Wednesday, April 15, 2026
E-PAPER
Homeఆటలుచెన్నై చమక్‌

చెన్నై చమక్‌

- Advertisement -

నైట్‌రైడర్స్‌పై 32 పరుగులతో సూపర్‌కింగ్స్‌ విక్టరీ
రాణించిన శాంసన్‌, బ్రెవిస్‌, నూర్‌ అహ్మద్‌
చెన్నై 192/5, కోల్‌కతా 160/7


హ్యాట్రిక్‌ ఓటములతో సీజన్‌ను మొదలెట్టిన చెన్నై సూపర్‌కింగ్స్‌.. సొంతగడ్డపై వరుస విజయాలతో విక్టరీ ట్రాక్‌లో పడింది. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు సమిష్టిగా రాణించటంతో సూపర్‌కింగ్స్‌ సీజన్లో రెండో విజయం సాధించింది. సంజు శాంసన్‌ (48), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (41), ఆయుశ్‌ మాత్రె (38) రాణించగా సూపర్‌కింగ్స్‌ తొలుత 192/5 పరుగులు చేసింది. స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ (3/21) సహా పేసర్లు మెరువగా ఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చతికిల పడింది. 32 పరుగుల తేడాతో సూపర్‌కింగ్స్‌ ఘన విజయం సాధించింది. నైట్‌రైడర్స్‌ సీజన్లో ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించలేదు.
నవతెలంగాణ-చెన్నై

చెన్నై సూపర్‌కింగ్స్‌ చెపాక్‌లో చెలరేగింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్‌ సంజు శాంసన్‌ (48, 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (41, 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుశ్‌ మాత్రె (38, 17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) సమిష్టిగా రాణించారు. ముగ్గురు బ్యాటర్లు మెరువగా తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చతికిల పడింది. ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ (0), రింకు సింగ్‌ (6), కామెరూన్‌ గ్రీన్‌ (0) నిరాశపరిచారు. సునీల్‌ నరైన్‌ (24, 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజింక్య రహానె (28, 22 బంతుల్లో 2 సిక్స్‌లు), రఘువంశీ (27, 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) అంచనాలను అందుకోలేదు. 20 ఓవర్లలో 7 వికెట్లకు నైట్‌రైడర్స్‌ 160 పరుగులే చేసింది. 3 వికెట్లతో మాయ చేసిన నూర్‌ అహ్మద్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

ఛేదనలో చతికిల
193 పరుగుల లక్ష్యం కోల్‌కతాకు కష్టమైంది. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను మలుపుతిప్పిన సూపర్‌కింగ్స్‌ పట్టు బిగించింది. ప్రమాదకర ఫిన్‌ అలెన్‌ (0) వికెట్‌తో అన్షుల్‌ వికెట్ల వేట మొదలెట్టగా.. సునీల్‌ నరైన్‌ (24) వికెట్‌తో ఖలీల్‌ అహ్మద్‌ కోల్‌కతాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. 6 ఓవర్లలో 36 పరుగులు చేసిన కోల్‌కతా ఓపెనర్లను కోల్పోయింది. నరైన్‌ రెండు ఫోర్లు, సిక్సర్లతో ఎదురుదాడి చేయగా.. అతడి నిష్క్రమణ తర్వాత ఎవరూ ఆ సాహసం చేయలేదు. అజింక్య రహానె (28), రఘువంశీ (27) వికెట్ల పతనం అడ్డుకున్నా.. మ్యాచ్‌లో గెలుపు ఆశలు సైతం ఆవిరి చేశారు. రింకు సింగ్‌ (6), కామెరూన్‌ గ్రీన్‌ (0) మరోసారి నిరాశపరిచారు. ఆఖర్లో రోవ్‌మాన్‌ పావెల్‌ (31 నాటౌట్‌, 22 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), రమణ్‌దీప్‌ సింగ్‌ (35, 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) కోల్‌కతా గెలుపు అంతరాన్ని కుదించారు. మిడిల్‌ ఓవర్లలో సూపర్‌కింగ్స్‌ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ 3 వికెట్లు పడగొట్టి మాయాజాలం చేశాడు. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగని కోల్‌కతా 20 ఓవర్లలో 160 పరుగులకే పరిమితమైంది. సీజన్లో ఐదు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా 4 ఓటములు చవిచూసింది. ఓ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దుగా ముగిసింది.

