స్క్రాప్ ఆటోలకు రిఫెక్లిటివ్
ఆటోడ్రైవర్లను వేధించేందుకే…
జీవో నెంబర్ 60పై సర్వత్రా వ్యతిరేకత
ఐపోయిన పెండ్లికి బాజాలు ఎలా కొట్టాలో రవాణాశాఖ అధికారుల్ని చూసి నేర్చుకోవాలి. ‘తుక్కు’ నిబంధనలు తప్పని తెలుసు. అయినా వాటిని మార్చే ప్రయత్నం చేయరు. తలాతోక లేని కండీషన్లతో సామాన్యుల్ని వేధిస్తుంటే ‘ఆ మజా’నే వేరు అన్నట్టే వ్యవహరిస్తుంటారు. తుక్కు కిందకు మారే ఆటోలకు పైసలు ఖర్చుపెట్టి మళ్లీ ‘పెండ్లి కొడుకు’ లెక్క ముస్తాబు చేసి వైభవంగా తీసుకొస్తేనే… వాటిని ‘స్రాప్’ లోకి తీసుకుంటామని చెప్తున్నారు. ముక్కున వేలేసుకొని, ఫక్కున నవ్వుకొనే ఇలాంటి కండీషన్లు రవాణాశాఖలో కోకొల్లలు! టేపులు అతికించాలని ఫిట్టింగ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
పాత ఆటోలను తుక్కు(స్క్రాపింగ్) చేసే నిబంధనలు గమ్మత్తుగా ఉన్నాయి. ఆ ‘తుక్కు’ ఆటోలకు కూడా ఫిట్‌నెస్ సర్టిఫికెట్టు ఉండాలట! అక్కడితో ‘కామెడీ’ ఐపోలేదు. ‘తుక్కు’లోకి వెళ్లే ఆటోలకు ఛళ్లున మెరిసే రెడ్ కలర్ రిఫ్లెక్టర్ టేప్స్ (రేడియం స్టిక్కర్లు) కూడా అతికించాలట!! ఇక ఒరిజినల్ ఆర్‌సీ, ఇన్సూరెన్స్ పేపర్లూ ఉండాలి. చలాన్లు ఏవీ పెండింగ్‌లో ఉండరాదు. అవన్నీ పూర్తిచేస్తేనే ‘పాత ఆటో’ ను తుక్కుకిందకు తీసుకుంటారు. మరి టైర్లు కొత్తవి ఉండాలో లేక పాతవైనా పర్లేదో అధికారులు చెప్పట్లేదు. ముందే ఆటో నడవక, దాని లైఫ్ టైం పూర్తి అయ్యి దాని యజమాని నానా అవస్థలు పడి, చివరకు దాన్ని తుక్కు కింద అమ్మేసుకుందామంటే ఇన్ని నిబంధనల్ని రవాణాశాఖ విధించింది. దాదాపు 15-20 ఏండ్లు నడిచిన ఆటోల్లో కచ్చితంగా ఏదో ఒక కాగితం లేకపోవడమో, లోపం ఉండటమో తప్పనిసరి. వాటిని ‘చూసి చూడనట్టు’ వదిలేయాలంటే ‘బ్రోకర్ల’ దరికి చేరాల్సిందే. అంటే ఆటోను తుక్కుగా మార్చుకోవాలన్నా, ఆర్టీఏ అధికారులు చేతులు తడపాల్సిందే. దాని కోసమే ఇలాంటి తలతిక్క నిబంధనలు విధిస్తున్నారని బాధిత ఆటో డ్రైవర్లు మొత్తుకుంటున్నారు. పాత ఆటోను ‘తుక్కు’ కిందకు మార్చినట్టు ఆర్టీఏ అధికారి ధృవీకరించి, సర్టిఫికెట్ ఇస్తేనే కొత్త ఆటో కొనుగోలుకు ఉన్న అడ్డంకులు తొలుగుతాయి. పాత ఆటో సతాయిస్తుంటే, దానికి మరమ్మతులు చేయించలేక అప్పోసొప్పో చేసి ఫైనాన్స్‌లో కొత్త ఆటో కొనాలంటే ఈ గండాలన్నీ దాటి గట్టెక్కడం ఆటో డ్రైవర్లు, యజమానులకు కష్టంగా మారింది. ఇలాంటి తలాతోక లేని నిబంధనలు ఎందుకు పెడతారని రవాణాశాఖ ఉన్నతాధికారిని ప్రశ్నిస్తే, ‘అప్పుడేగా వాళ్లు బ్రోకర్ల దగ్గరికి వెళ్లేది…మాకు తలో రూపాయి వచ్చేది’ అని అర్ధం వచ్చేలా సమాధానం చెప్పారు. స్క్రాపింగ్ ఆటోలకు కేవలం ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసిన అధికారులు, ఇప్పుడు అదనంగా రిఫెక్లిటివ్ టేపులు కూడా తప్పనిసరి చేస్తూ నిబంధనలు తీసుకొచ్చారు. దీనివెనుకా ప్రయివేటు దోపిడీ లేకపోలేదు. రిఫ్లెక్టివ్ టేప్స్ కోసం తెచ్చిన జీవో నెంబర్ 60 అమలు కావాలంటే కచ్చితంగా ప్రయివేటు కంపెనీల రేడియం స్టిక్కర్లను కొనాల్సిందే. ఇవన్నీ ఆటోడ్రైవర్లపై అదనపు ఆర్థిక భారాలే. ఈ నిబంధనలపై సీఐటీయూ, ఆటో డ్రైవర్ల యూనియన్లు భగ్గుమంటున్నాయి. ‘ఇవేం పిచ్చి చేష్టలు’ అని నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఆటోకు రూ.5వేలకుపైగా భారం
