కలెక్టరేట్ ఎదుట మూడో విడత ఇందిరమ్మ లబ్దిదారుల ధర్నా
నిరసనకారుల్ని ఈడ్చుకెళ్లిన పోలీసులు
న్యాయం జరిగే వరకు కదలబోమన్న పేదలు
నినాదాలతో మారుమోగిన జనగామ కలెక్టరేట్
తోపులాట, వాగ్వాదంతో ఉద్రిక్తత
సీపీఐ(ఎం) నాయకుల అరెస్ట్, విడుదల
ఇంటి నెంబర్లు కేటాయించి, వసతులు కల్పించాలి: సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ- జనగామ
నిలువు నీడ కోసం ఎన్నో ఏండ్లుగా పోరాడి సాధించుకున్న ఇండ్లకు నెంబర్లు కేటాయించి, వసతులు కల్పించాలని కోరుతూ జనగామ మూడో విడత ఇందిరమ్మ లబ్దిదారులు ఆందోళన బాటపట్టారు. శనివారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు జనగామ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గంటల తరబడి అక్కడే బైటాయించారు. తాము నిర్మించుకున్న ఇండ్లకు వెంటనే ఇంటి నెంబర్లు కేటాయించాలని కోరారు. అలాగే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో నివసిస్తున్న 72 మంది లబ్దిదారులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించే వరకు కలెక్టరేట్ నుంచి కదిలే ప్రసక్తిలేదని ఆందోళనను కొనసాగించారు. అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని, అప్పటి వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న పేదలు, సీపీఐ(ఎం) నాయకుల్ని అరెస్టు చేసేందుకు పోలీసులు దూకుడుగా ప్రవర్తించారు. సీపీఐ(ఎం) నాయకులను ధర్నా నుంచి పోలీసులు లాక్కెళ్ళి అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. నాయకులు, లబ్దిదారులతో పోలీసులు వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. దాంతో ఇందిరమ్మ లబ్ధిదారులు, సీపీఐ(ఎం) నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో ఆ ప్రాంతమంతా నినాదాలతో దద్దరిల్లింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పాల్గొని మాట్లాడుతూ 2012-13లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 1,146 మంది పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చినప్పటికీ స్థలాలు చూపించలేదన్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో లబ్దిదారులను గుర్తించి, ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిలో గుడిసెలు వేసుకుని నివాసం ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఆ సమయంలో అధికారులు వాటిని తొలగించే ప్రయత్నం చేయడంతో లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారన్నారు. పేదలను ఇబ్బంది పెట్టవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు, సీపీఐ(ఎం) నాయకులతో చర్చించి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అర్హులైన వారికి డ్రా పద్ధతిలో ప్లాట్ నెంబర్లు కేటాయించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మారిపోవడం, అధికారులు బదిలీ కావడంతో ప్రస్తుతం రీ-సర్వే పేరుతో లబ్దిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా ఉన్నప్పుడు జనగామ మున్సిపాలిటీ ద్వారా ఇంటి నెంబర్లు కేటాయించేందుకు ఫైలు సిద్ధం చేశారని, సంతకం చేసే దశలో ఆయన బదిలీ కావడంతో ప్రక్రియ నిలిచిపోయిందన్నారు.
ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆ ఫైలును తిరిగి పంపించారన్నారు. ఇండ్ల సమస్యను జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, వారంతా పేదల పట్ల సానుకూలంగా స్పందించి కలెక్టర్‌కు అనుమతి లేఖ ఇచ్చినా ఇప్పటికీ ఇంటి నెంబర్లు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. మూడో విడత ఇందిరమ్మ లబ్డిదారుల ఇండ్లకు వెంటనే నెంబర్లు కేటాయించి, విద్యుత్, తాగునీరు, రహదారుల వంటి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకునేందుకు రూ.5 లక్షల రుణ సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ధర్నా అనంతరం నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ(ఎం) నాయకులు, పేదలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నిలువ నీడ కోసం పేదల ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



