- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నా రెడ్డి
నవతెలంగాణ-వనపర్తి: భారతదేశ ప్రజలకు అవసరమైన డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలను రైతులు సాగు చేసి అత్యధికంగా లాభాలను పొందాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం స్థానిక దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో జిల్లా ఉద్యానవనాలు, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంటల మార్పిడిపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో పాటు ప్రణాళికా సంఘం అధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా.జి.చిన్నా రెడ్డి మాట్లాడుతూ.. 140 కోట్ల మంది జనాభా కలిగిన భారత దేశంలో ప్రజలకు అవసరమైన మేరకు ఆయిల్ గింజలు, పప్పు దినుసులు లేవని వాటిని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకొవటానికి మన ఫోరెన్సిక్ నిల్వలు బయటి దేశాలకు వెళ్లి పోతున్నాయని చెప్పారు. అందుకే మన దేశంలోనే ఆయిల్ గింజలు సాగు చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.
నూనె గింజల్లో అత్యధికంగా ఆయిల్ వచ్చే పంట కేవలం పామాయిల్ పంటకే ఉందని, అత్యధికంగా లాభసాటి పంట ఏదైనా ఉందంటే అది పామాయిల్ పంట అని కొనియాడారు. అందుకే రైతులు వరి పంట కాకుండా పామాయిల్, పప్పు గింజలు, కూరగాయల వైపు దృష్టి మళ్లించాలని సూచించారు. తన 90 ఎకరాల పొలంలో 75 ఎకరాలు పామాయిల్ సాగు చేస్తున్నట్లు తెలిపారు. పామాయిల్ సాగుకు ప్రభుత్వం మొక్కకు సబ్సిడీ నుంచి ఎరువులు, డ్రిప్, గుంతలు తవ్వడానికి, 4 సంవత్సరాల పాటు అంతర్ పంట సాగుకు సైతం ప్రభుత్వం సబ్సిడీనిస్తుందని అన్నారు. రైతులు పామాయిల్ పంట సాగు చేసి దాదాపు 30 సంవత్సరాల పాటు అత్యధికంగా లాభాలు పొందాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ రైతులు తమ భూములను సారవంతంగా ఉంచుకొని వరి కి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు అవగాహన కల్పించడానికి ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రైతు భూ సారా కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు రైతు ఉత్పత్తిదారుల సంస్థ (Former Producer Organisation) లో సభ్యత్వం తీసుకోవాలని తద్వార కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే అనేక పథకాలకు అర్హత సాధిస్తారని సూచించారు. అదేవిధంగా ప్రతి రైతు కిసాన్ క్రెడిట్ కార్డు పొందటం, సహకార సంఘంలో సభ్యత్వం తీసుకోవడం వంటివి చేయాలని చెప్పారు.
పామాయిల్ పంట వేసుకునేందుందుకు ముందుకు వచ్చే రైతులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి పామాయిల్ సాగు చేస్తున్న రైతుల వద్దకు తీసుకువెళ్లి అవగాహన కల్పిస్తామని చెప్పారు. రైతులు వరి మాత్రమే కాకుండా ఇతర పంటల సాగు వైపు దృష్టి సారించాలని కోరారు.





