వేములవాడకు కోడెనూ ఇవ్వలేదు

– మోడీ నాయకత్వంలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం : రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ-హుస్నాబాద్‌ రూరల్‌
వేములవాడకు వచ్చిన నరేంద్ర మోడీ ఆలయ అభివృద్ధికి ఏదైనా ఇస్తారనుకున్నాం.. కానీ కోటి రూపాయలు కాదు కదా.. ఒక కోడె కూడా ఇవ్వలేదని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలోని తిరుమల గార్డెన్‌లో సీపీఐ నియోజకవర్గ నాయకులతో జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తేయాలనే కుట్రతో నరేంద్ర మోడీ ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు విజయానికి సీపీఐ నాయకులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. 30 సంవత్సరాల తరువాత మోడీ ప్రభుత్వం సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా వచ్చిందన్నారు. ఇప్పుడు ఇస్‌ బార్‌ చార్‌ సౌ అంటూ .. 400 సీట్లు వస్తాయని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. పైకి శ్రీరామ్‌.. లోలోపల రిజర్వేషన్లకు రాంరాం.. చెబుతున్నారన్నారు. దేశానికి ఏం చేశారో చెప్పుకోకుండా అక్షింతలు వచ్చాయా…? రాముడు ఫొటో వచ్చిందా అంటున్నారని విమర్శించారు. మొదటి, రెండో విడత పోలింగ్‌ తరువాత ప్రధాని దిగజారి మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, నియోజకవర్గస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love