విభజన చట్టంలోని అన్ని అంశాలపై సీఎం నజర్‌..

CM Nazar all aspects of Partition Act..– ప్రత్యేక నివేదికనివ్వాలంటూ ఆర్థిక శాఖకు ఆదేశాలు
–  ఏపీ నుంచి ఉద్యోగుల బదిలీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోని సర్కార్‌
– తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంటున్న ఉన్నతాధికారులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదేండ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ ఈనెల రెండు నుంచి తెలంగాణకు మాత్రమే రాజధానిగా మారిన నేపథ్యంలో…ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఏపీతో ముడిపడిన ఇతరత్రా అంశాలపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఆఫీసులు, భవనాలతోపాటు విభాగాల వారీగా విభజన చట్టంలోని అన్ని అంశాలపై ప్రత్యేక నివేదిక రూపొందించాలంటూ ఆయన ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ, ఏపీ మధ్య గత పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆయన ఉన్నతాధికారులతో ఆరా తీశారు. ఇందుకు సంబంధించి ఇటీవల పలు కీలక సమావేశాలను సీఎం నిర్వహించినట్టు తెలిసింది. అయితే రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కొత్త నిర్ణయమూ తీసుకోలేదు. తెలంగాణ ఏర్పడిన రెండేండ్లలోనే ఈ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిన సంగతి విదితమే. అయితే ఉద్యోగుల విభజన సమయంలో ఆప్షన్లు, పోస్టుల లభ్యత ఆధారంగా తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగుల్లో కొందరు ఏపీకి, ఏపీకి స్థానికత ఉన్న వారిలో కొందరు తెలంగాణకు పంపిణీ అయ్యారు.
వైద్యావసరాలు, భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉండటం, పిల్లల చదువులు, సొంతిల్లు ఉన్నాయనే కారణాలతో కొందరు ఉద్యోగులు ఈ పంపిణీ జరిగిన తీరుతో ఇబ్బందులు పడ్డారు. మానవీయ కోణంలో తమ బాధను అర్థం చేసుకోవాలంటూ వారు పలుమార్లు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అదే సమయంలో తమ సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు అవకాశమివ్వాలని కోరుతూ తెలంగాణకు పంపిణీ అయిన 1,369 మంది ఉద్యోగులు సమ్మతిని తెలిపారు. 2021లో తెలంగాణ ప్రభుత్వం ఆయా ఉద్యోగుల వివరాలను సేకరించింది. వారి అభ్యర్థనల మేరకు ఏపీకి పంపేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ ‘నో ఆబ్జక్షన్‌’ను ఇచ్చింది. ఆ మేరకు ఒక సర్క్యురల్‌ను కూడా జారీ చేసింది.
ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా అక్కడి నుంచి తెలంగాణకు వచ్చేందుకు సిద్ధమైన 1,808 ఉద్యోగుల వివరాలను సేకరించింది. ఇక్కడకు వచ్చేందుకు వీలుగా వారు ఆప్షన్లు ఇచ్చారు. దీంతో శాశ్వతంగా తెలంగాణకు వెళ్లేందుకు సమ్మతి తెలిపిన జాబితాను ఇక్కడి ప్రభుత్వం తయారు చేసింది. 2022 సెప్టెంబరు 23న అప్పటి సీఎస్‌ సమీర్‌ శర్మ.. ఆనాటి తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు ఇదే అంశంపై లేఖ రాశారు. ఉద్యోగుల అభ్యర్థనను మానవీయ కోణంలో చూడాలని ఆ లేఖలో కోరారు. రెండు రాష్ట్రాల్లో అప్పటికే ఆప్షన్లు ఇచ్చిన ఉద్యోగుల పరస్పర బదిలీలకు తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉండగా ఇటీవల ఈ అంశంపై కొన్ని పుకార్లు షికార్లు చేశాయి.
ఈ నేపథ్యంలో రేవంత్‌ సర్కార్‌ తాజాగా స్పందించింది. ఉద్యోగుల బదిలీల వ్యవహారం గత ఎనిమిదేండ్లుగా నానుతున్న క్రమంలో విభజన చట్టంలోని అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య సమావేశాలు జరిగినప్పుడల్లా ఇది చర్చకొస్తోందని తెలిపింది. కానీ ఉద్యోగుల పరస్పర బదిలీలకు సంబంధించి ఇప్పటి వరకూ రెండు రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తేల్చి చెప్పింది. అయితే కొందరు ఉద్యోగులు ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్నట్టు ప్రచారం జరగటంతో సీఎం ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దనీ, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఆ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

Spread the love