చంద్రబాబును అరెస్ట్ చేయం

నవతెలంగాణ హైదరాబాద్: ఫైబర్‌ నెట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఈ నెల 30కి సుప్రీంకోర్టు (Supreme Court)  వాయిదా వేసింది. ఈమేరకు జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఫైబర్‌నెట్‌ కేసులో ఈనెల 30 వరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని ఆదేశించింది. ఏపీ సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. సెక్షన్‌ 17ఏ నిబంధన ఈ కేసులోనూ ఉన్నందున స్కిల్‌ కేసు తీర్పు వచ్చాక విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కేసు ముగిసేవరకూ అరెస్ట్‌ చేయబోమన్న నిబంధన కొనసాగించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. గత హామీ మేరకే ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలిపారు. కేసు విచారణను ఈనెల 23కి వాయిదా వేయాలని తొలుత ధర్మాసనం నిర్ణయించింది. అయితే సిద్ధార్థ లూథ్రా విజ్ఞప్తి మేరకు విచారణను సుప్రీంకోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.

Spread the love