చిందుకళా బృoదంలో ప్రత్యేక ఒరవడి

చిందుకళా బృoదంలో ప్రత్యేక ఒరవడిచిందు యక్షగానం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పురాతన కళారూపం. ఈ కళారూపం క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం నాటిది అని జానపద కళాకారులు విశ్వసిస్తారు. ఈ చిందు యక్షగానం విభిన్నమైనది. శాస్త్రీయ సాంప్రదాయ పద్ధతిలో జానపద నత్యంతో పురాణాలను ప్రదర్శించుటలో జానపద కళల్లో మేటిగా నిలిచింది చిందు యక్షగానం. ప్రజల కోసం ప్రజల చేత పోషింపబడిన ప్రజా కళా చిందు యక్షగానం.
అనేక సాంప్రదాయ కళారూపాలు అంతరించిపోతున్న ఈ కాలంలో, తనను తాను ఆధునీకరించుకుంటూ నిలబడింది. ”చాందినీ” కింద నాలుగైదు బ్యాక్‌ గ్రౌండ్‌ తెరలతో మద్దెల, తాళాలు, హార్మోనియం ఈ మూడు సంగీత వాయిద్యాలతో, ప్రత్యేక బానీలతో ఆట తాళం, ఆది తాళం, జుల్వతాళం, యాలలు తదితర రాగాలతో పల్లె ప్రజలను మంత్రముగ్ధులను చేసింది. సినిమా స్వర్ణ యుగ కాలాన్ని ఎదుర్కొని నిలిచింది. తెలంగాణలో నాటక రంగం అంటేనే చిందు యక్షగానం అని ఘన కీర్తి పొందింది.
జనగామ జిల్లాలో పాల్కురికి సోమనాథుడు, బొమ్మెర పోతన, సర్వాయి పాపన్న, వీరనారి అయిలమ్మ, దొడ్డి కొమురయ్య ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. చరిత్రకారులు పుట్టిన జనగామ జిల్లాలో పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో 1958లో గడ్డం రామస్వామి చండికాంబ దంపతులకు గడ్డం సమ్మయ్య జన్మించాడు. వల్మిడి గ్రామం నుండి దేవరుప్పుల మండలం అప్పిరెడ్డి పల్లెలో రామస్వామి వలస వచ్చి స్థిర పడటంతో, గడ్డం సమ్మయ్య స్వగ్రామం అప్పిరెడ్డిపల్లి అయింది. జీవితంలో ఎన్నెన్నో ఆటుపోట్లు వచ్చినా నిలబడి తన మాతకళ చిందు యక్షగానానికి జాతీయస్థాయి గుర్తింపు తీసుకువచ్చిన వారిలో అగ్రగణ్యునిగా నిలిచి, తాను పద్మశ్రీ పురస్కారం అందుకోవడంతో చిందు యక్షగానానికి జాతీయస్థాయిలో సముచిత స్థానం దక్కింది. స్వయం కషితో అకుంఠితమైన దీక్షతో తమ వంశపారంపర్యంగా వస్తున్న కళను కాపాడుకుంటూ, ఎంతోమంది నూతన కళాకారులను తయారు చేస్తూ, జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని అర్జించి, తెలంగాణకు గొప్ప పేరును తెచ్చిన ప్రతిభావంతుడు గడ్డం సమ్మయ్య.
1980వ దశకంలో చుక్కా సత్తయ్య ఒగ్గు కథలో రారాజుగా వెలుగొందుతున్న కాలంలో 1984-85 లో తెలుగు విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో జనగామలో ఒగ్గు కథ శిభిరాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జ్యోతిర్మయ లలిత కళా సమితి అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్న ఇంద్రసేనారెడ్డి, కన్న పరుశురాములు గార్ల సహకారంతో ఒగ్గు కథ శిక్షణ శిభిరంలో చిందు యక్షగానం ప్రదర్శించిన గడ్డం సమ్మయ్య, తన ప్రతిభను ప్రదర్శించి ప్రజల హర్షద్వానాలు అందుకోవడంతో, అప్పటి మంత్రులు సన్మానించి ప్రశంసించారు. అదే వేదికపై ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం చైర్మన్‌ తూమాటి దోనప్ప గారి ప్రశంసలూ అందుకున్నారు. (ఈ ఒగ్గుకథ శిభిరంలో ఈ వ్యాసకర్త కూడా ఉన్నాడు) ఈ వేదిక నుండే గడ్డం సమ్మయ్య పురోగమనం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అన్ని జిల్లాలలోనూ సమ్మయ్య కళా ప్రదర్శనలు ఇవ్వడానికి ప్రభుత్వం తోడ్పడింది. ప్రజలు ఆదరిస్తున్న తన మాతకళను జాతీయస్థాయి గౌరవాన్ని తీసుకురావాలన్న సంకల్ప బలంతో, చిందు యక్షగానంలో, నటనలో, వాచకంలో, గానంలో, సంభాషణల్లో ఆధునికతను అద్దుతూ 50 సంవత్సరాల సుదీర్ఘ కళాయానంలో చిందు యక్షగానం అంటేనే గడ్డం సమ్మయ్య అనేంతగా రాణించడంతో, జానపదులు జేజేలు పలికారు.