పాత ఆటోను తుక్కుగా మార్చి కొత్త ఆటో కొనుగోలు చేయాలంటే పాత వాహనాన్ని స్క్రాప్ చేయడం తప్పనిసరి. అయితే ఈ తుక్కు వాహనానికి కూడా రిఫెక్లిటివ్ టేపులను తప్పనిసరి చేయడంపై కార్మిక సంఘాల నేతలు, ఆటో కార్మికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఒక ఆటోను స్క్రాప్ చేయాలంటే ప్రభుత్వ ఫిట్‌నెస్ ఫీజు రూ.1,035తోపాటు ఇన్సూరెన్స్, ఇతర పనుల కోసం మొత్తం రూ. 3వేల నుంచి రూ. 4వేల వరకు ఖర్చవుతుంది. స్క్రాప్‌కి వెళ్లే బండి పూర్తిగా పాడైపోయి ఉంటుంది కాబట్టి, దానిని స్క్రాప్ సెంటర్‌కు లాక్కెళ్లడానికి మరో వాహనానికి అదనంగా రూ. వెయ్యి చెల్లించాల్సి వస్తుంది. దాదాపు రూ.5వేలకుపైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీనికితోడు ఒక్కో ఆటోకు రెండు మీటర్ల రేడియం స్టిక్కర్‌ను అంటబెట్టాలట! నిజానికి టోయింగ్ ద్వారా నేరుగా స్క్రాప్ యార్డ్‌కు వెళ్లే బండికి ఈ రేడియం స్టిక్కర్లు ఎందకో అధికారులకే తెలియాలి.
ఆర్థిక సంక్షోభంలో ఆటో కార్మికులు
ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాల ప్రభావంతో ఆటో డ్రైవర్ల ఆదాయం పడిపోయింది. దీనికి తోడు పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలు, ట్రాఫిక్ చలానాలు, ఫైనాన్స్ కంపెనీల వాయిదాలు చెల్లిస్తే రోజువారీ పూట గడవడం కూడా కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో పాత ఆటోను తుక్కుగా మార్చేందుకు కూడా డబ్బు ఖర్చు చేయాల్సి రావడంపై ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధంలేని నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
స్క్రాప్ బండ్లకు రిఫ్లెక్టివ్ టేపులు ఎందుకు?
స్క్రాప్‌కు తీసుకెళ్లే పాత ఆటోలకు రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు తప్పనిసరి చేసి, దాదాపు రూ. 170 వరకు వసూలు చేయడం సరైనది కాదు. జీవో నెంబర్ 60 ప్రకారం స్క్రాప్‌కి వెళ్లే బండికి రేడియం స్టిక్కరింగ్ తప్పనిసరి అని ఎక్కడా లేదు. అధికారులు దీనిపై సరైన అవగాహన లేకుండా ప్రయివేటు కంపెనీలకు దోచిపెట్డడం కరెక్టు కాదు. స్క్రాప్ చేస్తే వచ్చేది రూ.5వేల లోపే. దానికి తోడు ట్రాన్స్‌పోర్ట్, ఫిట్‌నెస్ ఖర్చులు, స్టిక్కర్ చార్జీలు డ్రైవర్లకే భారంగా మారుతున్నాయి. తక్షణమే ప్రభుత్వం జీవో నెంబర్ 60ను సవరించాలి.
పుప్పాల శ్రీకాంత్, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్-సీఐటీయూ
మినహాయింపు ఇవ్వాలి
రవాణా శాఖ జీవో నెంబర్ 60 ను సవరించి, స్క్రాప్‌కు వెళ్లే వాహనాలకు రిఫెక్లిటివ్ టేపుల నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలి. రోడ్డుపై తిరిగే వాహనాల భద్రత కోసం రిఫెక్లిటివ్ టేపు ఉపయోగపడుతుంది. టోయింగ్ ద్వారా నేరుగా స్క్రాప్ యార్డ్‌కు వెళ్లే బండికి రిఫెక్లిటివ్ టేపు వేసి, ఎంవీఐ ద్వారా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకో వాలనడం అస్సలు లాజిక్ లేని పని.
-ఏ.సత్తిరెడ్డి, ప్రెసిడెంట్, తెలంగాణ ఆటో డ్రైవర్స్ సమాఖ్య
రవాణాశాఖలో తలతిక్క నిబంధనలు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



