చిల్‌ విత్‌ నో ఫోన్‌

Chill with no phone– ఓ వారం ప్రయోగం చేద్దామా?
– అనేక సమస్యలకు పరిష్కారం : మానసిక వైద్య నిపుణులు
డిజిటల్‌ డిటాక్స్‌ సురక్షితంగా చేయాలి. ఎలక్రానిక్‌ గాడ్జెట్‌లపై ఆధారపడటం మానేయాలి. ఇది సవాలుతో కూడుకున్నదే. అయితే దశలవారీగా అమలుచేయవచ్చు. ఒక వారం పాటు డిజిటల్‌ డిటాక్స్‌పై వెళ్లడం వల్ల మీ చుట్టూ ఉన్న వారితో కొంత ప్రణాళిక వేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహౌద్యోగులు, మీరు డిజిటల్‌ డిటాక్స్‌పై వెళ్లాలని ఉద్దేశించిన వారంలో మిమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం ఉన్న ఎవరికైనా తెలియజేయండి. మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో వారికి వివరించండి.
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఓ వారం ఫోన్‌ లేకుండా బ్రతికేద్దామా? ఇంటర్నెట్‌కు దూరంగా ఉందామా? ఈ ప్రశ్నే విచిత్రంగా అనిపిస్తుంది కదూ! మానవ జీవితాలతో సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ అంతలా పెనవేసుకుపోయింది. ఓరోజు తిండి లేకున్నా ఫర్వాలేదు…ఫోన్‌ ఉంటే చాలు అనే స్థితికి మానవ సమాజం బలహీనపడిపోయింది. అసలు సెల్‌ఫోన్‌ లేని జీవితాన్ని ఊహిస్తేనే ‘అమ్మో…ఎలా? అనే ప్రశ్న మనల్ని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. కానీ ఇప్పుడు చరిత్ర తిరగరాయబడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ‘డిజిటల్‌ డిటాక్స్‌’ పేరుతో ఎలాంటి ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌ లేకుండా ఓ వారం బ్రతికేయడాన్ని సవాలు చేస్తున్నారు. సెల్‌ఫోన్‌ వ్యసనం నుంచి బయటపడాలనే కోరికతో ఇప్పుడు ఈ సవాల్‌ను స్వీకరించేవారు క్రమంగా పెరుగుతున్నారు. ఓ వారం పాటు నో ఫోన్‌, నో నోటిఫికేషన్స్‌, నో సోషల్‌ మీడియా అంటూ మనిషి…మనిషిగా బ్రతకడం ఎలాగో ‘మానవ పరిణామ క్రమం’ తరహాలో మళ్లీ చూపించాలనే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి.
జీవితంలో ఎన్నో సమస్యలతో మనం అవస్థలు పడుతుంటాం. అవి కుటుంబపరమైనవో, ఆర్థిక పరమైనవో కావొచ్చు. లేదా ఇతర కారణాలు మనల్ని వెంటాడుతుండొచ్చు.. బంధాలు, బంధుత్వాలకు దూరమవుతున్నాం. మనిషి జీవితంలో సింహభాగం సమయాన్ని సెల్‌ఫోన్‌ మింగేస్తుంది. దాన్ని వదిలించుకుంటే జీవితం ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సాహం యువతరంలో ఇప్పుడిప్పుడే ఉదయిస్తుంది. మరీ 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వారికి గతంలో ఇలాంటి ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లు లేవనే విషయం కూడా తెలీకుండా, నిత్యావసరాలతో మమేకం అయిపోయాయి. ఇప్పుడు సోషల్‌ మీడియాలో కూడా ‘మీ కాలంలో సెల్‌ఫోన్‌ లేదా తాతా…మరి అప్పట్లో మీరెలా బ్రతికారు? అనే ప్రశ్నలు వైరల్‌గా మారుతున్న విషయాన్ని గమనించేఉంటాం. అభివృద్ధి నమూనాలో సాంకేతికత అవసరమే. కానీ అది మనిషిని వ్యసనం స్థాయికి దిగజార్చితేనే ప్రమాదం. సెల్‌ఫోన్లలో ‘పబ్జీ’ గేమ్‌లు ఆడుతూ ప్రపంచవ్యాప్తంగా అనేకమంది యువతీ యువకులు ప్రాణాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ జాడ్యం భారతదేశానికి పాకి, అప్పట్లో ఆందోళన కలిగించింది. చివరకు కేంద్ర ప్రభుత్వం ఆ గేమ్‌ను నిషేధించింది. ‘మద్య పానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అనే ప్రకటనలు లిక్కర్‌ బాటిళ్లు, సిగరెట్‌ ప్యాకెట్ల మీద ఉన్నట్టే…సెల్‌ఫోన్‌ కూడా ఆరోగ్యానికి హానికరం అని ప్రకటించే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తుంది.
ఏమిటీ డిజిటల్‌ డిటాక్స్‌?
