ఎన్డీఏ కూటమికి 200 సీట్లు దాటవు

– టీమిండియాదీ అదే పరిస్థితి
– ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర బీఆర్‌ఎస్‌ 16 గెలిస్తే తెలంగాణ ప్రయోజనాలకు భరోసా : మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికైనా, టీమీండియాకైనా 200 సీట్లు దాటవనీ, ఏ కూటమికి మెజార్టీ సీట్లు రావని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత జగదీష్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. బీఆర్‌ఎస్‌ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ అనీ, బీజేపీ, కాంగ్రెస్‌లకు ఇతర రాష్ట్రాల ప్రయోజనాల ముందు తెలంగాణ ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. రాష్ట్రానికి అటు, ఇటు ఉన్న రాష్ట్రాల్లో తమ ప్రాబల్యం కోసం తెలంగాణ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన సందర్భాలున్నాయని ఉదహరించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో 16 సీట్లు బీఆర్‌ఎస్‌ గెలిస్తే … ఇక తెలంగాణ ప్రయోజనాలకు ఢోకా ఉండదని చెప్పారు.
ఇప్పటికీ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ బలంగా ఉందనీ, కేసీఆర్‌ బలమైన నేతగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీలకు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేక బీఆర్‌ఎస్‌ నుంచి నేతలను తీసుకుని టికెట్లు ఇచ్చారని చెప్పారు. దేశంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్‌ వన్‌గా సీఎం కేసీఆర్‌ తీర్చిదిద్దారని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ డెలివరీ చేసుకునే స్థాయికి వైద్యరంగాన్ని తీసుకెళ్లారనీ, గురుకులాలతో పేదలకు మెరుగైన విద్యనందించారని గుర్తుచేశారు. అలాగే వ్యవసాయ, దాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేసి ఆకలికేకల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా మార్చారని చెప్పారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు అధికంగా ఆశలు చూపించి, అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచి మోసం చేయడం మొదలుపెట్టిందని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్‌ మోసాలను గ్రహించి పార్లమెంటులో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ప్రధాని మోడీ, సీఎం రేవంత్‌ రెడ్డి ఇద్దరూ ఒక్కటేనని జగదీష్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌కు కేంద్రంలో ఉన్న బీజేపీ సహకరించలేదని తెలిపారు. కాళేశ్వరం నివేదికను కేంద్రం లీక్‌ చేసి సహకరించిందని ఉదహరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం తదితర విషయాలను ముందుకు తెచ్చి తాగునీరు, విద్యుత్‌ సమస్యలను చర్చకు రాకుండా కాంగ్రెస్‌ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. మైనార్టీలకు రిజర్వేషన్ల తొలగింపును సమర్దించేంది లేదని స్పష్టం చేశారు. యస్‌ఎల్‌బీసీని ప్రారంభించిన కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిదేండ్ల పాలనలో ఎందుకు పూర్తి చేయలేదని పోయిందని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే…కాంగ్రెస్‌ అలవి కాని హామీలను ఇచ్చి మోసం చేసిందే కాకుండా… ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తున్నదన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ ప్రజలకు ఉపయోగపడని చెత్త మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
రేవంత్‌ రెడ్డిని ఎందుకు వదిలేశారు? -మోడీకి సూటి ప్రశ్న
సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి డబ్బుల సంచులు మోస్తున్నారని ఆరోపిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న ఈడీ, సీబీఐ తదితర దర్యాప్తు సంస్థలు ఎందుకు మిన్నకుండిపోయాయో ప్రధాని వివరణ ఇవ్వాలని జగగీష్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇద్దరూ ఒక్కటయ్యారనేందుకు ఇదే నిదర్శనమని తెలిపారు.

Spread the love