వచ్చేది కాంగ్రెస్‌ సర్కారే…

– రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర
– పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం
– ప్రతి పేద మహిళ ఖాతాలో ఏడాదికి రూ.లక్ష జమ
– రైతు రుణమాఫీ
– అన్ని పంటలకూ ఎమ్‌ఎస్‌పీ
– ‘అగ్నివీర్‌’కు కొత్త విధానం
– నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ద్వారా ఉపాధి కల్పన : సరూర్‌నగర్‌ జనజాతర సభలో రాహుల్‌గాంధీ హామీ
– రాష్ట్రం నుంచి ఇండియాకు భారీ బహుమతి ఇవ్వాలని పిలుపు
– రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశంలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పారు. ప్రతీ పేద మహిళ బ్యాంక్‌ అకౌంట్లో ఏడాదికి రూ.లక్ష జమ చేస్తామని వాగ్దానం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, రంజిత్‌ రెడ్డి, చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ… భారత రాజ్యాంగమనేది పుస్తకం కాదు, అది పేద ప్రజల గుండె చప్పుడని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంతోనే పేదలకు బలమైన శక్తి వచ్చిందన్నారు. అంతటి మహోన్నతమైన రాజ్యాంగ రూపకల్పన కోసం అంబేద్కర్‌, గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ లాంటి మహానుభావులు తమ చెమటను, రక్తాన్ని ధారపోశారని తెలిపారు. ఇప్పుడు దాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని హెచ్చరించారు. ఆ పార్టీ కుట్రలు, కుతంత్రాలను అడ్డుకునేందుకు ఇండియా కూటమి శాయశక్తులా పోరాడుతున్నదని చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, తాను, రేవంత్‌రెడ్డి కృషి చేస్తామని భరోసానిచ్చారు. పదేండ్ల బీజేపీ హయాంలో దేశంలోని సంపదంతా కేవలం రెండు శాతంగా ఉన్న బిలియనీర్ల చేతుల్లోకి పోయిందని రాహుల్‌ గాంధీ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ, అంబానీ లాంటి 22 మంది వ్యాపారుల కోసమే మోడీ పని చేశారని విమర్శించారు. రూ.లక్షల కోట్ల ప్రజల సొమ్మును వారికి పంచారని ఆరోపించారు. కాషాయ పార్టీ ఇన్ని రోజులు దేశ సంపదను పెట్టుబడిదారులకు పంచిందనీ, తాము అధికారంలోకి రాగానే ఆ సొమ్మును పేదలకు పంచుతామని వివరించారు. పేదరికాన్ని సమూలంగా నిర్మూలించేందుకు తాము గొప్ప పథకాన్ని రూపొం దించామనీ, అధికారంలోకి రాగానే పేదల జాబితా తయారు చేస్తామని చెప్పారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్న అన్ని అంశాలనూ అమలు చేస్తామని భరోసానిచ్చారు. మోడీ తన దివాళాకోరు విధానాలతో దేశంలో నిరుద్యోగుల సంఖ్యను పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే విద్యార్థులకు నైపుణ్యాలపై శిక్షణనివ్వటం ద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పిస్తామని హామీనిచ్చారు.
విషం చిమ్ముతున్న బీజేపీ నేతలు : సీఎం రేవంత్‌
ఇటీవల రాష్ట్రానికి విచ్చేసిన ఓ బీజేపీ నాయకురాలు మాట్లాడుతూ 15 సెకన్ల సమయం ఇస్తే మైనార్టీలను తుద ముట్టిస్తామంటూ వ్యాఖ్యలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన విశ్వ నగరంలో ఆ పార్టీ నేతలు ఈ రకంగా విషం చిమ్ముతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మనం అన్ని పండుగలు చేస్తున్నాం. హిందూత్వం గురించి బీజేపీ వాళ్లు మనకు నేర్పాలా..? జనాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన ఆ బీజేపీ మహిళా నేతపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి, అరెస్టు చేయాలి…’ అని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. ఆమె మాటలను సమర్థించకపోతే వెంటనే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని ఆ పార్టీ నేతలను ఆయన కోరారు. శ్రీరాముని కళ్యాణం, హనుమంతుడి జయంతి తదితర ఉత్సవాలు, పండుగలను మనం చేసుకోవటం లేదా..? ఇప్పుడే వాటిని చేస్తున్నట్టు బీజేపీ చెబుతున్నదని ఎద్దేవా చేశారు. ‘దేవుడు గుడిలో ఉండాలి…భక్తి గుండెల్లో ఉండాలి’ అని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. పేద ప్రజల కోసం రాహుల్‌ గాంధీ తన జీవితాన్నే అంకితం చేశారని తెలిపారు. ఈ క్రమంలో మన రాష్ట్రంలో 14 పార్లమెంట్‌ స్థానాల్లో ఇండియా కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చా రు. ఈ ఎన్నికలు మనకు జీవన్మరణ సమస్య అని హెచ్చరించారు. బీజేపీ ఏలుబడిలో ప్రమాదంలో పడిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కోరారు. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లపై మోడీ కండ్లు పడ్డాయన్నారు. అందువల్ల వాటిని కాపాడుకోవాలంటే ఇండియా కూటమిని బలపరచాలని పిలుపునిచ్చారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, లాయర్లు, డాక్టర్లు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు… ఇలా అన్ని వర్గాల ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు.

Spread the love