ఆ ముగ్గురు మెరువగా
తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌కింగ్స్‌కు పవర్‌ప్లేలో ధనాధన్‌ ఆరంభం దక్కినా, ఆశించిన ముగింపు లభించలేదు. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (7) మరోసారి విఫలం అయ్యాడు. సంజు శాంసన్‌ (48), ఆయుశ్‌ మాత్రె (38) పవర్‌ప్లేలో దంచికొట్టారు. 6 ఓవర్లలో 72 పరుగులు చేసిన సూపర్‌కింగ్స్‌ భారీ స్కోరుకు గట్టి పునాది వేసుకుంది. ఆయుశ్‌ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో కదం తొక్కగా.. సంజు శాంసన్‌ మూడు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో మెరిశాడు. పవర్‌ప్లే ఆఖరు బంతికి ఆయుశ్‌, అర్థ సెంచరీ ముంగిట శాంసన్‌ నిష్క్రమించారు. మిడిల్‌ ఓవర్లలో డెవాల్డ్‌ బ్రెవిస్‌ (41) సూపర్‌కింగ్స్‌ను ముందుకు నడిపించాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ (23) జతగా కీలక భాగస్వామ్యం నిర్మించాడు. డెత్‌ ఓవర్లలో బ్రెవిస్‌, సర్ఫరాజ్‌ అవుటవగా.. ఆఖర్లో ఆశించిన పరుగులు రాలేదు. శివం దూబె (13 నాటౌట్‌), జెమీ ఓవర్టన్‌ (7 నాటౌట్‌) జోడీ 18 బంతుల్లో 20 పరుగులే చేసింది. దీంతో సూపర్‌కింగ్స్‌ 192 పరుగులే చేసింది. కోల్‌కతా బౌలర్లలో కార్తీక్‌ త్యాగి (2/35), సునీల్‌ నరైన్‌ (1/21) రాణించారు.

సంక్షిప్త స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌కింగ్స్‌ : 192/5 (సంజు శాంసన్‌ 48, డెవాల్డ్‌ బ్రెవిస్‌ 41, ఆయుశ్‌ 38, కార్తీక్‌ త్యాగి 2/35, సునీల్‌ నరైన్‌ 1/21)
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ : 160/7 (రమణ్‌దీప్‌ సింగ్‌ 35, రోవ్‌మాన్‌ పావెల్‌ 31, నూర్‌ అహ్మద్‌ 3/21, అన్షుల్‌ కాంబోజ్‌ 3/32)

గాడిలో పడినట్టేనా?!
ఐపీఎల్‌ చరిత్రలో విజయవంతమైన జట్టు చెన్నై సూపర్‌కింగ్స్‌. ప్లే ఆఫ్స్‌, ఫైనల్స్‌ సహా టైటిల్స్‌లోనూ సూపర్‌కింగ్స్‌దే రికార్డు. అయినా, గత రెండేండ్లలో వరుసగా రెండు విజయాలు సాధించటం ఇదే ప్రథమం. చివరగా ఏప్రిల్‌ 14, 2024న ఓ వరుసగా రెండో విజయం సాధించిన సూపర్‌కింగ్స్‌.. రెండేండ్లలో ఆ ఘనత సాధించటం ఇదే తొలిసారి. హ్యాట్రిక్‌ ఓటములతో సీజన్‌ను ఆరంభించిన సూపర్‌కింగ్స్‌ సొంతగడ్డపై మెప్పించింది. బ్యాటింగ్‌ లైనప్‌లో సంజు శాంసన్‌, ఆయుశ్‌ మాత్రె, డెవాల్డ్‌ బ్రెవిస్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ బాధ్యత తీసుకోవటం కలిసొచ్చింది. పవర్‌ప్లే తర్వాత చెపాక్‌లో పరుగుల వేట అంత సులభం కాదు. అయినా, బ్రెవిస్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ మంచి ప్రదర్శన కనబరిచారు. బంతితో పేసర్లు పవర్‌ప్లేలోనే కోల్‌కతాను కోలుకోలేని దెబ్బకొట్టారు. 6 ఓవర్లలో ఆ జట్టు 36/2తో నిలిచింది. మిడిల్‌ ఓవర్లలో స్పిన్నర్లు మాయ చేశారు. నూర్‌ అహ్మద్‌, అకీల్‌ హుస్సేన్‌లు 8 ఓవర్లలో 47 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్ల దెబ్బకు మిడిల్‌ ఆర్డర్‌ సైతం కుప్పకూలింది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అటు పవర్‌ప్లే, ఇటు మిడిల్‌ ఓవర్లలో సూపర్‌కింగ్స్‌ ముందు తేలిపోయింది. సీజన్లో రెండో విక్టరీతో పాయింట్ల పట్టికలో ఎగబాకిన సూపర్‌కింగ్స్‌.. సమిష్టి ప్రదర్శనతో గాడిలో పడినట్టే అనిపిస్తోంది. రానున్న మ్యాచ్‌ల్లో అగ్ర జట్లతో తలపడినప్పుడు చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇదే జోరు చూపిస్తే ఇక సీజన్లో ఎదురుండదు!.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -