సీఎం ప్రధాన సలహాదారులు సోమేశ్‌కుమార్‌కు సీఐటీయూ వినతి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఐకేపీ వీఓఏల సమ్మె పరిష్కారం కోసం చొరవ చూపి సీఎం కేసీఆర్‌తో స్పష్టమైన ప్రకటన చేయించాలని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు బి.సోమేశ్‌కుమార్‌ను సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ కోరారు. సీఎం ప్రధాన సలహాదారులుగా నియమితులైన ఆయన్ను వారు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వీఓఏలు చేస్తున్న సమ్మె గురించి వివరించారు. వారి డిమాండ్లను ప్రస్తావించారు. వారికి రూ.3,900 వేతనం మాత్రమే అందుతున్న దన్నారు. దాంతో వారి కుటుంబాలు గడవటం కష్టమైతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చినప్పటికీ పనికి తగిన గుర్తింపు గానీ, వేతనం గానీ ఇవ్వడం లేదని వాపోయారు. రోజురోజుకీ వారిపై పని భారం పెంచుతూ పని భద్రత కల్పించకుండా విస్మరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె పరిష్కారం కోసం చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్తానని హామీనిచ్చారు. సెర్ప్‌ సీఈఓ సందీప్‌ కుమార్‌ సుల్తానియాతో మాట్లాడుతాననీ, చర్చలకు యూనియన్‌ ప్రతినిధి బృందాన్ని పిలవాలని కోరతానని చెప్పారు.

Spread the love