పోలింగ్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది : సీఈవో వికాస్‌రాజ్‌

నవతెలంగాణ హైదరాబాద్: పోలింగ్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. పోలింగ్‌ శాతం బాగానే నమోదైందని… 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్‌ జరుగుతుందని ఆయన చెప్పారు. గంటగంటకు పోలింగ్ శాతం పెరుగుతుందని తెలిపారు. 1400 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు ఇంకా క్యూలో ఉన్నారన్నారు. తుది ఓటింగ్‌ శాతం ఎంత అనేది మే14 వ తేదీ మంగళవారం వెల్లడిస్తామని వికాస్‌రాజ్‌ అన్నారు.
38 కేసులు నమోదు
  రాష్ట్రంలో వివిధ కారణాలపై 38 కేసులు నమోదు చేశామని వికాస్‌రాజ్‌ తెలిపారు. జీపీఎస్‌ ఉన్న వాహనాల్లో ఈవీఎంలు తరలిస్తామని. కొన్ని చోట్ల ఈ ప్రక్రియ అర్ధరాత్రి ఒంటిగంట వరకు సాగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ఇబ్బందులు కలగలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు, కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ పూర్తి అయింది. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణలో 61.16శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపారు.

Spread the love