నిర్దిష్ట సమయం వరకు డిజిటల్‌ గాడ్జెట్‌లు, స్క్రీన్‌లు, ఇంటర్నెట్‌ ప్లాట్‌ఫారాలను ఉపయోగించకుండా ఉద్దేశపూర్వకంగా చేసే అభ్యాసమే డిజిటల్‌ డిటాక్స్‌. ఆఫ్‌లైన్‌ ప్రపంచంతో విశ్రాంతి తీసుకోవడానికి, రీసెట్‌ చేసుకోవడానికి, మళ్లీ ఉత్సాహంగా కనెక్ట్‌ చేయడానికి ఈ ప్రయోగాత్మక ప్రక్రియ ఉపయోగపడుతుందని గేట్‌వే ఆఫ్‌ హీలింగ్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌, సైకో థెరపిస్ట్‌ డాక్టర్‌ చాందినీ తుగ్నైట్‌ చెప్తున్నారు. సెల్‌ఫోన్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో మానసిక రుగ్మతలు గణనీయంగా పెరుగుతున్నాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. దీన్నుంచి బయటపడటం ఎలా అనేది ఇప్పుడున్న వేల కోట్ల డాలర్ల ప్రశ్న. భూతాపం పెరుగుతున్నదని సంవత్సరంలో ఎర్త్‌ అవర్‌ పేరుతో (ఏటా మార్చి నెల చివరి శనివారం) ఒక రోజులో ఒక్క గంట లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు సహా సమస్త విద్యుత్‌ పరికరాలను ఆఫ్‌ చేసేస్తున్నాం. ఈ ఏడాది మార్చి 23వ తేదీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎర్త్‌ అవర్‌ను పాటించాయి. ఇదే తరహాలో భవిష్యత్‌లో ప్రపంచవ్యాప్తంగా ‘నో సెల్‌ఫోన్‌’ అనే ప్రయోగం పుట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ‘డిజిటల్‌ డిటాక్స్‌’ను దానికి ఆరంభంగానే భావించాల్సి ఉంటుంది.
ఇవి పాటిద్దాం…
– సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌, ఇంటర్నెట్‌ను ప్రయోగాత్మకంగా పక్కన పెట్టి, మనకిష్టమైన ఆహారం, వ్యాయామం, సకాలంలో నిద్రపోదాం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.
– ఎలక్ట్రానిక్‌ ఇంటర్నెట్‌ గ్యాడ్జెట్‌లు మనుషుల్ని వ్యసనపరులను చేస్తుంది. దీనివల్ల రివార్డ్‌ హార్మోన్‌ డోపమైన్లు విడుదలవుతాయి. వీటివల్లే మనకు మంచి అనుభూతి కలిగినట్టు ఫీల్‌ అవుతాం. రివార్డ్‌ హార్మోన్‌ డోపమైన్‌ హిట్‌ని ఎక్కువగా కోరుకుంటుంది. సెల్‌ఫోన్‌ లేదా గాడ్జెట్లను స్క్రోల్‌ చేసేటప్పుడు మెదడు హానికరమైన డోపమైన్‌ విడుదలను ప్రేరేపిస్తుంది. డిజిటల్‌ డిటాక్స్‌తో మనం ఈ వ్యసనం ఉచ్చులో పడకుండా ఉంటాం.
– సాధారణంగా సోషల్‌ మీడియా మన శరీరం ఎలా ఉండాలి…ఎలాంటి ఉద్యోగం చేయాలి…అనే విషయాలను మన ప్రమేయం లేకుండానే మనల్లో ఆలోచనలు రేకెత్తిస్తాయి. డిజిటల్‌ డిటాక్స్‌తో ఈ లింకులు తెగిపోయి, మన స్వీయ ఇమేజ్‌ను పునరుద్ధరించుకోగలుగుతాం. మనల్ని మనం అంచనా వేసుకొని నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుంది.
– డిజిటల్‌ పరికరాలు నీలిరంగు కాంతిని విడుదల చేస్తాయి, ఇది శరీరం యొక్క సహజ నిద్ర-మేల్కొనే చక్రానికి అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల అనేక శారీరక, మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. డిజిటల్‌ డిటాక్స్‌తో టైంకి ప్రశాంతంగా కునుకుతీసే అవకాశం కలుగుతుంది.
– ఆఫ్‌లైన్‌ హాబీలు, యాక్టివిటీలను పునరుద్ధరించుకుంటాం. దీనితో జీవితంలో మరింత సమతుల్యత, సంతృప్తి కలుగుతాయి.
ఇవీ ప్రయోజనాలు…
డిజిటల్‌ డిటాక్స్‌ అనేక మార్గాల్లో ఉపయోగపడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాల్ని చూపిస్తుంది. దీనిపై ఢిల్లీలోని బీఎల్‌కే-మ్యాక్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన క్లినికల్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ దినిక ఆనంద్‌ మాట్లాడుతూ… ”డిజిటల్‌ డిటాక్స్‌తో చాలా ప్రయోజనాలుఉన్నాయి. వ్యక్తులు ఆన్‌లైన్‌లో ఎంత సమయం, శక్తిని వెచ్చిస్తున్నారనే దానిపై ఆధారపడి ఈ ప్రయోజనాలు ఉంటాయి. సదరు వ్యక్తులకు చాలా సమయాన్ని తిరిగి ఇచ్చేస్తుంది. ఇంటర్నెట్‌కు దూరంగా ఉండటం ప్రారంభంలో కొంత ఆందోళన, భయం కలిగించడం సహజం. కానీ ప్రయత్నపూర్వకంగా ఆస్వాదిస్తే, వ్యక్తిత్వ వికాసం పునరుత్తేజం కావడం తధ్యం” అని స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఢిల్లీకి చెందిన పీడీ హిందూజా ఆస్పత్రికి చెందిన మనస్తత్వవేత్త డాక్టర్‌ షీనా సూద్‌ మాట్లాడుతూ డిజిటల్‌ డిటాక్స్‌తో సంయమనం పాటించడం వల్ల భావోద్వేగాలు, మానసిక ఉల్లాసాలు కచ్చితంగా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.

Spread the love