హైదరాబాద్‌లో పోటాపోటీ ర్యాలీలు

Competitive rallies in Hyderabad– జగన్‌కు మద్దతుగా ఐటి ఉద్యోగుల కార్ల ర్యాలీ
–  చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి అభిమానుల ఆందోళనలు
హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు మద్దతుదారులు ఆదివారం పోటాపోటీగా ఆందోళనలు చేశారు. జగన్‌కు మద్దతుగా ఐటి ఉద్యోగులు కార్లతో ర్యాలీ చేపట్టగా, చంద్రబాబుకు మద్దతుగా నందమూరి సుహాసిని ఆందోళనలో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌ మధురానగర్‌లో ‘ఐయామ్‌ విత్‌ సిబిఎన్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుహసిని పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు మంచి విజన్‌ ఉన్న నాయకుడని, ఆయనను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇలాంటి అరెస్టులతో టిడిపిని ఆపలేరని, ఇంకా బలోపేతం అవుతామని చెప్పారు. ఇసిఐఎల్‌లో టిడిపి మద్దతుదారులు మౌనదీక్ష నిర్వహించారు. వనస్థలిపురంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఎల్బీనగర్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, బిజెపి కార్పొరేటర్‌ కొప్పుల నరసింహారెడ్డి తదితరులు టిడిపి అభిమానులకు సంఘీభావం తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. పనామా సర్కిల్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది.ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా హైదరాబాద్‌లోని ఐటి ఉద్యోగులు కీసర ఔటర్‌ రింగ్‌ రోడ్‌ నుంచి గచ్చిబౌలి వరకు కార్ల ర్యాలీ నిర్వహించారు. జై జగన్‌.. అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. స్కామ్‌ చేశారు కాబట్టే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్‌ అయ్యారని ఐటి ఉద్యోగులు అన్నారు. ఒఆర్‌ఆర్‌ కట్టింది.. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ తెచ్చింది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని, ఇక్కడ చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదనీ తెలిపారు. ఫైనాన్‌షియల్‌ డిస్ట్రిక్‌, గచ్చిబౌలి వచ్చింది వైఎస్‌ఆర్‌ హయాంలోనేనని వారు పేర్కొన్నారు.

Spread the love