మెరుగైన సేవలకు పౌరసమాజం ఎదురు చూపు..

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పన కోసం ఈ ప్రాంతం పౌరసమాజం ఎదురు చూస్తున్న ఎన్నో ఏళ్ళ కల నేటికి నెరవేరింది. ప్రస్తుత ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కృషి,ఈ ప్రాంతంపై పూర్వ కలెక్టర్ అనుదీప్ పెట్టిన శ్రద్ధ, డి.సీ.హెచ్.గా ఈ నియోజక వర్గం వాసి అయిన డాక్టర్ రవిబాబు దృష్టి సారించడం తో ఎట్టకేలకు అశ్వారావుపేట కు వంద పడకల ఆసుపత్రి మంజూరు చేస్తూ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉత్తర్వులు ఇవ్వడం మే గాక రూ 37 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేయడం తో పౌర సమాజం హర్షం వ్యక్తం చేస్తుంది. పూర్వాపరాలు లోకి వెళ్తే.. మండల కేంద్రం అయిన అశ్వారావుపేట లో ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో  ప్రాధమిక ఆరోగ్య కేంద్రంగా సేవలు అందిస్తున్న పి.హెచ్.సి ని 1998 లో వైద్యం విధానం పరిషత్ వారు సామాజిక ఆరోగ్య కేంద్రం( సి.హెచ్.సి) గా మార్చారు.అప్పటిలో స్థానిక మూడు రోడ్ల కూడలిలో గల ఈ ఆసుపత్రి సేవలు అందజేసింది. 2012 లో సమీకృత మాతా శిశు సంరక్షణ కోసం నిర్మించిన భవనం ఖాలీ గా ఉండటంతో  ఈ భవనంలోకి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 2018 లో రూ.35 లక్షలు వెచ్చించి 30 పడకలు ఆసుపత్రి గా అప్ గ్రేడ్ చేసారు.ప్రస్తుతం నిపుణులైన వైద్యులు ఎవరూ లేరు.సివిల్ అసిస్టెంట్ రెగ్యులర్ ఒకరు,కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వారు తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు.మొత్తం క్యాడర్ స్ట్రెంగ్త్ 47 మందికి గారు 16 పోస్టులు ఖాలీగా ఉన్నాయి. ఎక్స్ రే ప్లాంట్,స్కానింగ్ పరికరాలు ఉన్నా నిపుణులు లేకపోవడం తో ఆ పరికరాలు నిరుపయోగంగా ఉంటున్నాయి.చాలీ చాలని భవన సముదాయం తోను రోగులు,వైద్యులు ఇక్కట్లు అన్నీ ఇన్ని కావు.
వంద పడకల ఆసుపత్రిలో 27 విభాగాల్లో సేవలు అందించడానికి 73 మంది సిబ్బంది అవసరం ఉంటుంది. చూద్దాం సేవలు విస్తరిస్తా రో లేక పాత పద్ధతినే కొనసాగిస్తారో..
Spread the love