన్ని వెనక్కి తేవడం అనేవి బీజేపీకి ప్రధాన అంశాలుగా ఉండేవి.ఎన్నికల ప్రచార సమయంలో నాటి ప్రధానమంత్రి అభ్యర్థి ప్రచార ఉపన్యాసాల్లో పోటీ అనేది హిందువులు, ముస్లింల మధ్య కాదు, పోటీ ఒకవైపున హిందువులు ముస్లింల మధ్యన, మరోవైపున హిందువులు, అవినీతి, నిరుద్యోగం మధ్యనేనని అన్నాడు.
2016 తరువాత ప్రసంగం తీరు పూర్తిగా మారింది. ఆయన (మోడీ), టీం ఇండియా గురించి ”ప్రధాన్‌ సేవక్‌” గురించి మాట్లాడేవారు. ప్రధానమంత్రులందరూ అందించిన సహాయ సహకారాలను గుర్తుచేసేవాడు. కానీ నేడు, టీం ఇండియా అంటే కేవలం ప్రధానమంత్రి మాత్రమే. ఇది స్పష్టమైన ఆలోచనతో వేసుకున్న ప్రణాళిక ప్రకారం జరుగుతున్నట్లు కనపడుతుంది. వారు ఈ రకమైన ప్రసంగాలతో వస్తారు. తమను తాము అంగీకారం అయ్యేటట్లు చేస్తారు, అధికారం సాధిస్తారు, ఆ తరువాత అక్కడున్న అసలు విషయానికి తెరతీస్తారు.
ప్రశ్న: నేటి మన దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడేటప్పుడు, మనం అటల్‌ బిహారీ వాజపేయి హయాంలోని ఉదారవాద విషపూరితాన్ని క్షమిస్తున్నామా లేక తక్కువ అంచనా వేస్తున్నామా?
జవాబు: ఇది చాలా సంక్లిష్టమైనది. రాజకీయ చర్చలో సంభవించిన ఒక నాటకీయ మార్పును మీకు చెప్తాను. ఎంతోకాలం కాదుగానీ, పదిహేను సంవత్సరాల క్రితం, బీజేపీతో సహా ప్రతీ ఒక్కరూ మేము లౌకికవాదులమని అనేవారు. ”మేము కూడా లౌకికవాదులమే, కానీ మేము ఇతర పార్టీల వారివలె కుహనా లౌకికవాదులం కాదు, మేము స్వచ్చమైన లౌకికవాదులం. మేము ఎవర్నీ ప్రసన్నం చేసుకోం. ప్రతీఒక్కరినీ సమానంగా చూస్తాం” అని అనేవారు. రాజకీయ చర్చల కేంద్రం లౌకికవాదంగా మిగిలింది. కానీ ఈనాడు అలాంటి పరిస్థితి లేదు.
”నేను కూడా హిందువునే, కానీ వారి లాంటి హిందువును కాదు” అని నేడు ప్రతీ రాజకీయ పార్టీ, ప్రతీ రాజకీయ నాయకుడు అంటున్నారు. ఇలాంటి మాటలు చెప్పేందుకు ప్రతీ ఒక్కరినీ ఒత్తిడి చేసేంత దూరం ప్రయాణించింది ఈ రాజకీయ చర్చ. ఒక్కరిద్దరు నాయకుల వలన ఇంత పెద్ద మార్పు సంభవించలేదు కానీ, సంఫ్‌ు పరివార్‌ దశాబ్దాల కాలం పాటు సాగించిన కృషి ఫలితంగానే ఈ మార్పు జరిగింది. ఓసారి గుర్తుచేసుకుంటే1989లో ఎన్నికల ప్రచారం అయోధ్య నుండే ప్రారంభించాలని రాజీవ్‌ గాంధీని ఒత్తిడి చేశారు. అక్కడి నుండి ఇంక వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పుడు విషం నెమ్మదిగా చాలా లోతుకు వ్యాపించింది. ఎంతగా అంటే, ఓ విద్యావేత్త కూడా మహాత్మాగాంధీకి వ్యతిరేకంగా బహిరంగంగా పేరుపెట్టి విమర్శించ గలడు. ఒక దశాబ్దం క్రితం ఇలా జరుగుతుందని ఊహించగలరా? హరిద్వార్‌లో లేదా ఇంకెక్కడైనా ఆర్థిక వెలివేత, జాతి ప్రక్షాళన, నరమేధానికి, నేడు ధర్మ సంసద్‌ పిలుపిస్తే, దానికి ప్రభుత్వంతో పాటు ఇలాంటి పిలుపులకు వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లడని మంత్రులు, ప్రధానమంత్రి కూడా బాధ్యత వహించాలి. మూక దాడులు, మణిపూర్‌, రెజ్లర్ల నిరసనలకు ప్రభుత్వంలో ఏ ఒక్కరూ సంఘీభావాన్ని వ్యక్తం చేయలేదు.
ప్రశ్న: ప్రభుత్వానికి అతిపెద్ద సవాళ్ళలో మహమ్మారి ఒకటి. ఇది అనేక పరస్పర విరుద్ధ ఆదేశాలు, సమస్యలు, మరణాలకు దారి తీసింది. ప్రభుత్వ అసమర్థతా? లేక రాజకీయ సంకల్పం లేకపోవడమా?
