ప్రతిభకి పట్టం

ప్రతిభకి పట్టంఅసిక్నీ నదీతీరాన ఏనుగు ఒక గురుకులాన్ని నడుపుతోంది. ఆ అడవిలోని సమస్త పశుపక్ష్యాదుల పిల్లలూ అక్కడే విద్యనభ్యసించేవి. మృగరాజు కుమారుడైన యువకిశోరం కూడా అక్కడే చదువుకునేది. ఏనుగు ఉత్తమ గురువని ప్రసిద్ధి పొందటంతో ఇరుగుపొరుగు వనవాసులు కూడా తమ బిడ్డలను అక్కడే చేర్చి, చదివించేవి. ఆశ్రమంలోని విద్యార్ధులలో ఒక జింకపిల్ల అత్యుత్తమ ప్రతిభ కనబరిచేది. ఎప్పుడూ ప్రథమ స్ధానంలో ఉత్తీర్ణత సాధించి, గురువు ప్రశంసలు, సహాధ్యాయిల అభినందనలు అందుకునేది. ఇది పిల్ల సింహానికి కంటగింపుగా మారింది. దానికి ఎప్పుడూ ద్వితీయ స్ధానమే లభించేది. ఎంత ప్రయత్నించినా, పైచేయి సాధించలేక పోవటంతో జింక మీద ఈర్ష్య, గురువు మీద అనుమానం కలిగాయి. దానికి నక్కపిల్ల చెప్పుడు మాటలు ఆజ్యం పోసాయి.
”మిత్రమా! నువ్వు కాబోయే మహారాజు. అన్ని విషయాలలో అగ్రగామిగా ఉండాలి. అప్పుడే తగిన విలువ, గౌరవం దక్కుతాయి. లేకపోతే నీతో పాటు, మహారాజుకీ చిన్నతనం అవుతుంది. కాబట్టి ఇప్పుడే గురువు పక్షపాత బుద్ధిని నిలదీయాలి” అంటూ నూరిపోసింది. తన మనసుకు నచ్చిన మాటలు చెప్పిన నక్కపిల్లని మెచ్చుకుని, సరాసరి గురువుని సమీపించి ఇలా అంది పిల్ల సింహం… ”గురువర్యా! నేను ఎంత ప్రయత్నించినా జింకపిల్లని అందుకోలేక పోతున్నా! అహోరాత్రులు కృషి చేసి చదివినా అగ్రస్ధానం ‘అందని ద్రాక్ష’ గా మారింది. కాబోయే మహారాజుని కాదని, ఒక సామాన్యమైన జింకపిల్లపై మీరు శ్రద్ధ చూపించటం భావ్యం కాదు” అంది. ఆ దుడుకు మాటలకి ఏనుగు మనసులో నొచ్చుకున్నా, వెంటనే తేరుకుని ”నాయనా! విద్యార్జన విషయంలో పేదా, ధనిక తేడాలు ఉండవు. చిన్నా,పెద్దా తారతమ్యాలు లేవు. ‘శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం’ అన్నారు పెద్దలు. కాబట్టి జింకపిల్ల చూపించినటువంటి ధ్యాస నువ్వు కూడా కనబరిస్తే ప్రధమస్ధానం నీకే దక్కుతుంది” అంది. కానీ ఆ మాటలు పిల్ల సింహాన్ని సమాధానపరచ లేకపోయాయి.
”లేదు గురువర్యా! నేను నిద్రాహారాలు మాని, కఠోర దీక్షతో చదువుతున్నాను. అయినా నాకు తగిన ఫలితం అందలేదు. కావాలంటే నక్కపిల్లని అడగండీ” అంది. వెంటనే నక్కపిల్ల ”నిజమే! గురువర్యా! పిల్లసింహం ఏకాగ్రతతో చదువుతూ పరిసరాలను, మరిచిపోతుంటే, నేనే గుర్తు చేసి, వేళకి ఆహారాన్ని అందిస్తున్నాను” అంది వంతపాడుతూ. ఏనుగు భారంగా నిశ్వసించి ”నాయనా! స్వీయ లోపంబులెరుగుట పెద్ద విద్య’ అని లోకోక్తి. నీ బలహీనత ఎరుగక తొందరపడి మాట్లాడుతున్నావు” అంది. పిల్ల సింహం అయోమయంగా చూసి, ”ఏమిటా లోపం గురువర్యా” అంది.
