– కొత్త సర్కారు ఆదుకుంటుందనే ఆశతో సర్పంచుల ఎదురుచూపు
– పదవీ కాలం దగ్గర పడ్డా ఇంకా పెండింగ్‌లోనే బిల్లులు
– 14 నెలలుగా అందని ఎస్‌ఎఫ్‌సీ నిధులు
– 20 మంది దాకా ఆత్మహత్య చేసుకున్న వైనం
– ఫిబ్రవరి రెండో తేదీతో గడువు ముగింపు
మా పదవీ కాలం దగ్గర పడుతున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినం. చేసిన పనులకు బిల్లులు రాక..వడ్డీల భారం భరించలేక..అప్పులోల్లకు ముఖం చూపలేక నిత్యం చస్తూ బతుకుతున్నం. ఏడాది నుంచి స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్‌ఎఫ్‌సీ) నిధులు కోసం ఎదురుచూస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే 20 మంది దాకా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నరు. రేవంత్‌రెడ్డి సారూ దండం పెడ్తున్నాం. పదవీ కాలం అయిపోయేసరికి పెండింగ్ బిల్లులు ఇప్పించండి. పార్టీలతో సంబంధం లేకుండా న్యాయం చేస్తే రుణపడి ఉంటాం’ రాష్ట్రంలో ఏ సర్పంచిని కదిలించినా వినిపిస్తున్న మాట ఇదే.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
”ఊరికే(పైకే) పెద్దరికం…అప్పుల గురించి ఎవరికి చెప్పుకోలేని దౌర్భాగ్యం’ అన్నట్టు తయారైంది సర్పంచుల పరిస్థితి. పెండింగ్ బిల్లులన్నింటినీ విడుదల చేసేదాకనైనా తమను పదవుల్లో ఉంచాలనే సర్పంచుల వేడుకోలును కొత్త ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా? ఫిబ్రవరి రెండో తేదీ నుంచి ప్రత్యేక అధికారుల పాలనకు ఆదేశిస్తుందా? పదవీ కాలాన్ని పెంచుతుందా? వారిపై దయతలచి రానున్న బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుందా? ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సహకాలు ఈ ప్రభుత్వ హయాంలోనైనా అందుతాయా? ఈ పశ్నలకు సమాధానం కోసం కొంత కాలం వేచిచూడాల్సిందే.
గ్రామ పంచాయతీ కార్యాలయాలు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు, ఇలా అనేక అభివృద్ధి పనులను సర్పంచులు చేశారు. ప్రభుత్వం నిధులిస్తుందనే దీమాతో అప్పులు చేసి మరీ చేపట్టిన పనులకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలకు ఎస్‌ఎఫ్‌సీ నుంచి 14 నెలలుగా నిధులు రావడం లేదు. ఇవే రూ.4,480 కోట్ల దాకా పెండింగ్‌లో ఉన్నాయి. పంచాయతీలకు అందాల్సిన పెండింగ్ బిల్లులన్నీ కలిపితే రూ.10 వేల కోట్ల దాకా ఉంటాయని సర్పంచులు చెబుతున్నారు. శ్మశాన వాటికలకు సంబంధించిన బిల్లుల్లో 10 శాతాన్ని చెల్లించాల్సి ఉంది. క్రీడా ప్రాంగణాలకు కూడా బిల్లులు అందలేదు. కొత్త పంచాయతీల్లో , కార్యాలయాలు లేని గ్రామాల్లో కొత్త గ్రామ పంచాయతీ కార్యాల యాలు కట్టేందుకు రాష్ట్ర సర్కార్ గ్రీన్‌సిగల్ ఇచ్చింది. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోయినా చేతుల నుంచి పెట్టు కుని కొందరు, అప్పులు చేసి మరికొందరు సర్పంచు లు తమ హయాంలో ఊర్లో పంచాయతీ కార్యాలయం కట్టామనే పేరు వస్తుందనే ఉత్సుకతతో ముందడుగు వేసి పనులు పూర్తిచేయించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద చేపట్టిన జీపీల నిర్మాణాలకు ఇప్పుడు బిల్లులు రాక తలలు పట్టుకుంటున్నారు.’మాది చిన్న గ్రామపంచాయతీ. 