జవాబు: ప్రభుత్వ అసమర్ధత.మహమ్మారి సష్టించిన పెనుప్రమాదాన్ని ప్రభుత్వం అంచనా వేయలేక పోయింది. నా రచనలో ”ప్యాండెమిక్‌ లాగ్‌ బుక్‌” అనే పేరుతో ఒక అధ్యాయం ఉంది. మహమ్మారి అప్పటికే విజృంభించి, ప్రజలకు సోకుతుంది. కానీ ప్రభుత్వం దేశీయంగా వ్యాక్సిన్‌ తయారీదారులకు డబ్బు ఇవ్వడం లేదు. సుదీర్ఘ జాప్యం గురించి విదేశీ కంపెనీలతో చర్చలు జరపదు. తరువాత ఆక్సీజన్‌, పడకలు, వ్యాక్సిన్ల సరఫరా, డిమాండ్‌ మధ్య ఉన్న అంతరం గురించి కూడా ప్రభుత్వానికి తెలియదు. లాక్‌డౌన్‌ కాలంలో మేము మౌలిక సదుపాయాలను పెంచే చర్యల్ని తీసుకోలేదు.ఆర్థికంగా నష్టపోయాం. 27శాతం వృద్ధిరేటును సాధించాం.
లాక్‌డౌన్‌ సమయంలో వేల మంది ప్రజలు నడిచారు. ఏ నాగరిక సమాజమైనా ఇలాంటి విషయాన్ని అంగీకరించగలదా? అనేక మంది రోడ్ల పైన, రైలు పట్టాల మీద చనిపోయారు, శవాలు గంగా నదిలో తేలాయి. ఇది ఆనాటి పరిస్థితి. కానీ ప్రజల్ని ఆవహించిన ఒక రకమైన భావజాలం కారణంగా దేశంలో సాధారణంగానే స్తబ్దత ఏర్పడింది. మనమూ స్తబ్దంగా తయారయ్యాం.
సాధారణ రూపాన్ని అసాధారణమైనదిగా, అసాధారణ రూపాన్ని సాధారణమైనదిగా మార్చే కళను ఈ ప్రభుత్వం బాగా మెరుగు పర్చుకుంది. వ్యాక్సిన్‌లు వేయడం అనేది ప్రభుత్వాలకు సాధారణ విషయం. ఇది కొత్తేమీ కాదు. పోలియో వ్యాక్సిన్‌, ఇతర అనేక వ్యాక్సిన్‌లను ప్రభుత్వం ఉచితంగానే ఇస్తుంది. ఇప్పుడు వ్యాక్సిన్‌ల ధరల్లో తేడాలున్నాయి. ఇది, వివరణకు అవకాశం లేనిది. కానీ దీన్ని హేతుబద్ధమైనదిగా చూపుతూ, వ్యాక్సిన్లు ఇవ్వడాన్ని గొప్ప విషయంగా చెప్పుకున్నారు.
జీ20 నాయకత్వం ప్రతి సంవత్సరం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్తుంది. అంతర్జాతీయ సమాజం ప్రజాస్వామ్య మాతకు ఈ గౌరవాన్ని ప్రదానం చేసిన విషయాన్ని మనం విశ్వసించాలని ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. నీవు ప్రజాస్వామ్యానికి తల్లివి అయినప్పటికీ జీ20 అధ్యక్ష పదవి వచ్చే సంవత్సరానికి వేరే దేశానికి పోతుంది. కాబట్టి ఒక సాధారణ విషయం అసాధారణమైన విషయంగా కనిపించేట్లు చేస్తున్నారు. అల్లర్లు, మూకదాడులు సాధారణ విషయాలయ్యాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, గ్రామీణ బాధలు, భారీగా చేస్తున్న రుణాలు సాధారణమైనవిగా మారాయి.
ప్రశ్న: చివరగా, ఏమైనా ఆశ ఉందా? మీరు కాంగ్రెస్‌ గురించి చాలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలు కలిసి ఆశనేమైనా చిగురింపచేస్తాయా? లేక ఆ బాధ్యత ప్రజలపై ఉందా?
జవాబు: ఆశ ఉంది. నేను ఈ మాట చెప్పడానికి కారణం ఏమంటే, బీజేపీ ఓ మహాశక్తిగా కనిపిస్తున్నప్పటికీ, దానికి కేవలం 38శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయి. అది కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. అది ఓడిపోతుందని అనుకుంటున్నాను. కానీ ఓటమి అనివార్యం కాదు. అలాగని విజయం కూడా అనివార్యమేమీ కాదు. చరిత్రలో ఏదీ అనివార్యమని నేను విశ్వసించను. పౌరసమాజం, రాజకీయ వేదికలు దాని కోసం కృషి చేస్తూ, సవాల్‌ తీవ్రతను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
కచ్చితమైన ఆశ ఉంది, కానీ ఆత్మసంతృప్తికి వ్యతిరేకంగా ప్రజల్ని హెచ్చరించాలనుకుంటున్నాను. ఒకవేళ 2024లో బీజేపీ అధికారం కోల్పోయినప్పటికీ, లోతుగా పాతుకుపోయిన ముప్పు మాత్రం విడిచిపోదు. భారత రాజకీయాల్లోకి ప్రవేశించిన విషం పూర్తిగా తీసివేయడానికి దశాబ్దం లేదా అంతకన్నా ఎక్కువ సమయం పట్టవచ్చు.
(”ఫ్రంట్‌ లైన్‌” సౌజన్యంతో )
– అనువాదం:బోడపట్ల రవీందర్‌,9848412451

 

 

Spread the love