కమ్యూనల్‌, కార్పొరేట్‌ శక్తులను నిలువరించాలి

Communal and corporate forces should be restrained– కేంద్రం విధానాలను నిరోధించాలి
– సీఐటీయూ నిర్వహించిన ఇష్టాగోష్టిలో వక్తలు
– బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలపై చార్జిషీట్‌..
– కొత్త వేషాలతో ప్రజలను మభ్యపెడుతున్న మోడీ
– భావోద్వేగాలు రెచ్చగొట్టి మళ్లీ గెలిచేందుకు కుట్ర
– మరోసారి గెలిస్తే కార్మిక హక్కులు హననం
– మతాన్ని పాలనలో జొప్పిస్తే..ప్రమాదమే
– రణం లేని మరణం మనకొద్దు..పోరాడి హక్కుల్ని సాధించుకుందాం… సీఐటీయూ నిర్వహించిన ఇష్టాగోష్టిలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నది. తిరిగి మరో సారి అధికారంలోకి రావటం కోసం కొత్త కొత్త వేషాలతో ప్రజల ముందుకు వస్తున్నది. భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని కుయుక్తులు పన్నుతున్నది. ఇది దేశ ఐక్యతకు ప్రమాదకరం.దీన్ని నిలువరించాల్సిన బాధ్యత కార్మిక వర్గానిదే. అందుకు ఐక్య ఉద్యమాలే మార్గం. పోరాడి సాధించుకున్న హక్కులను సైతం మోడీ ప్రభుత్వం హరిస్తున్న నేటి పరిస్థితుల్లో రణం లేని మరణం మనకొద్దంటూ పోరాటాలకు పదును పెడదాం. కార్మిక వర్గం పక్షాన నికరంగా నిలబడదాం’. అంటూ కార్మిక సంఘాలు ప్రతిన బూనాయి. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం..”కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామం”టూ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆయా సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను సర్కారు దృష్టికి తీసుకుపోవాలని తీర్మానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు అధ్యక్షతన ‘కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ కార్మిక సంఘాలతో ఇష్టాగోష్టి’ ని నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ దేశంలో మరో మారు భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కార్మికులు,రైతులు, కూలీలు, మొత్తం ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలు కనుమరుగైతాయని చెప్పారు. ఇలాంటి సమయంలోనే కార్మిక వర్గం మరింత చైతన్యంతో ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో కూడా మతతత్వ శక్తుల బలం పెరిగిందన్నారు. ఈ ప్రమాదాన్ని గమనించకపోతే..తప్పు చేసిన వారమవుతామని హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ బీజేపీ అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గానికి వ్యతిరేకంగా అది అనుసరిస్తున్న విధానాలపై చార్జిషీట్‌ ప్రకటిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మరో సారి లబ్దిపొందేందుకు ‘అక్షింతల’ కార్యక్రమాన్ని బీజేపీ చేపడుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో షెడ్యూల్‌ పరిశ్రమల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై క్షేత్ర స్థాయి వరకు 50లక్షల కుటుంబాలను కలిసి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసఫ్‌, బాలరాజు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వానికి ప్రజా పోరాటాలంటే..దున్నపోతుమీద వర్షం పడ్డట్టుగా ఉందని విమర్శించారు.బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం కార్మికులకు, రైతులకు పేదలకు మేలు జరగదని చెప్పారు. అది కార్పొరేట్ల ప్రయోజనాలకోసమే పని చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కనీస వేతనాల బోర్డులో అన్ని సంఘాలకు ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కీం వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. ఐఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు విజరుకుమార్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేండ్లుగా కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరించాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలు నెరవేరుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక నియంతను ఓడించాం.మోడీని కూడా ఓడించాల్సిందేనన్నారు. అనురాధ మాట్లాడుతూ పాలకులు ఎవరైనా వారి వర్గ ప్రయోజనం ఒకటేనన్నారు. హెచ్‌ఎంఎస్‌ నాయకులు శ్రీనివాస్‌ మాట్లాడుతూ కార్మికుల హక్కులు హరించే ఏ ప్రభుత్వమైనా..దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిందేనని చెప్పారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ ప్రమాదాన్ని నిలువరించకపోతే..దేశం కష్టాల పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐయూటీయూసీ నాయకులు భరత్‌ మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేసే వరకు పోరాటాలు నిర్వహించాలని కోరారు. సీజీ కాన్ఫెడరేషన్‌ నాయకులు వి నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవశ్యకత కార్మిక వర్గంపై ఉందన్నారు. మతతత్వాన్ని నిలవరించటమంటే..సెక్యులరిజాన్ని కాపాడుకోవటమేనన్నారు. గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు ఎస్‌ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ కొత్త కొత్త వేషాలతో మోడీ ప్రజలను మాయ చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్‌ ఫెడరేషన్‌ నాయకులు చంద్రయ్య, ఎం. ఉమా నాగమణి(ఐఎన్‌టీయూసీ), ఎస్‌ఎల్‌ పద్మ, అరుణ(ఐఎఫ్‌టీయూ), ఎంకె. బోస్‌ (టీఎన్‌టీయూసీ), ఎంవి. హరీష్‌ బాబు, తిలక్‌ (ఆర్బీఐ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌), కృష్ణ మోహన్‌ (కాన్ఫడరేషన్‌ ఆఫీసర్స్‌ ఆర్గనైజేషన్‌), ఎం, జనార్ధన్రెడ్డి, నర్సింగరావు (పెన్షనర్స్‌), టి. సురేష్‌కుమార్‌ (పోస్టల్‌ పెన్షనర్స్‌), ఎ. నాగేశ్వరరావు, భానుకిరణ్‌ (టీఎంఎస్‌ఆర్‌), ఎండి, సర్దార్‌ (పీఏసీఎస్‌), సీఐటీయూ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ జె. వెంకటేష్‌, ఎస్‌.వి రమ, వంగూరు రాములు, జె. మల్లిఖార్జున్‌, విఎస్‌. రావు, బి. మధు, కె. ఈశ్వర్‌రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సుధాకర్‌, జె. కుమార్‌ స్వామి, ఎ. సునీత తదితరులు పాల్గొన్నారు. చివరగా జాతీయ క్యాంపెయిన్‌లో భాగంగా రాష్ట్ర కార్మిక సమస్యలపై కార్యాచరణ నివేదికను పాలడుగు భాస్కర్‌ ప్రతిపాదించగా నేతలందరూ ఆమోదించారు.
తీర్మానాలు…
– రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో మతతత్వ శక్తులను ఓడించాలి.
– రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిని ప్రకటించాలి
–  కనీస వేతనాల బోర్డుతో పాటు అన్ని బోర్డులలో అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలి.
–  రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి
–  లేబర్‌ కోడ్లను అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలి
–  సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్దరించాలి.

Spread the love