రివర్స్‌ గేమ్‌

– కాంగ్రెస్‌పై మోడీ అభాండాలు
– అదానీ, అంబానీలతో ఒప్పందం కుదుర్చుకున్నదంటూ ఆరోపణలు
– వారిద్దరి సంపద పెంచింది కాషాయ ప్రభుత్వమే
– అవకతవకలు జరిగినా చర్యలు తీసుకోలేదు
– రాజన్న సాక్షిగా ప్రధాని అబద్ధాలు
న్యూఢిల్లీ: తెలంగాణలోని కరీంనగర్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారసభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ఓ కొత్త అస్త్రాన్ని బయటికి తీశారు. గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్తలు గౌతమ్‌ అదానీ, ముకేష్‌ అంబానీలతో కాంగ్రెస్‌ ఒప్పందం కుదుర్చుకున్నదని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం ఈ ఇద్దరు వ్యాపార దిగ్గజాలకూ అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్షాలు ఎప్పటి నుండో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోడీ వీరిద్దరికీ దేశాన్ని అమ్మేశారని అవి మండిపడుతున్నాయి. కానీ మోడీ మాత్రం రివర్స్‌గేర్‌లో ప్రతిపక్షాలనే నిందించడం ప్రారంభించారు. అదానీ, అంబానీల నుండి ఎంత సొమ్ము తీసుకున్నారో, వారి నుండి ఎంత బ్లాక్‌మనీ పొందారో చెప్పాలంటూ మోడీ ఆ సభలో రాహుల్‌ను ప్రశ్నించారు. ఎన్నికల ప్రకటన వెలువడే వరకూ అదానీ, అంబానీ నామస్మరణ చేసిన రాహుల్‌, కాంగ్రెస్‌ పార్టీ ఆ తర్వాత వారి ఊసే ఎత్తడం లేదని చెప్పారు. అయితే ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. ‘ఇప్పుడు దేశంలో ఏం జరుగుతోందంటే ఇద్దరు అమ్మకందారులు, ఇద్దరు కొనుగోలుదారులు ఉన్నారు. అమ్మకందారులేమో మోడీ, అమిత్‌ షా. కొనుగోలుదారులు అదానీ, అంబానీ’ అని గత 24న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. గత నెల 12న కోయంబత్తూరులో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ ప్రసంగిస్తూ ‘నరేంద్ర మోడీ, అదానీ విధానాలు రెండు భారతదేశాలను సృష్టించాయి. ఒకటేమో బిలియనీర్ల దేశం. రెండోదేమో పేదల దేశం’ అని చెప్పారు. దేశంలో ఇద్దరు బిలియనీర్లు ఉన్నారని, వారి ఆస్తులు అనేక రెట్లు పెరిగిపోయాయని భారత్‌ జోడో యాత్ర సందర్భంగా కూడా రాహుల్‌ చెప్పారు.
తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకోబోయే ముందు అదానీ, అంబానీల గురించి ప్రజలు తీవ్రంగా ఆలోచించాల్సి ఉంటుందని మోడీ సరిగానే చెప్పారు. మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు బడా వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించినవేనని ఈ సంవత్సరం ప్రారంభంలో ఇండియా టుడే పత్రిక నిర్వహించిన మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పోల్‌లో 52 శాతం మంది అభిప్రాయపడ్డారు.
వారి సంపద పెరిగిపోతోంది
గత పది సంవత్సరాల కాలంలో అదానీ, అంబానీల సంపద గణనీయంగా పెరిగింది. కోవిడ్‌ కాలం సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఆ సమయంలో ఆర్థిక వృద్ధి స్తంభించిపోయింది. లక్షలాది మంది ప్రజలు జీవనోపాధి కోసం ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అంబానీ ఆసియాలోనే సంపన్నుడు. అదానీది రెండో స్థానం. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన పదిహేను మంది జాబితాలో వీరిద్దరి పేర్లూ ఉన్నాయి. మరోవైపు కుటుంబాల్లో పొదుపు తగ్గిపోతోంది. వాస్తవ వేతనాలు పడిపోతున్నాయి. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది.
అదానీ గ్రూపుపై చర్యలేవి?
వాటాల విలువను పెంచుకునేందుకు స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూపు అనేక అవకతవకలకు పాల్పడిందంటూ అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ సంస్థ వెల్లడించి పదిహేను నెలలు గడిచాయి. అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై సెబీ దర్యాప్తు జరిపింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసినప్పటికీ మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. హిండెన్‌బర్గ్‌ తర్వాత పలువురు ఫైనాన్షియల్‌ జర్నలిస్టులు కూడా అదానీ గ్రూపు అక్రమాలు, అవకతవకలను బయటపెట్టారు. అవకతవకలు జరిగాయని సెబీ నిర్ధారించినప్పటికీ ఇప్పటి వరకూ ఆ గ్రూపుపై పెద్దగా చర్యలేవీ తీసుకోలేదు.
మహువా, రాహుల్‌ ఉదంతాలలో…
తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకురాలు మహువా మొయిత్రాను లోక్‌సభ నుండి బహిష్కరించి నప్పుడు ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పార్లమెంటులో ఓ ప్రశ్నను లేవనెత్తినందుకే మోడీ ప్రభుత్వం ఆమెను లక్ష్యంగా చేసుకున్నదని ఆరోపణలు వచ్చాయి. అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మొయిత్రా సభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిని ఇష్టపడని మోడీ సర్కారు ఆమెను సభ నుండి బయటికి పంపింది. మొయిత్రా అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నేటి వరకూ సమాధానం చెప్పలేదు. అదానీ గ్రూపుపై ఆరోపణలు చేసినందునే తనపై అనర్హత వేటు వేశారని, ఆ గ్రూపునకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసినందుకు తనపై పరువునష్టం కేసు వేశారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా చెప్పారు.
కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం…
ఈ ఉదంతాలను గమనిస్తే అంబానీ, అదానీలకు కొమ్ము కాస్తోంది ఎవరో అర్థమవుతుంది. కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాల కోసం అహరహం శ్రమిస్తున్న మోడీ ప్రభుత్వం, ఎన్నికల వేళ ఆ నెపాన్ని కాంగ్రెస్‌పై రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. వాస్తవాలు ప్రజలందరికీ తెలిసినవే అయినప్పటికీ నవ్విపోదురు గాక…అన్న చందంగా వ్యవహరిస్తోంది.
అదానీ, అంబానీలకు ఇంత ప్రాచుర్యం ఎందుకు లభిస్తోంది? ఎందుకంటే మోడీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారని పరిశీలకులు గుర్తు చేశారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, విమానాశ్రయాల ప్రయివేటీకరణ, మైనింగ్‌ నిబంధనల్లో మార్పులు వంటివి ఇందులో భాగమే.

Spread the love