”నువ్వు మిగిలిన అంశాలలో మెరుగ్గానే ఉన్నా, ఒక్క లెక్కలలో మాత్రం చాలా బలహీనంగా ఉన్నావు. గణితంలో మరింత సాధన పెంచాలి. దానికి ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలి” అంది చిరునవ్వుతో.
పిల్లసింహం బుద్ధిగా తలాడించి ”అలాగే గురువర్యా!” అంటూ అప్పటినుండి ప్రత్యేక తరగతులకు హాజరు కావటం ప్రారంభించింది. ఎలాగైనా జింకపిల్లని అధిగమించాలనే కృత నిశ్చయంతో కఠోర శ్రమ చేసింది. కానీ జింకపిల్లపై ఆధిక్యం సాధించలేక పోయింది. విచిత్రమేమిటంటే జింకపిల్ల ప్రత్యేక తరగతుల అవసరం లేకుండా మామూలుగానే చదువుతోంది. దానితో పిల్ల సింహం కుంగిపోయి ”మిత్రమా! నేనిక చదువు చాలించాలను కుంటున్నాను” అంటూ నిర్వేదంగా పలికింది. నక్కపిల్ల ఓదార్చుతూ ”బాధ పడకు మిత్రమా! రాబోయే అర్ద సంవత్సరపు పరీక్షలలో నువ్వు గురుకులానికే ప్రధముడిగా నిలుస్తావు. నామీద భారం వేసి, నిశ్చింతగా చదువు. నేను చూసుకుంటాను” అంటూ భరోసా ఇచ్చింది. ఆ మాటలకు పిల్లసింహం ఊరడిల్లి మళ్ళీ సాధన చేయసాగింది.
కొన్ని దినాలకు పరీక్ష వచ్చింది. నక్కపిల్ల ఇచ్చిన మాట నిలబెట్టు కుంటుందనే ధీమాలో పిల్లసింహం ఉంది. అన్నట్టుగానే తన బాధ్యత నెరవేర్చింది నక్కపిల్ల. జింకపిల్ల వ్యాహ్యాళికి పోయి వస్తున్న మార్గంలో రెండు నక్కలు కాపు కాసాయి. రాగానే దురుసుగా ”నువ్వు ఈ పరీక్షలు రాయటానికి వీలులేదు!” అంటూ దౌర్జన్యం చేసాయి. జింకపిల్ల దీనంగా చూసి ”పరీక్ష రాయకపోతే చదువు వృధా అవుతుంది. అయినా నేను రాయటం వల్ల మీకేంటి నష్టం?” అంది. నక్కలు వికటంగా నవ్వి ”గురుకులంలో ఎప్పుడూ నువ్వే ప్రధమ స్ధానంలో నిలుస్తున్నావు. ఎవరికీ అవకాశం రానీయటం లేదు. నిన్ను అడ్డు తొలగిస్తే కాబోయే రాజైన పిల్లసింహం అగ్రస్ధానం సాధిస్తుంది” అన్నాయి. జింకపిల్ల విస్మయపడి ”గొప్ప స్ధానాన్ని కష్టపడి సాధించాలి గాని, ఇలా అడ్డదారులు తొక్కికాదు” అంది.
”అవన్నీ మాకు తెలియవు. నువ్వు మర్యాదగా చెప్పినట్టు చేస్తావా? లేదా?” అంటూ గద్దించాయి నక్కలు. జింకపిల్ల ”నన్ను పరీక్ష రాయనివ్వండి!” అంటూ ప్రాధేయపడటంతో నక్కలు ఆగ్రహంతో దాడి చేసాయి. తీవ్రంగా కొట్టి కొన ఊపిరితో వదిలి వెళ్ళి పోయాయి.
