కేసులపై కేంద్ర శాఖల గోప్యత

–  ఐదేండ్లుగా వీడని మొద్దు నిద్ర
న్యూఢిల్లీ : కేంద్రానికి చెందిన పలు మంత్రిత్వ శాఖలు తమపై దేశంలోని వివిధ న్యాయస్థానాలు, ట్రిబ్యునల్స్‌లో దాఖలైన కేసుల వివరాలను సంబంధిత పోర్టల్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చట్టపరమైన అంశాలలో పురోగతిని వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం లీగల్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బ్రీఫింగ్‌ సిస్టమ్‌ (ఎల్‌ఐఎంబీఎస్‌) పేరుతో ఓ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్‌లో గత ఐదు సంవత్సరాలుగా కొన్ని మంత్రిత్వ శాఖలు తమపై న్యాయస్థానాలలో ఉన్న కేసుల పరిస్థితిని తాజా పరచడం లేదని న్యాయ శాఖ తెలిపింది. పోర్టల్‌లో ఉన్న సమాచారాన్నే నిటి ఆయోగ్‌, క్యాబినెట్‌ సచివాలయం ఉపయోగించుకుంటాయి. నలభై ఎనిమిది మంత్రిత్వ శాఖలు, ఇతర శాఖలకు సంబంధించిన 76 వేలకు పైగా కేసుల వివరాలను 2018 నుంచి పోర్టల్‌లో తాజా పరచడం లేదు.
వీటిలో రైల్వే శాఖదే ప్రథమ స్థానం. ఈ శాఖ 31,502 కేసుల వివరాలను తాజా పరచలేదు. ఆర్థిక, కార్మిక, ఉపాధి శాఖ 12,436 కేసులు, విద్యా శాఖ 3,706, హోం వ్యవహారాలు 3,000 కేసుల వివరాలను తాజా పరచలేదు. మొత్తం పెండింగులో ఉన్న కేసుల వివరాలలో ఈ మూడు మంత్రిత్వ శాఖలవే 80% ఉన్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలు, వాటి అనుబంధ శాఖలకు సంబంధించి ప్రస్తుతం న్యాయస్థానాలలో 5.72 లక్షల వ్యాజ్యాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసుల తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు పోర్టల్‌లో ఉంచేలా సంబంధిత వ్యక్తులను ఆదేశించాలని కోరుతూ కేంద్ర న్యాయ శాఖ ఇటీవలే వివిధ మంత్రిత్వ శాఖలకు సమాచారం పంపింది.

Spread the love