మా సమస్యలు పరిష్కరిస్తేనే ఓట్లేస్తాం..

– లేకుంటే బహిష్కరిస్తాం.. భద్రాద్రి జిల్లా పెద్ద వెంకటాపురం గ్రామస్తుల తీర్మానం
నవతెలంగాణ- ఆళ్ళపల్లి
”మా గ్రామ సమస్యలు పట్టించుకోని నాయకులకు ఓట్లెందుకు వేయాలి.. సమస్యలను పరిష్కరిస్తేనే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్లు వేస్తాం.. లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తాం” అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం పెద్ద వెంకటాపురం గ్రామస్తులు తీర్మానించారు. తమ గ్రామ ప్రధాన సమస్యలు తీర్చాకే ఓట్లడగటానికి రావాలని, అంతవరకు రావొద్దని గురువారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. గ్రామంలో సుమారు 500 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. గతంలో గెలిచిన నాయకులు తమ సమస్యలు పట్టించుకోకుండా మొఖం చాటేస్తున్నారని, అబద్ధపు హామీలిచ్చి, మాయ మాటలు చెప్పి పబ్బం గడుపు కుంటున్నారని విమర్శించారు. గతంలో అనేక పర్యాయాలు ఎన్నికల సమయం లో మోసపోయామని, అందుకే ఈసారి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మండల కేంద్రం నుంచి గ్రామానికి రహదారి సౌకర్యం, త్రీఫేస్‌ కరెంట్‌, తాగునీటి సౌకర్యం, సింగారం, బూసరాయి గ్రామాలకు వెళ్లడానికి బీటీ రోడ్లు, గ్రామంలో సెల్‌ టవర్‌ ఏర్పాటు, అంగన్వాడీ నూతన భవనం వెంటనే నిర్మించాలని కోరారు. వీటిని పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామని స్పష్టం చేశారు. పోడు భూములకు ఫారెస్ట్‌ అధికారుల నుంచి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ దొర, పటేల్‌లు వజ్జ సురేందర్‌, కొమరం నాగరాజు, మాజీ సర్పంచ్‌ వజ్జ నరసింహారావు, హరికృష్ణ, కల్యాణ్‌, వజ్జ సత్యం, వజ్జ వసంతరావు, శేఖర్‌, కె.లక్ష్మి, వి.పద్మ, భుజంగరావు, రాంబాబు, దేవకుమారి, సుజాత, రాజేష్‌, ఉమా, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

Spread the love