నవతెలంగాణ – భద్రాచలం : భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సందర్శించి ఇక్కడ అందుతున్న వైద్యాన్ని చూడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి బృందం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ని సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రోగులతో మాట్లాడిన జాన్ వెస్లీ వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. అనంతరం ఏరియా హాస్పిటల్ ఇంచార్జ్ సూపరిండెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డితో మాట్లాడి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన ఆయన ఏజెన్సీ ప్రాంతల వైద్యంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు.
నాలుగు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న భద్రాచలం ఆస్పత్రికి ప్రతిరోజు 400 నుండి 600 వరకు రోగులు వస్తున్నారాని, ఆ స్థాయిలో రోగులుస్తున్న ఆస్పత్రికి కేవలం 19 మంది వైద్యులే ఉండటం సోచనీయమని అన్నారు. 55 మంది ఉండాల్సిన నర్సింగ్ సిబ్బందికి కేవలం 15 మంది మాత్రమే ఉన్నారని, సగానికి పైగా ఖాళీలు ఉంటే వాటిని పూరించాల్సిన పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారాని ఆరోపించారు. అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది లేక పేదవారికి ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షాల మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించే శానిటేషన్ కార్మికులకు సైతం చాలిచాలని వేతనాలు సకాలంలో అందటం లేదని అన్నారు. కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.11000 మాత్రమే ఇవ్వటం దుర్మార్గమని, ఆ వేతనం కూడా మూడు నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేయటం కార్మికుల పొట్ట కొట్టడమేనని వెస్లీ ధ్వజమెత్తారు.

ఈ ప్రాంత ప్రజలకు వ్యాపించే సీజనల్ వ్యాధులకు కావలసిన అన్ని రకాల మందులు కూడా అందుబాటులో లేవని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సందర్శించిన పాపాన్ని పోలేదని జాన్ వెస్లీ విమర్శించారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యంపై అధ్యయనం చేస్తున్నామని, ప్రభుత్వాస్పత్రిలో నెలకొన్న సమస్యలపై ఆగస్టు మాసంలో హైదరాబాదులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకించి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సిబ్బంది కొరతపై త్వరలోనే సీపీఐ(ఎం) బృందం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళుతుందని తెలిపారు.
ప్రధానంగా భద్రాచలంలో నెలకొన్న సిబ్బంది కొరత ముఖ్యమంత్రి చొరవ తీసుకొని పరిష్కారం చూపకపోతే.. భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యమం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఎంతో ఘనమైన చరిత్ర గల భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పార్థివ దేహాన్ని తరలించే వాహనం కూడా లేక భుజాలపై మూసుకో వెళ్ళటం చూస్తుంటే ప్రభుత్వం ఏజెన్సీ వైద్యంపై చూపుతున్న వివక్షత స్పష్టమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు, సున్నం గంగా, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి వెంకట రామారావు, డి సీతాలక్ష్మి, సంతోష్, 20వ వార్డు మెంబర్ ఇరుప అనసూర్య, పట్టణ నాయకులు నాదెల లీలావతి, కొలగాని రమేష్, దొనకొండ రాఘవయ్య, కనక శ్రీ చట్ట శ్రీనివాసరావు, కోరాడ శ్రీను, సంద్ర ఉపేంద్ర, కుంజా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