అంతరించిపోతున్న చిందు యక్షగాన కళను బతికిస్తూ, జాతీయస్థాయిలో తెలంగాణకు కీర్తి ప్రతిష్టలు తీసుక రావడంతో పాటు అంతర్జాతీయ కళాకారుడిగా సమ్మయ్య గౌరవం పొందాడు. ఒకవైపు అంటరానితనం వెంటాడుతున్నా, చదువుకోవాలన్న తపనతో ఆరవ తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగాడు. బాల కళాకారుడిగా రాణిస్తూనే నూనూగు మీసాల లేత వయసు నుండే కథానాయకుని పాత్రలు ధరిస్తూ చిందు యక్షగాన పెద్దల మెప్పు పొందాడు. ఐదు దశాబ్దాలలో సుమారు 18000 ప్రదర్శనలు ఇచ్చాడు. లోహితా క్యుడు, ప్రహ్లాదుడు, బాలవర్ధిరాజు వంటి బాల పాత్రల్లో మెప్పు పొందిన సమ్మయ్య సత్యహరిచ్చంద్ర, దుర్యోధనుడు, రావణుడు, అర్జునుడు, శ్రీకష్ణుడు, కీచకుడు, కంసుడు వంటి పాత్రల్లో స్త్రీ పాత్రలోనూ ఏ పాత్ర వేసినా ఆ పాత్రల్లో ఒదిగి ఉండి ఆ పాత్రకు వన్నె తెచ్చేవాడు. కథానాయకుని పాత్ర వేసినా, ప్రతినాయకుని పాత్ర వేసినా రక్తి కట్టించేవాడు.25 ఏళ్ల ప్రాయంలో శ్రీ రంజనితో పర్వతగిరిలో వివాహం జరిగింది. సమ్మయ్యకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె. పెద్ద కుమారుడు సోమరాజు తండ్రి వారసత్వం అందిపుచ్చుకొని చిందు యక్షగాన కళలో రాణిస్తున్నాడు.
పిడికెడంత అన్నంతో మద్దెల వాయిద్యానికి ”బోనం” తయారు చేయడంలో దిట్ట. సమ్మయ్య తయారుచేసిన మద్దెల బోనంతో మద్దెల వాయిద్యాన్ని ఖంగు ఖంగు మనిపించేవాడు. మద్దెల వాయించినా, తాళం మోగించినా, హార్మోణియం వాయించినా సమ్మయ్య శైలి ప్రత్యేకంగా ఉండేది. చిందుకళా బందంలో సమ్మయ్యది ప్రత్యేక ఒరవడి. మాదిగ కులానికి అశ్రితకులంగా ఉన్న చిందుకళాకారులను సమాజం అంటరాని వారిగా చూసే విధానం తనూ అనుభవించాడు. అవమానాలను ఎదుర్కొంటూనే చిందుకళను ముందుకు నడిపించాడు. కళను బతికిస్తూ ఆసక్తి ఉన్న యువకులకు శిక్షణ ఇస్తూ జాతీయస్థాయికి ఎదిగాడు. ఆలిండియా రేడియోలో, దూరదర్శన్‌ లో, సాంస్కతిక పర్యాటక శాఖలో వేలాది ప్రదర్శనలు ఇచ్చాడు. ఢిల్లీ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో ప్రదర్శనలు ఇచ్చిన సమ్మయ్య కళా రత్న బిరుదు అందుకున్నాడు. సమ్మయ్యకు పద్మశ్రీ రావడంతో తెలంగాణ జానపదం జాతీయ స్థాయిలో శిరసెత్తుకుని మరోసారి నిలిచింది.

Spread the love