జింక పిల్ల రానందుకు నక్కపిల్ల సంతసించింది. ఈసారి పరీక్షల్లో ప్రధమ శ్రేణిలో నిలిచి, తన చిరకాల వాంఛ నెరవేరటం ఖాయమని హాయిగా నిట్టూర్చింది పిల్లసింహం. ఎప్పుడూ పరీక్షలు మానని జింకపిల్ల, ఈసారి రాయకపోవటంతో ‘ఏమి జరిగిందోన’నే ఆందోళనకి గురైంది ఏనుగు. పరీక్ష పూర్తయ్యాక నక్కపిల్ల, పిల్లసింహం ప్రవర్తన గమనించి కీడు శంకించింది. మిగిలిన విద్యార్ధులతో వెదికించింది. చివరికి ఒక కాకి, జింకపిల్లని కోనేటికి పోయే దారిలో కనుగొంది. దాని కబురు విని హుటాహుటిన అక్కడికి చేరి, స్పహతప్పి పడి ఉన్న జింకపిల్లని చూసి, ఆశ్రమానికి తీసుకొచ్చి వైద్యం చేయించింది. కోలుకున్న జింక జరిగింది పూసగుచ్చటంతో ఆగ్రహానికి గురైన ఏనుగు, సరాసరి మృగరాజుని చేరి, జరిగిన దురంతంపై ఫిర్యాదు చేసింది.
సంగతి విన్న మృగరాజు మండి పడింది. పిల్ల సింహం ‘నాకేమీ తెలియద’ని వాదించింది, మొదట బుకాయించినా, తర్వాత భయపడిన నక్కపిల్ల ”మా గురువర్యులు ప్రశ్నా పత్రాన్ని జింకపిల్లకి ముందే వెల్లడించి, ప్రథమ స్ధానం పొందటానికి సాయం చేస్తున్నారు. కష్టపడి చదువుతున్న యువరాజు ద్వితీయ స్ధానంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అందుకే ఇలా చేసాను” అంటూ ఆరోపణ, సమర్దనా మిళితం చేసింది. అది విన్న గురువు ఏనుగు ఆవేదన చెందింది. మృగరాజు కాసేపు తల పంకించి ”సరే! ఇందులో నిజానిజాలు ఇప్పుడే తేలుస్తాం. గురువర్యా! తక్షణం వీరిద్దరికీ చిన్న ప్రశ్నాపత్రం తయారు చేసి ఇవ్వండి. మా సమక్షంలో రాస్తారు” అంది. వెంటనే ఏనుగు అలా చేయగానే పిల్లసింహం, జింకపిల్ల పరీక్ష రాసాయి. అందులో జింక పిల్లకి తొంభైశాతం, పిల్ల సింహానికి ఎనభై శాతం ఫలితాలు వచ్చాయి. దాంతో నక్కపిల్లా, పిల్లసింహం సిగ్గుతో తలదించుకున్నాయి.
మృగరాజు ఆగ్రహంతో లేచి ”నేరం రుజువైనందున చేసిన నక్కపిల్లకి, ప్రేరేపించిన యువరాజుకీ మన అడవి చట్టం ప్రకారం కఠిన దండన…” అంటుంటే ఏనుగు అడ్డుపడింది. ”మహారాజా! తెలియక తప్పు చేసిన చిన్న పిల్లలని క్షమించండి. మరోసారి ఇలా జరగదని నేను భావిస్తున్నాను” అని విన్నవించింది. ఆ విజ్ఞాపనని అయిష్టంగా మన్నించిన మహారాజు ”ప్రతిభని ప్రోత్సహించాలి గాని, పాడు చేసి పైకి రావాలని ప్రయత్నించ కూడదు. ఇంతటి ఉత్తమ విద్యార్ధిని గౌరవించటం మనకి ఎంతో గర్వకారణం అవుతుంది. మా తదనంతరం యువరాజు పరిపాలనలో మహామంత్రి పదవిలో జింక పిల్లని నియమిస్తాం” అంటూ వాగ్దానం చేసింది. అది విన్న కొలువుకూటం హర్షాతిరేకంతో పులకించింది.
– డా||కౌలూరి ప్రసాదరావు, 7382907677

Spread the love