– కార్పొరేట్ ప్రయోజనాల కోసమే…
– జీవనభృతి కోల్పోనున్న అడవి బిడ్డలు
న్యూఢిల్లీ : అధికారం చేపట్టినప్పటి నుండీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా కార్పొరేట్ శక్తులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనం కలిగించేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం అటవీ సంరక్షణ చట్టాన్ని సవరిస్తోంది. అటవీ భూములలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, కార్పొరేట్ సంస్థలు లాభాలు దండుకునేందుకు సాయపడబోతోంది. అంటే ఇప్పటి వరకూ ప్రభుత్వ రక్షణలో ఉన్న అటవీ భూములు ఇకపై కార్పొరేట్, రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఫలితంగా ఇప్పటి వరకూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్న అటవీ భూములు కనుమరుగవుతాయి.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
అటవీ ప్రాంతంలోని ప్రతి అంగుళం భూమినీ కాపాడాల్సిందేనంటూ 1996లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ భూమి ఎవరి చేతిలో ఉన్నా లేదా ప్రభుత్వ రికార్డులలో అటవీ ప్రాంతంగా నమోదైనా కాకపోయినా సరే దానిని పరిరక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. వాస్తవానికి అటవీ ప్రాంతానికి సంబంధించి ప్రభుత్వం వద్ద రికార్డులు అసంపూర్తిగా ఉన్నాయి. అడవులకు ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనం అస్పష్టంగా ఉంది. పైగా అది అన్ని రాష్ట్రాలలో ఒకేలా లేదు. అటవీ ప్రాంతాన్ని గుర్తిం చేందుకు ప్రతి రాష్ట్రంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, వాటికి అధికారిక గుర్తింపు ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.
చర్యలు శూన్యం
సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసి 18 సంవత్సరాలు గడచినప్పటికీ 2014 వరకూ హర్యానా, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు అటవీ భూములను గుర్తించేందుకు, వాటిని అధికారిక రికార్డులలో చేర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది కేంద్ర ప్రభుత్వానికి వరంగా పరిణమించింది. ప్రభుత్వ రికార్డులలో లేని అటవీ భూములకు రక్షణను తొలగించి, వాటిని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది.
వాటిలో భాగంగానే అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు చేస్తోంది. ప్రభుత్వ చర్య సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తోందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అడవులను సంరక్షించేందుకు వీలుగా వెంటనే కోర్టు ఆదేశాలను పాటించాలని రాష్ట్రాలకు చెప్పాల్సింది పోయి తానే న్యాయస్థానం ఆదేశాలను తుంగలో తొక్కేందుకు సిద్ధపడింది.
అడవిని నమ్ముకున్న
వారు ఏం కావాలి?
అడవులను వాణిజ్య అవసరాల కోసం దోపిడీ చేస్తే పర్యావరణానికి హాని జరగడంతో పాటు అడవుల పైనే ఆధారపడి జీవిస్తున్న ప్రజల మనుగడ ఏమవుతుందోనన్న భయాందోళనలు కలగడం సహజం. అటవీ ప్రాంతంలో నివసించే వారు తమ జీవన భృతి కోసం చిన్న చిన్న అటవీ వస్తువులను సేకరించి విక్రయిస్తుంటారు. అడవులను నాశనం చేసి, వాటిని వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తే అ అడవి బిడ్డల బతుకులు ఏం కావాలి? వారికి ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ ప్రత్యామ్నాయ జీవన వనరులను కల్పించలేదు. అందుకే దళితులు, ఆదివాసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక సంఘాలు మోడీ ప్రభుత్వ చర్యలను నిరసిస్తున్నాయి. అయినప్పటికీ కేంద్రం మాత్రం మొండిగా చట్ట సవరణకు పూనుకుంది.
మంత్రివర్యుల వితండవాదం
అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు చేయడాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సమర్ధించుకున్నారు. ప్రైవేటు వ్యక్తులు మొక్కలు నాటే ప్రాంతాన్ని కూడా అడవులుగా నమోదు చేసే అవకాశం ఉన్నదని, దీనివల్ల వారు ఆ భూమిని వేరే అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉండదని, ఫలితంగా ప్రైవేటు వ్యక్తులు మొక్కలు నాటేందుకు ముందుకు రారని, అప్పుడు పచ్చదనాన్ని ఎలా పెంచగలమని ఆయన వితండవాదం చేశారు. ప్రైవేటు వ్యక్తులలో భయాన్ని పారద్రోలి, వారు మొక్కల పెంపకం చేపట్టేలా ప్రోత్సహించడానికే చట్టాన్ని సవరిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే మంత్రి గారి వాదనలో పస లేదని అర్థమవుతోంది. ప్రైవేటు వ్యక్తులు మొక్కల పెంపకాన్ని ఆపేస్తారన్న ఆయన అనుమానాలకు ఆధారాలేవీ లేవు. పైగా అడవులకు, మొక్కల పెంపకానికి సంబంధించిన నిర్వచనాల మధ్య చాలా తేడా ఉంది.
వివరాలేవి?
వాస్తవానికి ప్రభుత్వ ఉద్దేశమేమంటే అటవీ ప్రాంత పరిరక్షణకు స్వస్తి చెప్పి, సువిశాలమైన అటవీ ప్రాంతాన్ని వాణిజ్య అవసరాల కోసం అనుమతిం చడం. అడవులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే పర్యావరణానికి ఎనలేని నష్టం చేకూరుతుంది. అధికారిక రికార్డుల ప్రకారం దేశంలో ఎంత అటవీ భూమి ఉన్నదో ప్రభుత్వం బయటపెట్టడం లేదు. ఆ వివరాలే తెలియనప్పుడు అందులో ఎంత భూమిని వాణిజ్య అవసరాలకు కట్టబెడతారో చెప్పడం కష్టం. అయితే అది గణనీయంగానే ఉండవచ్చునని మాత్రం ఘంటాపథంగా చెప్పవచ్చు. ఉదాహరణకు హర్యానాలోని ఆరావళి పర్వత శ్రేణి అడవుల రికార్డులో చేరలేదు. దీంతో ఆ ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించడం తేలికవుతుంది. పైగా ఆ ప్రాంతం రాజధానికి సమీపంలో ఉంది. వాణిజ్య ప్రాజెక్టులకు ఆకర్షణీయమైన ప్రదేశంగా
మారుతుంది.