1400 జనాభా ఉంటుంది. మా ఊర్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల కింద గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టిస్తున్నా. స్లాబు పడింది, గోడలు అయిపోయాయి. పనులు చివరి దశలో ఉన్నాయి. రూ.20 లక్షల దాకా ఖర్చుపెట్టిన. ఇప్పటిదాకా పైసా నిధులు రాలేదు. క్రీడా ప్రాంగణం నిర్మిస్తే రూ.90 వేలు అయ్యాయి. ఆ బిల్లూ రాలేదు. వార్డుమెంబర్లు, కాంట్రాక్టర్లు తమ పైసలు పెట్టి సీసీ రోడ్డు వేయించారు. డ్రెయినేజీ పనులు చేయించారు. వారికీ రూ.10 లక్షలకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మా ఒక్క ఊరికే రూ.30 లక్షల దాకా బకాయిలు ఉన్నాయి’ అని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అల్లందేవి చెరువు సర్పంచి, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్యగౌడ్ తన ఆవేదనను వెళ్లగక్కాడు. ప్రజల ఒత్తిడితో గ్రామాల్లోని వార్డుల్లో వివిధ పథకాల కింద సీసీరోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలు కూడా చేపట్టారు. వాటికీ బిల్లులు ఇవ్వని దుస్థితి. 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వస్తున్నా గ్రామపంచాయతీ మెయింటనెన్స్, సిబ్బంది జీతాలు, కరెంటు బిల్లుల చెల్లింపు, ఇతరత్రా ఖర్చులు, ఈఎమ్‌ఐల చెల్లింపులకు కూడా సరిపోని పరిస్థితి నెలకొంది. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కూడా అందట్లేదు. రూ. 20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు జీపీలకు ఇస్తామని ప్రకటించిన నిధులనూ గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ ఫండ్ వస్తుందనే ఆశతో పనులు చేయించిన సర్పంచులు ఇప్పడు బిల్లులు రాక తిప్పలు పడుతున్నారు.
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సహకాలివ్వలేదు
సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధికి రూ.10 లక్షలు ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ముందడుగు వేసి తమ నిధుల నుంచి అదనంగా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇస్తామని గొప్పలకు పోయారు. తమ ఊర్లు మరింత అభివృద్ధి చెందుతాయనే ఆశతో చాలా ఊర్లలో ఏకగ్రీవంగా ఎనుకున్నారు. అలాంటి గ్రామ పంచాయతీలు రెండు వేలకుపైనే ఉన్నాయి. సర్పంచుల పదవీ కాలం ఫిబ్రవరి రెండో తేదీతో ముగియనున్నప్పటికీ రూ.10 లక్షల ప్రోత్సహకం ఇప్పటిదాకా ఆ గ్రామాలకు అందలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీ నీటిమీది రాతలాగే మిగిలిపోయింది.
కొత్త ప్రభుత్వమైనా పెండింగ్ బిల్లులివ్వాలి…
గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేసిన మాకు కాంగ్రెస్ ప్రభుత్వ మైనా పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి ఆదుకోవాలి. లేకుంటే వడ్డీల భారంతో సర్పంచుల అప్పులు మరింత పెరిగిపోతాయి. ఏడాది పాటు సర్పంచుల పదవి కాలం పొడిగించాలి. అలాకాని పక్షంలో స్థానిక సంస్థల కు ఎన్నికలు నిర్వహించే దాకా మమ్ముల్నే సర్పంచులుగా కొనసాగించాలి.
సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్
రెండు, మూడేండ్లుగా బిల్లులివ్వకపోవడం దారుణం
తమ పాలనలో గ్రామాలను బాగా అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో పనిచేసిన సర్పంచుల పట్ల గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగాలేదు. అధికారులు ఉరుకులుపరుగులు పెట్టించి మరీ పనులు చేయించారు. సొంతంగా, అప్పులు చేసి పనులు చేయించారు. రెండు, మూడేండ్లు గడుస్తున్నా బిల్లులు ఇవ్వకపోవడం దారుణం. సర్పంచులు అప్పులోళ్ల బాధలు ఏగలేక చస్తూ బతుకుతున్నారు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా పెండింగ్ బిల్లులను ఇప్పించాలి.
సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి