కులం- మతం ఆధారంగా ఓటేయొద్దు

– వారిద్దరూ టూరిస్టులు.. ఇక్కడ ఉండరు
– తెలంగాణ కోసం తెగించి కోట్లాడేది బీఆర్‌ఎస్సే..
– మోడీ చేసిన అభివృద్ధి ఏమీ లేదు : బీఆర్‌ఎస్‌ యువ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్‌
నవతెలంగాణ- కంటోన్మెంట్‌
”కులం, మతం ఆధారంగా ఓటెయొద్దు.. మల్కాజిగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి సునితా మహేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ పొలిటికల్‌ టూరిస్ట్‌లు.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాత్రమే లోకల్‌.. ఉప్పల్‌లోనే ఉంటాడు.. కాబట్టి రాగిడిని భారీ మెజార్టీతో గెలిపించాలి” అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సికింద్రాబాద్‌ ఇంపీరియల్‌ గార్డెన్స్‌లో గురువారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ యూత్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతా మహేందర్‌ రెడ్డిది తాండూర్‌.. ఆమె చేవెళ్ల సీటు అడిగితే బలవంతంగా రేవంత్‌ రెడ్డి మల్కాజ్‌గిరి సీటు కట్టబెట్టారని తెలిపారు. అలాగే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ స్థానికుడు కాదని, హుజురాబాద్‌ అని అన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాత్రమే లోకల్‌ అని తెలిపారు. కావునా రాగిడి లక్ష్మారెడ్డిని, బీఆర్‌ఎస్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్నను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలకే గ్యారంటీ లేదు కాబట్టి ఆ పార్టీ నేతలు చెప్పే మాటలకు ఏం గ్యారంటీ ఉంటుందని ప్రశ్నించారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు హామీల అమలు గురించి రేవంత్‌ రెడ్డి నెలలు, తారీఖులు మారుస్తున్నారని విమర్శించారు. రేవంత్‌ పాలనలో కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్న ఇండిస్టీలు తరలిపోతున్నాయని అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. యాదాద్రిలాంటి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించామని గుర్తు చేశారు. యువత అంతా ఓటింగ్‌లో పాల్గొని నచ్చిన నాయకుడికి ఓటేయాలని సూచించారు. పదేండ్ల కింద మోడీ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్‌ ధర తగ్గినా దేశంలో పెట్రోల్‌ ధరలు తగ్గించలేదన్నారు. పదేండ్లలో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచి ప్రజల నుంచి రూ.30 లక్షల కోట్లు వసూలు చేశారని వివరించారు. అందులో నుంచి రూ.14.5 లక్షల కోట్లతో అంబానీ, అదానీల రుణాలను మాఫీ చేశారని ఆరోపించారు. ఇది నిజం కాదని బీజేపీ నేతలు చెబితే తాను రాజీనామాకు సిద్ధమని సవాల్‌ విసిరారు. ఎన్నికల్లో తెలంగాణ కోసం తెగించి కొట్లాడే బీఆర్‌ఎస్‌కే మద్దతివ్వాలన్నారు. ఓటు వేసిన అనంతరం వీవీ ప్యాట్‌ స్లిప్పులను కూడా చూసుకోవాలని సూచించారు. ఈ సమ్మేళనంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి, కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి, కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love