పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాలు

Commemoration Weeks of Police Martyrs– అన్ని పోలీస్‌స్టేషన్లలో 10రోజులపాటు సంస్మరణ దినోత్సవాలు
– ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు పలు కార్యక్రమాలకు శ్రీకారం
–  పోలీస్‌ శాఖతో ప్రజల భాగస్వామ్యానికి పెద్దపీఠ
నవతెలంగాణ-సిటీబ్యూరో
పోలీసులంటేనే కొందరకి తెలియని భయం ఉంటుంది. ఖాకీ డ్రెస్‌ చూడగానే మరికొందరిలో ఓ రకమైన అభిప్రాయం.. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలన్నా తెలియని ఆందోళన.. పై అధికారో, రాజకీయ నాయకులో లేదా తెలిసిన వారితోనో ఫోన్‌ చేయించుకోనిదే పోలీస్‌ స్టేషన్‌లో కాలుపెట్టలేమన్న సంకోచం.. ఇలాంటి వారిలో భయం పోగొట్టి, పోలీసులపై నమ్మకం కల్పించేందుకు ఈసారి ఘనంగా వారోత్సవాలకు శ్రీకారం చుట్టారు.. పోలీసులపై వ్యతిరేకత, అనుమానాలకు తావులేకుండా పౌరుల్లో మంచి అభిప్రాయం వచ్చే విధంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాలను అదుపు చేస్తున్న విధానం, చేపట్టిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 10రోజులపాటు నిర్వహించే వారోత్సవాల్లో ప్రజల భాగస్వామ్యానికి పెద్దపీఠ వేస్తున్నారు.
పోలీస్‌ ఫ్లాగ్‌ డే పేరుతో సంస్మరణ దినోత్సవాలు
పోలీస్‌ అమర వీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్‌ ఫ్లాగ్‌ డే పేరుతో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లోని గోషా మహల్‌ స్టేడియంలో 21, (నేడు) పోలీస్‌ ఫ్లాగ్‌ డే పరేడ్‌ను నిర్వహిస్తున్నారు. పోలీసుల సేవలు, వారి విధులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. ఈ నెల 21 నుంచి అక్టోబర్‌ 31 వరకు పోలీస్‌ ఫ్లాగ్‌ డే పేరుతో సంస్మరణ దినోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ పది రోజుల్లో పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు, విధినిర్వహణలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, పోలీసుల నుంచి ప్రజలు మరే ఇతర సేవలను ఆశిస్తున్నారో తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. రాష్ట్రంలోని ప్రతి పోలీస్‌ స్టేషన్లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని నిర్వహించి, పోలీస్‌ శాఖ చేస్తున్న కషిని, సేవలను యువతకు, పౌరులకు తెలియజేస్తారు.
విద్యార్థులు, పోలీస్‌ అధికారులకు పోటీలు
పోలీస్‌ అమరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థినీవిద్యార్థులకు వ్యాస రచన, వకృత్త్వ పోటీలు, వివిధ స్థాయిల్లో పోలీస్‌ అధికారులకు సైతం వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. ‘సమర్థవంతమైన పోలీసింగ్‌ కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగం’ అనే అంశంపై 12వ తరగతిలోపు విద్యార్థులకు తెలుగు, ఉర్దూ భాషల్లో వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నారు. ‘సోషల్‌ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర’ అనే అంశంపై డిగ్రీ ఆపై స్థాయి విద్యార్థులకు వ్యాసరచన పోటీలుంటాయి. ఈ పోటీలను ఆయా జిల్లాల్లల్లో, జోన్‌లలోనే నిర్వహిస్తున్నారు.
‘సమాజంలో సమానత్వాన్ని కాపాడడంలో పోలీసుల పాత్ర’
‘పోలీసులకు – పని జీవిత సమతుల్యత’ అనే అంశంపై అన్ని యూనిట్లలోని ఏ.ఎస్‌.ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ స్థాయిలోని పోలీస్‌ అధికారులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ‘సమాజంలో లింగ సమానత్వాన్ని కాపాడడంలో పోలీసుల పాత్ర’ అనే అంశంపై ఎస్‌.ఐ స్థాయి అధికారులకు వ్యాసరచన పోటీలను ఏర్పాటు చేశారు.
అమర వీరుల కుటుంబాల బాగోగులపై ఆరా
సీనియర్‌ పోలీస్‌ అధికారులు పోలీస్‌ అమరుల ఇండ్లను సందర్శించనున్నారు. అమరుల కుటుంబాలు, వారి బాగోగులు, వారి అవసరాలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. రాష్ట్రంలో పోలీసింగ్‌ అంశంపై ఫోటోగ్రఫీ కాంపిటీషన్‌, స్వల్ప నిడివి గల వీడియో కాంపిటీషన్‌లను ప్రదర్శిస్తారు. బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపులు, సైకిల్‌ ర్యాలీలను కూడా నిర్వహించనున్నారు.

Spread the love